అగ్గిపెట్టె కోసం హత్య.. మద్యం మత్తులో వ్యక్తిపై కత్తితో దాడి
ABN , Publish Date - Aug 30 , 2026 | 11:43 AM
చిన్న మాట.. క్షణాల్లో చెలరేగిన గొడవ.. చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అగ్గిపెట్టె ఇవ్వలేదన్న కారణంతో మద్యం మత్తులో ఇద్దరి మధ్య మొదలైన వివాదం తీవ్ర రూపం దాల్చింది. విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి.. మరో వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు..
బాపట్ల, ఆగస్టు 30: జిల్లాలో అగ్గిపెట్టె కోసం జరిగిన చిన్నపాటి వివాదం చివరకు హత్యకు దారితీసింది. వేమూరు మండలం వెల్లబాడు గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం సేవిస్తున్న సమయంలో చరణ్ అనే వ్యక్తి అక్కడే ఉన్న యోహాన్‌ను అగ్గిపెట్టె అడిగినట్లు తెలుస్తోంది. అయితే తన వద్ద అగ్గిపెట్టె లేదని యోహాన్ చెప్పాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. క్షణాల్లోనే చిన్న విషయం కాస్తా తీవ్ర వాగ్వాదంగా మారడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన చరణ్.. యోహాన్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడ్డ యోహాన్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఊహించని ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అగ్గిపెట్టె ఇవ్వలేదన్న కారణంతో మొదలైన వివాదం చివరకు ప్రాణం తీసేంత స్థాయికి చేరడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఆయిల్ డీల్.. వెనెజువెలాతో ఒప్పందంపై ట్రంప్ ప్రకటన..
స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..