తరుముకొస్తున్న తుఫాన్
ABN , Publish Date - Oct 26 , 2026 | 04:39 AM
‘ఆర్నబ్’ తీవ్ర తుఫాన్ రాష్ట్రంపై పడగ విప్పుకొని ఉంది. కోస్తాంధ్ర దిశగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం.. సోమవారానికి తుఫాన్‌గా.. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా, సాయంత్రానికి అతి తీవ్ర తుఫాన్‌గా మారనుంది.
ఆర్నబ్ అలజడి..!
విశాఖకు 820 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతం
నేడు తుఫాన్‌గా.. రేపు ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా,
సాయంత్రానికి అతి తీవ్ర తుఫాన్‌గా మార్పు
28న యానాం వద్ద తీరం దాటే అవకాశం!
నేటి నుంచి వర్షాలు..
శ్రీకాకుళం నుంచి బాపట్ల జిల్లాల వరకూ భారీ నుంచి అతి భారీగా
తీర ప్రాంతాల్లో 140 కి.మీ వరకూ గాలులు
అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబరు భద్రతా సూచిక
విశాఖపట్నం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): ‘ఆర్నబ్’ తీవ్ర తుఫాన్ రాష్ట్రంపై పడగ విప్పుకొని ఉంది. కోస్తాంధ్ర దిశగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం.. సోమవారానికి తుఫాన్‌గా.. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా, సాయంత్రానికి అతి తీవ్ర తుఫాన్‌గా మారనుంది. ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో మూడు రోజుల పాటు అటు శ్రీకాకుళం నుంచి ఇటు బాపట్ల జిల్లా వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 28న విశాఖపట్నం-మచిలీపట్నం మధ్య (కాకినాడకు దక్షిణాన యానాం వద్ద) తీరం దాటనుందని పలు వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలోని అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ జారీచేసింది.
సోమవారం నుంచి పలు జిల్లాల తీరంలో గంటకు 80-140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు కూడా వీయనున్నాయి. తుఫాన్ తీరం దాటే సమయంలో వీటి తీవ్రత మరింత ఎక్కువగా ఉండనుంది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఈ నెల 29 వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు ఎగసిపడతాయని, అందువల్ల చేపల వేటకు వెళ్లవద్దని, లోపల ఉండే వారంతా వెంటనే తీరానికి రావాలని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం సూచించింది. కోస్తాంధ్రలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు.
తీర ప్రాంతాల్లో పెనుగాలులు
తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం నైరుతి దిశగా పయనించి ఆదివారం ఉదయానికి బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. మధ్యాహ్నానానికి తూర్పు ఆగ్నేయంగా విశాఖకు 820 కిలోమీటర్లు, కాకినాడకు 910 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1,010 కిలోమీటర్ల దూరంలో ఉంది. సోమవారం ఉదయం వరకు నైరుతి దిశలో పయనించే క్రమంలో తుఫాన్‌గా మారనుంది. ఆ తర్వాత ఇది పశ్చిమ వాయవ్యంగా దిశ మార్చుకుని ఈ నెల 27 ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించే సమయానికి తీవ్ర తుఫాన్‌గా, సాయంత్రానికి అతి తీవ్ర తుఫాన్‌గా బలపడనుంది.
ఆ తర్వాత వాయవ్యంగా దిశ మార్చుకుని 28 ఉదయానికి కోస్తాంధ్ర తీరం దిశగా రానుంది. ఈ క్రమంలో విశాఖపట్నం-మచిలీపట్నం మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కోస్తాంధ్రలో పలు జిల్లాల తీరంలో గంటకు 80-100 కిలోమీటర్లు, రాత్రి నుంచి 115 కి.మీ.ల వరకూ వేగంతో గాలులు వీస్తాయి. ఈ నెల 27న తీవ్ర తుఫాన్‌గా మారే క్రమంలో గాలుల వేగం 140 కి.మీ.లకు పెరగనుంది. అతి తీవ్ర తుపాన్ తీరం దాటే సమయంలో ఇదే తీవ్రత కొనసాగుతుంది.
28న తుఫాన్ తీరం దాటే సమయంలో అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పలు ప్రాంతాలు, యానాంలో సముద్రం అలలు ఒక మీటరు నుంచి ఒకటిన్నర మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాన్ తీరం దాటే సమయంలో అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.
కోస్తాంధ్రలో భారీ వర్షాలు
సోమవారం కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 27న కోస్తాంధ్రలో అనేక ప్రాంతాల్లో వర్షాలు, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కుంభవృష్టి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అతి భారీగా, కోస్తాంధ్రలో మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. 28న విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలు, యానాంలో కుంభవృష్టి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, బాపట్ల జిల్లాల్లో అతి భారీ, కోస్తాంధ్రలోని మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం