సాలూరులో ఒక్క ఓటుతో గెలుపు
ABN , Publish Date - Nov 04 , 2026 | 06:23 AM
మున్సిపల్ ఫలితాల్లో కొన్నిచోట్ల అతి తక్కువ ఓట్లు విజేతను నిర్ణయించాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ ఎన్నికల్లో అయితే ఓ అభ్యర్థి కేవలం ఒక్క ఓటుతో విజయం సాధించారు.
సాలూరు/ఇచ్ఛాపురం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఫలితాల్లో కొన్నిచోట్ల అతి తక్కువ ఓట్లు విజేతను నిర్ణయించాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ ఎన్నికల్లో అయితే ఓ అభ్యర్థి కేవలం ఒక్క ఓటుతో విజయం సాధించారు. 25వ వార్డులో టీడీపీ అభ్యర్థి 418 ఓట్లు సాధించగా, వైసీపీ అభ్యర్థి బీసపు హైమావిజయలక్ష్మి 419 ఓట్లు సాధించి గెలిచారు. ఇక్కడ నోటాకు 8 ఓట్లు పడడం గమనార్హం. రీకౌంటింగ్‌కు వెళ్లినప్పటికీ వైసీపీ అభ్యర్థే ఒక్క ఓటుతో గెలిచారు.
ఒకరు ఆరు.. మరొకరు మూడు
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మున్సిపాలిటీ 18వ వార్డులో వైసీపీ అభ్యర్థి పిలక ఈశ్వరి టీడీపీ అభ్యర్థి సరస్వతిపై కేవలం 6 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 26వ వార్డులో జనసేన అభ్యర్థి దాసరి శేఖర్ వైసీపీ అభ్యర్థి కాళ్ల ధర్మతేజపై 3 ఓట్ల తేడాతో గెలిచారు.
ఓట్లు టై.. లాటరీలో వైసీపీకి జై!
పలాస, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా పలాస 35వ వార్డులో ఇద్దరు అభ్యర్థులకు ఓట్లు సమానంగా రావడంతో లాటరీ ద్వారా విజేతను నిర్ణయించారు. టీడీపీ అభ్యర్థి జోగ త్రివేణి, వైసీపీ అభ్యర్థి అరుణకు సమానంగా 340 ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు ఎన్.సూర్యతేజ వీరిద్దరితో మాట్లాడి లాటరీ పద్ధతి చేపట్టారు. అభ్యర్థుల పేర్లను కాగితాలపై రాసి, ఒక డబ్బాలో వేసి తీశారు. లాటరీలో వైసీపీ అభ్యర్థి అరుణ పేరు రావడంతో ఆమెను విజేతగా ప్రకటించారు.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం