సాగర్ వంతెనపై బీఆర్‌ఎస్ ధర్నా
ABN , Publish Date - Nov 18 , 2026 | 05:53 AM
నాగార్జునసాగర్ నుంచి పైపుల ద్వారా పల్నాడు జిల్లాకు తాగునీరు అందించే పనులను ఏపీ తక్షణం నిలిపివేయాలంటూ తెలంగాణలోని...
పల్నాడులో జలజీవన్ పనుల నిలిపివేతకు డిమాండ్
విజయపురిసౌత్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ నుంచి పైపుల ద్వారా పల్నాడు జిల్లాకు తాగునీరు అందించే పనులను ఏపీ తక్షణం నిలిపివేయాలంటూ తెలంగాణలోని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు ధర్నాకు దిగారు. దశాబ్దాలుగా పల్నాడులో నెలకొన్న తాగునీటి సమస్యను తీర్చేందుకు కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. సాగర్‌లోని విజయపురిసౌత్ నుంచి జలజీవన్ మిషన్ ద్వారా రూ.1200 కోట్లతో వాటర్ గ్రిడ్ నిర్మాణం చేపట్టింది.
2027 నాటికి పూర్తిచేసి జిల్లాలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన కుళాయి నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని అనుమతులతో ఈ ప్రాజెక్టు పనులను నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ చేపడుతోంది. అయితే ఈ పనులను వెంటనే ఆపేయాలంటూ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం సాగర్ నూతన వంతెనపై ధర్నా చేపట్టారు. అయితే టన్నెల్ ద్వారా నీటిని తరలిస్తున్నామన్న ఆరోపణల్లో నిజం లేదని ఏపీఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్పష్టంచేశారు.
ఫేజ్-1లో భాగంగా అన్ని అనుమతులతో పైప్‌లైన్ల ద్వారా మాత్రమే నీటిని పల్నాడులోని 235 గ్రామాలకు తరలించడం జరుగుతుందన్నారు. ఏటా సాగర్ జలాశయం ద్వారా 2.55 టీఎంసీలను ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా తాగు అవసరాలకు వినియోగిస్తున్నామని తెలిపారు. జలజీవన్ మిషన్ ద్వారా ఏటా తీసుకునేది అర టీఎంసీ మాత్రమేనని తేల్చిచెప్పారు. ఇది కూడా ఏపీకి రావలసిన నీటి వాటాలో భాగంగా ఉంటుందన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు