Share News

ప్రభుత్వం మారితే మీ పరిస్థితేంటి?

ABN , Publish Date - Oct 08 , 2026 | 04:32 AM

‘ప్రభుత్వం మారితే మీ పరిస్థితి ఏంటి? రాజకీయ పలుకుబడితో ఎప్పుడూ వ్యాపారాలు చెయ్యలేరు. అలా చేస్తే వచ్చే ప్రభుత్వంలో సవ్యంగా చెయ్యగలరా.?’ అంటూ ఓ జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌... ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ (ఏటీఎస్‌) యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ప్రభుత్వం మారితే మీ పరిస్థితేంటి?

  • ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ సెంటర్‌ ఓనర్లపై జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ చిందులు

  • మేం మీ లేబర్‌ కాదు.. కోట్లు పెట్టిన వ్యాపారస్తులం

  • తప్పు చేస్తే శిక్షించండి..మర్యాద లేకుండా మాట్లాడొద్దు

  • జేటీసీతో ఏటీఎస్‌ యజమానుల సంవాదం

అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి: ‘ప్రభుత్వం మారితే మీ పరిస్థితి ఏంటి? రాజకీయ పలుకుబడితో ఎప్పుడూ వ్యాపారాలు చెయ్యలేరు. అలా చేస్తే వచ్చే ప్రభుత్వంలో సవ్యంగా చెయ్యగలరా.?’ అంటూ ఓ జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌... ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ (ఏటీఎస్‌) యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాజకీయ నాయకుడిలా మాట్లాడిన ఆ అధికారి, ’సుందర’ వ్యాఖ్యలతో అవాక్కైన ఏటీఎస్‌ యజమానులు, గట్టిగానే బదులిచ్చినట్లు సమాచారం. ’మేం మీ దగ్గర లేబర్‌ కాదు. అమర్యాదగా మాట్లాడొద్దు. రెండేళ్లయినా రూపాయి బిల్లు రాలేదు. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి, అందరికీ మామూళ్లు ఇచ్చి, ఇప్పుడు మీతో మాటలు పడాల్సి వస్తోంది’ అంటూ ఎదురు తిరగడంతో, కాసేపు వాదనలు జరిగాయి. మొత్తం విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు ఏటీఎస్‌ యజమానులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. విజయవాడలోని ఎన్టీఆర్‌ పరిపాలనా భవనంలోని రవాణా కమిషనరేట్‌లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. రవాణా వాహనాల ఫిట్‌నెస్‌ ప్రైవేటు ద్వారా ఆటోమేటిక్‌ చేయాలనే కేంద్రం నిర్ణయంతో ఏపీలో 20 ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. ప్రతి సెంటర్‌కు రూ.4కోట్ల నుంచి రూ.4.50కోట్ల వరకూ ఖర్చు చేసి, ఔత్సాహిక వ్యాపారవేత్తలు వాటిని నిర్వహిస్తున్నారు. మొదటి రెండేళ్ల పాటు వాహన యజమాని నుంచి వసూలు చేసే ఫిట్నెస్‌ ఫీజు మొత్తం ఏటీఎస్‌ నిర్వాహకుడు తీసుకుని, ఆ తర్వాతి నుంచి ప్రభుత్వానికి రేషియో చెల్లించేలా రెండేళ్ల క్రితం ఒప్పందం కుదిరింది. గత రెండేళ్లుగా వాహన యజమానులు ఆన్‌లైన్‌లో చెల్లిస్తోన్న ఫిట్నెస్‌ ఫీజు ప్రభుత్వ ఖజానాలో జమవుతోంది. ఆ డబ్బు ఎప్పటికప్పుడు ఏటీఎస్‌ నిర్వాహకులకు చెల్లించాల్సి ఉన్నా, అమాత్యులను సంతృప్తి పరచక పోవడంతో విడుదల కాలేదని తెలుస్తోంది.

ఫీజు కన్నా కమీషన్‌ ఎక్కువ..

ఏటీఎస్‌ నిర్వాహకులు వాహన ఫిట్నె్‌సలో అడ్డదారి ఎంచుకుని, ఫీజు కన్నా కమీషన్‌ ఎక్కువ వసూలు చేసి ఫిట్నెస్‌ చేస్తున్నట్లు వరుస ఫిర్యాదులు అందాయి. దీంతో రవాణా కమిషనర్‌ మనీశ్‌ కుమార్‌ సిన్హా ఇటీవల పలు ఏటీఎస్‌ కేంద్రాలపై డీటీసీలు, ఆర్టీఏలతో తనిఖీలు చేయించారు. వాహనంలో లోపాలను కప్పిపుచ్చడంతో పాటు హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ సైతం నకిలీది తాత్కాలికంగా ఏర్పాటు చేసి ఆ నంబర్‌ కలిగిన వాహనం సెంటర్‌కు రాకపోయినా ఎఫ్‌సీ చేసినట్టు బయట పడింది. ఈ బాగోతమంతా ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమవడంతో హై సెక్యూరిటీ ప్లేట్ల ఏర్పాటు తప్పనిసరి చేస్తూ, కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో ప్రైవేటు వాహనాలు ఏటీఎస్‌ కేంద్రాలకు రాకపోయినా ఎఫ్‌సీ చేసేస్తున్నారంటూ విశాఖకు చెందిన ఒక వ్యక్తి కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణకు ఆదేశించడంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఒక ఏటీఎస్‌ కేంద్రంలో సెప్టెంబరు 9న ఎఫ్‌సీ చేసిన ప్రైవేటు బస్సు, ఆ రోజు విశాఖలో ఉన్నట్లు తేలింది. దీంతో రవాణా శాఖ అధికారులు ఈ నెల 1న ఏటీఎస్‌ యజమానులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. అయితే, ’తప్పు చేసిన వారిపై చర్య తీసుకోండి.. అవసరమైతే ఆ సెంటర్‌ను రద్దు చేసుకోండి.. అందర్నీ అంటే ఎలా?’ అంటూ కొందరు ఏటీఎస్‌ నిర్వాహకులు ఖండించారు. ఇదే విషయాన్ని కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు బుధవారం విజయవాడలోని కమిషనరేట్‌కు వెళ్లారు. కమిషనర్‌ అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్న జేటీసీని కలిశారు. ‘మీరు మాపై చిందులు వేస్తున్నారు. మాకు రూ.44కోట్లు రావాల్సి ఉంది. సెంటర్లు నడపలేక ఇబ్బంది పడుతున్నాం..’ అంటూ సమస్యను వివరించే ప్రయత్నం చేశారు.

సచివాలయానికి వెళ్లి సెక్రటరీకి చెప్పండి..

‘మీ సమస్యలు ఏమైనా ఉంటే సచివాలయానికి వెళ్లి సెక్రటరీకి చెప్పండి. ఆయన నాకు చెబుతారు. నేను మీకు కావాల్సిన పని చేసిపెడతా. ఇక్కడికి ఎందుకు రావడం.. నాపై ఏదో చెప్పాలనుకుంటే మీకే ఇబ్బంది. మీ రాజకీయ ఒత్తిళ్లకు లొంగను. మీరు ఇక్కడికి రావొద్దు.... వెళ్లిపోండి.’’ అంటూ ఆ అధికారి అవమానకరంగా మాట్లాడినట్లు తెలిసింది. చిత్తూరు సెంటర్‌కు వచ్చే కర్ణాటక బస్సుల గురించి నాకు తెలుసు.. పల్నాడు సెంటర్లో జరుగుతున్న అక్రమాలు కూడా తెలుసు.. ఇంకా చాలా ఉన్నాయి.... ప్రభుత్వం మారిన తర్వాత మీరు నడపగలరా... అంటూ వార్నింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. మనస్తాపానికి గురైన ఏటీఎస్‌ యజమానులు.. తాము వ్యాపారాలు చేయలేమని చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌కు చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

ఇంకెంత మందికి ఇవ్వాలి?

విశ్వసనీయ సమాచారం మేరకు, ప్రతి ఏటీఎస్‌ సెంటర్‌ నుంచి ఒక రాష్ట్ర స్థాయి ప్రజా ప్రతినిధికి నెలకు రూ.లక్ష చొప్పున, స్థానిక ఎమ్మెల్యేలకూ లక్ష, రవాణా అధికారులకు 50 నుంచి 60వేలు అందజేస్తున్నట్లు తెలిసింది. తాజాగా తమపై చిందులేసిన జేటీసీ... మరో వాటా కోసమే అదంతా చేశారని అనిపిస్తోందని చర్చించుకొంటున్నారు. వాహనం ఫిట్‌నెస్ రాకుండా ఎప్పుడూ ఎఫ్‌సీ చెయ్యలేదని అంటున్నారు.

ఈ వార్తలనూ చదవండి..

రైతన్నకు ఊరటేదీ?

ప్రజల చెంతకు వైద్య సేవలు

Updated Date - Oct 08 , 2026 | 04:35 AM