Share News

‘రామోజీరావు జయంతి’పై హైకోర్టుకు బీసీవై పార్టీ

ABN , Publish Date - Nov 27 , 2026 | 02:27 AM

ఈనాడు గ్రూపు సంస్థల మాజీ ఛైర్మన్‌ దివంగత చెరుకూరి రామోజీరావు జయంతిని అధికారికంగా నిర్వహించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ...

‘రామోజీరావు జయంతి’పై హైకోర్టుకు బీసీవై పార్టీ

  • ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసిన రామచంద్ర యాదవ్‌

అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): ఈనాడు గ్రూపు సంస్థల మాజీ ఛైర్మన్‌ దివంగత చెరుకూరి రామోజీరావు జయంతిని అధికారికంగా నిర్వహించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ భారత చైతన్య యువజన పార్టీ(బీసీవై) అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ప్రతీ ఏడాది నవంబర్‌ 16న దివంగత రామోజీరావు జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 243ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటిస్తూ దానిని రద్దు చేయాలని కోరారు. జయంతి నిర్వహణకు ప్రభుత్వ నిధులు వినియోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. గురువారం కోర్టు విచారణ ప్రారంభమైన వెంటనే పిటిషనర్‌ తరఫు న్యాయవాది బుస్సా రాణా సందీప్‌ స్పందిస్తూ వ్యాజ్యం పై అత్యవసరంగా విచారణ జరపాలని ధర్మాసనాన్ని అభ్యర్ధించారు.

దీంతో పిల్‌ను ధర్మాసనం లంచ్‌ మోషన్‌గా విచారణకు స్వీకరించింది. విచారణ ప్రారంభమైన వెంటనే లంచ్‌ మోషన్‌ గురించి ప్రభుత్వం తరఫు న్యాయవాదులకు సమాచారం ఇచ్చారా? అని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. లేదని న్యాయవాది బదులివ్వడంతో పిల్‌ పై విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అనంతరం పిటిషనర్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ... పిల్‌ పై బుధవారం విచారణ చేపట్టాలని కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ వార్తలనూ చదవండి:

2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు

బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా

Updated Date - Nov 27 , 2026 | 02:28 AM