Share News

ఆహా.. విహారం!

ABN , Publish Date - Jul 30 , 2026 | 06:02 AM

కోస్తాంధ్రకూ తీరానికీ విడదీయరాని బంధం! ఇటు... లోహ విహంగాలు! అటు... మత్స్య సంపద! ఈ రెండింటి సమ్మిళితమే... ఎగిరే చేప (ఫ్లైయింగ్‌ ఫిష్‌)! భోగాపురంలో ప్రారంభానికి సిద్ధమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం...

ఆహా.. విహారం!

  • ఆధునికత, సంప్రదాయాల మేళవింపులా భోగాపురం

  • ఎగిరే చేప ఆకారంలో టెర్మినల్‌ భవన నిర్మాణం

  • సంక్రాంతి ముగ్గులతో సుందరంగా అలంకరణ

  • కలంకారీ చిత్రాలు, ఏటికొప్పాక బొమ్మలు

  • 18 ఎకరాల టెర్మినల్‌లో అనేక వసతులు

  • 40 చెకిన్‌ కౌంటర్లతో వేగంగా స్కానింగ్‌

  • బోయింగ్‌ 777, ఎయిర్‌బస్‌ 350 కూడా దిగొచ్చు

  • భవిష్యత్‌ అవసరాలకూ తగినట్లుగా ఏటీసీ టవర్‌

  • లాంజ్‌లు, డ్యూటీఫ్రీ షాపులూ ఏర్పాటు

  • ఉత్తరాంధ్ర జిల్లాల రహదారులతో అనుసంధానం

ఆగమనము (అరైవల్స్‌), నిష్క్రమణ (డిపార్చర్‌), కౌంటర్లు, సెక్యూరిటీ చెకిన్‌, గేట్లు... ఒకప్పుడు విమానాశ్రయం అంటే అంతే! ఆధునిక విమానాశ్రయాల తీరు ఇది కాదు! ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారీ ఆహ్లాదంగా ఉండాలి. విశాలమైన పార్కింగ్‌ స్థలం ఉండాలి. లోపలికి అడుగు పెట్టగానే.. ఆహా అనిపించాలి. లాంజ్‌లు, ఎస్కలేటర్లు, ఎలివేటర్లతో సుఖమయంగా ఉండాలి. ఆధునిక హంగులూ, స్థానిక సంస్కృతికి అద్దం పట్టే అలంకారాలు కావాలి. వీటన్నింటినీ భోగాపురం విమానాశ్రయం సొంతం చేసుకుంది.

(విజయనగరం - ఆంధ్రజ్యోతి)

కోస్తాంధ్రకూ తీరానికీ విడదీయరాని బంధం! ఇటు... లోహ విహంగాలు! అటు... మత్స్య సంపద! ఈ రెండింటి సమ్మిళితమే... ఎగిరే చేప (ఫ్లైయింగ్‌ ఫిష్‌)! భోగాపురంలో ప్రారంభానికి సిద్ధమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌ ‘ఎగిరే చేప’ ఆకారంలో కనిపిస్తుంది. ఇదొక్కటే కాదు! విమానాశ్రయం అడుగడుగునా ఆధునికతను రంగరించుకుంటూనే, స్థానిక సంస్కృతికి అద్దంపట్టేలా ఉంటుంది. తెలుగు మహిళలు ఎంతో ఇష్టపడే సంక్రాంతి ముగ్గుల ఆకారంలో సీలింగ్‌ డిజైన్‌.. టెర్మినల్‌ గోడలపై రాష్ట్ర విశిష్టతను చాటే కలంకారీ చిత్రాలు, బొబ్బిలి వీణలు, కూచిపూడి నృత్య భంగిమలు, తోలు బొమ్మలాట చిత్రాలు, తిరుమల, శ్రీశైలం ఆలయాలు, లేపాక్షి నంది, మన్యం అందాలు, ఏటికొప్పాక-కొండపల్లి బొమ్మలు.. ఇలా ఆంధ్రుల సంస్కృతిని చాటిచెప్పేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. వీటిలో కొన్ని డిజిటల్‌ స్ర్కీన్‌పైనా, మరికొన్ని గోడలపైనా ప్రత్యక్షమవుతాయి. వీటితోపాటే... జిగేల్‌మని వెలిగే విద్యుద్దీపాలు, ఆధునిక అలంకరణలూ ఉన్నాయి. ఢిల్లీ, హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్మించిన జీఎంఆర్‌ సంస్థే అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ ‘భోగాపురం’ నిర్మాణ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసింది.


ఆధునిక సాంకేతికత...

చాలా విమానాశ్రయాల్లో లగేజీ అప్పగించడానికి, చెకిన్‌కు భారీ క్యూల్లో వేచి చూడాల్సి వస్తుంది. భోగాపురంలో ఆ అవసరం లేకుండా, త్వరత్వరగా చెకిన్‌ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఫాస్ట్‌ డిజిటల్‌ చెక్‌-ఇన్‌, సెల్ఫ్‌ బ్యాగేజ్‌ డ్రాప్‌ ఈ-గేట్స్‌, అత్యాధునిక బ్యాగేజ్‌ హ్యాండ్లింగ్‌ వ్యవస్థ, హైస్పీడ్‌ సెక్యూరిటీ స్కానింగ్‌ ఏర్పాటు చేశారు. ఏకంగా 40 చెకిన్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. 18 ఎకరాల్లో విస్తరించిన టెర్మినల్‌ భవనంలో అనేక వసతులు కల్పించారు. భోగాపురం విమానాశ్రయం నుంచి విదేశాలకు రాకపోకలు సాగించేవారికి సౌకర్యవంతమైన లాంజ్‌లు ఏర్పాటు చేశారు. డ్యూటీ ఫ్రీ షాప్స్‌, ఫుడ్‌ కోర్టు, రిటైల్‌ స్టోర్స్‌, మెడికల్‌ సెంటర్‌, చైల్డ్‌ కేర్‌ రూమ్‌, ప్రార్థనా గది, ఉచిత వైఫై, చార్జింగ్‌ కేంద్రాలు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు సమకూర్చారు.

ఇక... విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సాంకేతిక మౌలిక వసతులూ అత్యాధునికమే! ఆధునిక ఎయిర్‌ఫీల్డ్‌ గ్రౌండ్‌ లైటింగ్‌(ఎల్‌ఈడీ), క్యాటగిరీ-1 ఇన్‌స్ట్రుమెంటల్‌ ల్యాండింగ్‌ వ్యవస్థ, ఆధునిక ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఏఐ ఆధారిత సీసీటీవీ, పెరిమీటర్‌ ఇన్‌ట్రూజన్‌ డిటెక్షన్‌ సిస్టమ్‌, బాంబులు, ఇతర పేలుడు పదార్థాలను గుర్తించే పరికరాలు అమర్చారు. ఫైర్‌ క్యాటగిరీలో 9 అంతర్జాతీయ ప్ర మాణాలతో అగ్నిమాపక రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. 24/7 నిరంతరాయంగా ఎయిర్‌పోర్టు ఆపరేషన్స్‌ కంట్రోల్‌ కేం ద్రానికి నిఘా ఏర్పాటు చేశారు. బోయింగ్‌ -777, ఎయిర్‌ బస్సు ఎ-350 వంటి భారీ కార్గో/ప్యాసింజర్‌ విమానాలూ భోగాపురంలో ల్యాండ్‌ కావొచ్చు.

రోడ్‌ టు ఫ్లైట్‌...

హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీతోపాటు కొత్తగా ఏర్పాటవుతున్న విమానాశ్రయాలన్నీ నగరాలకు దూరమే! భోగాపురం కూడా విశాఖ నగరానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో విమానాశ్రయానికి ప్రయాణికుల రాకపోకలు సులువుగా సాగేలా అనేక ప్రణాళికలు రచించారు. విశాఖ నుంచి ప్రతి అరగంటకు ఒక ఈ-బస్సును విమానాశ్రయానికి నడుపుతారు. ప్రస్తుతం 20 బస్సులు సిద్ధం చేశారు. భవిష్యత్తులో మెట్రో రైలు సదుపాయం కల్పించనున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వాసులు త్వరగా ఎయిర్‌పోర్టుకు చేరుకునేలా రహదారులను అనుసంధానిస్తున్నారు. అంతేకాకుండా ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల వారికి అనువైన ఎక్స్‌ప్రెస్‌ జాతీయ రహదారి ఉంది. మొదటి దశలో ఏడాదికి సుమారు 60 లక్షల మంది భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించేలా ప్రణాళికలు చేపట్టారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దశలవారీగా 4 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


ఫార్మాసిటీతో అనుసంధానం

విశాఖ ఫార్మాసిటీ భోగాపురం ఎయిర్‌పోర్టుతో అనుసంధానం కావడం కలిసొచ్చింది. ఇక్కడి నుంచి నేరుగా మందులు, వ్యాక్సిన్లు, సీఫుడ్‌, వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయవచ్చు. దీంతో హైదరాబాద్‌, చెన్నైపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. లాజిస్టిక్స్‌, ఆతిథ్య రంగం కార్గో విభాగాల్లో స్థానిక యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

అధునాతన ఏటీసీ టవర్‌

భోగాపురం విమానాశ్రయంలో ప్రధానమైన ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏసీటీ) టవర్‌ను భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా నిర్మించారు. రన్‌వే, టాక్సీ వేలు, ఏప్రాన్‌ ప్రాంతాలు, ఎప్రోచ్‌ రహదారులతో సహా కీలకమైన ఎయిర్‌ సైడ్‌ మౌలిక సదుపాయాలకు ఎటువంటి అడ్డంకులు లేని విధంగా ఏటీసీ టవర్‌ నిర్మాణం చేపట్టారు. ఈ టవర్‌ను సముద్ర మట్టానికి 106.65 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఎయిర్‌ ట్రాఫిక్‌ పర్యవేక్షణ, నిర్వహణకు మద్దతుగా భోగాపురం విమానాశ్రయం సెకండరీ సర్వైలెన్స్‌ రాడార్‌(ఎ్‌సఎ్‌సఆర్‌)తో పాటు ఏడీఎ్‌సబీ(ఆటోమేటిక్‌ డిపెండెంట్‌ సర్వైలెన్స్‌ బ్రాడ్‌కాస్ట్‌) సర్వైలెన్స్‌ ఫీడ్‌లతో కలిగిన ఏటీసీ సొంత నిఘా వ్యవస్థతో పని చేస్తుంది. సంప్రదాయ విమానాశ్రయ వ్యవస్థతో పోలిస్తే మెరుగైన కార్యాచరణ సామర్థ్యాలను అందించడానికి రూపొందించిన ఆధునిక ఏటీసీ ఆటోమేషన్‌ సిస్టమ్‌తో భోగాపురం విమానాశ్రయం సిద్ధ్దమవుతోంది. ప్రస్తుతం క్యాట్‌1 ల్యాండింగ్‌ సామర్థ్యంతో రూపొందించగా అవసరాలను బట్టి భవిష్యత్తులో క్యాట్‌2, క్యాట్‌3కి అప్‌గ్రేడ్‌ చేయడానికి వీలుగా ప్రణాళిక రచించారు. ఇక్కడ అన్ని రకాల విమానాల రాకపోకలు 24 గంటలూ సాఫీగా సాగుతాయి.

ఏసీ బస్టా్‌పలు.. లాంజ్‌లు

విమానాశ్రయానికి వెళ్లేవారి కోసం ప్రత్యేకంగా బస్టాపులు ఏర్పాటు చేసి, అక్కడ వెయిట్‌ చేయడానికి ఏసీ లాంజ్‌లను జీఎంఆర్‌ యాజమాన్యం ఏర్పాటు చేస్తోంది. మొత్తం తొమ్మిది లాంజ్‌ల ఏర్పాటుకు నిర్ణయించారు. మొదటి దశలో ఆటోనగర్‌, ఎన్‌ఏడీ జంక్షన్‌, గురుద్వారా జంక్షన్‌, వెంకోజీపాలెం, వుడా పార్కు వద్ద వీటిని నిర్మిస్తున్నారు.

అరగంటకో బస్సు

విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్సులన్నీ భోగాపురం మీదుగానే వెళతాయి. అయితే, భోగాపురం విమానాశ్రయం కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 20 ఎలక్ర్టిక్‌ బస్సులను నడపనుంది. ఇవి ఏరో బస్సుల పేరుతో విశాఖ నుంచి అరగంటకు ఒకటి చొప్పున బయలుదేరుతాయి.


ఎంతెంత భారం?

విశాఖపట్నం ద్వారకానగర్‌ ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి భోగాపురం విమానాశ్రయానికి ఊబర్‌, ర్యాపిడో ఇంటర్‌ సిటీ సర్వీసు క్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఊబర్‌లో రూ.1300 వరకు చార్జి అవుతుంది. గరిష్ఠంగా నలుగురు ప్రయాణిస్తే... సగటున 330 రూపాయలు అయినట్లు! ఆర్టీసీ నడిపే ఏరో బస్సు ల్లో టికెట్‌ ధర రూ.150వరకు ఉండవచ్చునని అఽధికార వర్గాలు తెలిపాయి.

విశాఖ నుంచి చేరేదిలా...

విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. నగరం మధ్య నుంచి వెళ్లాలంటే జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-16) ఒక్కటే మార్గం. జాతీయ రహదారిలో గాజువాక నుంచి కొమ్మాది వరకు 35 కి.మీ.మార్గంలో ప్రతి కిలోమీటరుకు ఒక ట్రాఫిక్‌ సిగ్నల్‌ ఉంటుంది. రద్దీ వేళల్లో ఈ ట్రాఫిక్‌ సిగ్నళ్లను దాటుకుని భోగాపురం వెళ్లాలంటే రెండు గంటలకుపైగా పడుతుంది. అందుకే విశాఖ-భోగాపురం మధ్య ప్రయాణ సమయం తగ్గించడానికి, జాతీయ రహదారిపై ఒత్తిడి తగ్గించడానికి 15 ప్రత్యామ్నాయ రహదారులను విస్తరిస్తున్నారు. అందులో మొదట ఏడు మార్గాలను రూ.175 కోట్లతో అభివృద్ధి చేశారు.

భోగాపురానికి దారేది?

ఎవరు ఎటు వైపు నుంచి వెళ్లాలంటే...

ప్రధాని పర్యటనకు భారీ బందోబస్తు

4 సెక్టార్లుగా భద్రతా ఏర్పాట్లు.. ఎస్పీజీ

పర్యవేక్షణ.. బలగాల చేతిలోకి ఎయిర్‌పోర్టు

17 నుంచి విశాఖలో సేవలు బంద్‌

నాన్‌ షెడ్యూల్డ్‌ విమానాలకే అనుమతి

భోగాపురానికి ‘వీటీజెడ్‌’ కోడ్‌

ఇవి కూడా చదవండి

కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్

ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్

Updated Date - Jul 30 , 2026 | 06:17 AM