Share News

బాలకృష్ణ పీఏ అరెస్టు

ABN , Publish Date - Nov 23 , 2026 | 04:52 AM

మారణాయుధాలు కలిగి ఉన్నారన్న అభియోగాలపై హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పీఏ పావులూరి శ్రీనివాసరావుపై కేసు నమోదైంది.

బాలకృష్ణ పీఏ అరెస్టు
sticks

  • పల్నాడులో పంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్తత

  • పత్తి మిల్లు వద్ద మారణాయుధాలు స్వాధీనం

  • 66 మంది అరెస్టు.. నాన్‌ బెయిలబుల్‌ కేసులు

చిలకలూరిపేట, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): మారణాయుధాలు కలిగి ఉన్నారన్న అభియోగాలపై హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పీఏ పావులూరి శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో 65 మందిని పల్నాడు పోలీసులు అరెస్టు చేశారు. 66 మందిపై నాన్‌-బెయిలబుల్‌ కేసులు నమోదు చేశామని, వారిని కోర్టుకు హాజరుపరుస్తామని నరసరావుపేట ఏఎస్పీ హనుమంతరావు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలంలోని తిమ్మాపురం గ్రామంలో సర్పంచ్‌ పదవి నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ టీడీపీలోని అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. సర్పంచ్‌ పదవి కోసం స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అనుచరుడు, టీడీపీకి చెందిన నాగండ్ల రాంబాబుతో పాటు పావులూరి శ్రీనివాసరావు వర్గాలు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశాయి. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం తారస్థాయికి చేరింది.జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో రెండు వర్గాలు సంయమనం పాటించి రాజీమార్గంలో పయనించాయి. అయితే గ్రామ సర్పంచ్‌ పదవి విషయంలో మాత్రం ఈ రెండు గ్రూపులు విభేదించాయి.


సర్పంచ్‌ పదవికి శనివారం రాంబాబు వర్గీయులు, ఆదివారం శ్రీనివాసరావు వర్గీయులు నామినేషన్లు వేశారు. అందిన సమాచారం మేరకు నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం తిమ్మాపురంలోని శ్రీనివాసరావుకు చెందిన ఓ మిల్లులో పోలీసులు తనిఖీలు చేశారు. అక్కడ కర్రలు, కత్తులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, శ్రీనివాసరావు వర్గీయులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి శ్రీనివాసరావుతో పాటు మొత్తం 66 మందిని అదుపులోకి తీసుకుని నాదెండ్ల పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ వారిపై అన్యాయంగా కేసులు పెడుతున్నారంటూ పావులూరి శ్రీనివాసరావు వర్గీయులు స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేసి చెల్లాచెదురు చేశారు.

ఏదో కుట్ర ఉన్నట్టు అనుమానాలు!

నరసరావుపేట ఏఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ.. గుంటూరు నుంచి సుమారు 25 కార్లలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మారణాయుధాలతో దాడులకు సిద్థమైనట్టు, వారు తిమ్మాపురం వద్ద తిష్ట వేసినట్టు సమాచారం అందిందని తెలిపారు. వెంటనే తిమ్మాపురంలోని పావులూరు శ్రీనివాసరావుకు చెందిన ఒక పత్తి మిల్లులో తనిఖీలు చేసినట్టు తెలిపారు. వచ్చిన వారంతా గుంటూరులోని ఒక రౌడీషీటర్‌ ముఠా వ్యక్తులుగా గుర్తించినట్టు చెప్పారు. ఘటనా స్థలం నుంచి 25 కార్లతో పాటు 60 కర్రలు, నాలుగు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్న 66 మందిపై నాన్‌-బెయిలబుల్‌ కేసులు నమోదు చేశామని, 34 మంది పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏదో కుట్ర ఉన్నట్టుగా అనుమానాలు ఉన్నాయని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి...

ఇండియన్ రోడ్ నెట్‌వర్క్‌ ప్రపంచంలోనే నంబర్‌వన్‌: నితిన్‌ గడ్కరీ

బీఆర్ఎస్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం

Updated Date - Nov 23 , 2026 | 04:55 AM