పొగాకు రైతులకు కేంద్రం తీపి కబురు
ABN , Publish Date - Sep 26 , 2026 | 05:24 AM
ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. 2025-26 పంట కాలంలో రాష్ట్రంలో అదనంగా పండించిన పొగాకుతో పాటు, నమోదు చేసుకోని రైతులు పండించిన పొగాకును కూడా అధికారిక వేలం కేంద్రాల ద్వారా విక్రయించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది.
అదనపు, అనధికారిక పొగాకు విక్రయాలకు అనుమతి
బార్న్‌కు రూ.50 వేల చొప్పున వడ్డీ లేని రుణానికి ఆమోదం
44 వేల మంది రైతులకు రూ.226 కోట్ల మేర ఉపశమనం
పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్
న్యూఢిల్లీ/అమరావతి/గుంటూరు(తూర్పు), సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. 2025-26 పంట కాలంలో రాష్ట్రంలో అదనంగా పండించిన పొగాకుతో పాటు, నమోదు చేసుకోని రైతులు పండించిన పొగాకును కూడా అధికారిక వేలం కేంద్రాల ద్వారా విక్రయించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శుక్రవారం గెజిట్ విడుదల చేసింది. మారుతున్న ప్రపంచ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో ఫ్లూ-క్యూర్డ్ వర్జీనియా (ఎఫ్‌సీవీ) పొగాకు రైతులకు సకాలంలో ఆర్థిక సహాయం అందించేందుకు ‘వడ్డీ లేని నిర్వహణ మూలధన సహాయ పథకం’ కింద ఒక్కో బార్న్‌కు రూ.50 వేల చొప్పున ఏకకాల వడ్డీ లేని రుణాన్ని ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికోసం దాదాపు రూ. 226 కోట్ల ఆర్థిక సహాయాన్ని డీబీటీ ద్వారా నేరుగా రైతులకు ఈ ఆర్థిక సహాయం అందించనున్నారు. పొగాకు బోర్డు చట్టం నిబంధనల ప్రకారం సాధారణంగా అనధికారిక, పరిమితికి మించిన పొగాకు విక్రయాలపై కఠిన ఆంక్షలు ఉంటాయి. అయితే, ప్రస్తుత పరిస్థితులు, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనల నుంచి సడలింపు ఇస్తున్నట్టు కేంద్రం పేర్కొంది.
నమోదు చేసుకున్న రైతులు కోటాకు మించి పండించిన అదనపు ఎఫ్‌సీవీ పొగాకును, అలాగే నమోదు చేసుకోని రైతులు ఉత్పత్తి చేసిన పొగాకును బోర్డు అధీకృత వేలం వేదికల్లో అమ్ముకునే వీలు కల్పించింది. పొగాకు బోర్డులో నమోదైన డీలర్లు, వ్యాపారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధారణ సర్వీస్ ఛార్జీలు చెల్లించి ఈ పొగాకును వేలం ద్వారా కొనుగోలు చేయడానికి అనుమతించింది. కేంద్రం నిర్ణయంతో రాష్ట్రంలోని సుమారు 44 వేల మంది పొగాకు రైతులకు రూ.226 కోట్ల మేర ప్రయోజనం కలుగుతుందని పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్ తెలిపారు. గుంటూరులోని ఐటిసిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లగా పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతుల తరఫున కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి..
ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్
హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ