అమలాపురంలో భారీ విస్ఫోటం
ABN , Publish Date - Sep 21 , 2026 | 05:26 AM
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం మహిపాలవీధిలో గల ఓ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున భారీ విస్ఫోటం సంభవించింది. మలిశెట్టి సత్యనారాయణమూర్తికి చెందిన ఇంటి మొదటి అంతస్తులో జరిగిన ఈ పేలుడు కారణంగా ప్రధాన గుమ్మాలు, కిటికీలు సైతం సుదూరంగా ఎగిరిపడ్డాయి.
ఓ ఇంటి మొదటి అంతస్తులో ఘటన
ఎగిరిపడ్డ కిటికీలు, గుమ్మాలు.. ఒకరికి గాయాలు
అమలాపురం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం మహిపాలవీధిలో గల ఓ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున భారీ విస్ఫోటం సంభవించింది. మలిశెట్టి సత్యనారాయణమూర్తికి చెందిన ఇంటి మొదటి అంతస్తులో జరిగిన ఈ పేలుడు కారణంగా ప్రధాన గుమ్మాలు, కిటికీలు సైతం సుదూరంగా ఎగిరిపడ్డాయి. సీలింగ్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భవనం గోడలు బీటలు వారాయి. ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తెల్లవారుజామున 4.30 నుంచి 5 గంటల సమయంలో ఈ విస్ఫోటం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పేలుడు శబ్దం సుమారు అరకిలోమీటరు పరిధి వరకు వినిపించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇంట్లోని సామగ్రి అంతా ఛిద్రమైంది.
ప్రమాద సమయంలో మూర్తి కుమారులిద్దరూ పైఅంతస్తులో నిద్రిస్తుండగా ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సత్యనారాయణ కుమారుడు మలిశెట్టి సాయిరామ్‌ను స్థానిక కిమ్స్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్య సేవల అనంతరం కాకినాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పిడుగుపాటు, షార్ట్ సర్క్యూట్, గ్యాస్ లీకేజ్ వంటి కారణాలతో ప్రమాదం జరిగి ఉండవచ్చని ఇంటి యజమాని తెలిపారు. విద్యుత్ ఓల్టేజ్ కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండవచ్చని లేదా గ్యాస్ లీకై హైప్రెజర్‌తో బ్లాసింగ్ జరిగినట్టు ప్రాథమికంగా భావిస్తున్నామని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. మంత్రి వాసంశెట్టి సుభాశ్, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఘటన జరిగిన ఇంటిని పరిశీలించి బాధితులను పరామర్శించారు.
ఈ వార్తలనూ చదవండి..