Share News

మూడు రోజులుగా అంధకారంలో కోనసీమ

ABN , Publish Date - Oct 30 , 2026 | 06:06 AM

అర్నబ్‌ తుఫాన్‌ కోనసీమ జిల్లాను కకావికలం చేసింది. మూడురోజులుగా జిల్లా అంతటా పూర్తిగా అంధకారంలో ఉంది. ఇంటర్నెట్‌ ఎన్ని రోజులకు వస్తుందో తెలియని పరిస్థితి.

మూడు రోజులుగా అంధకారంలో కోనసీమ

(కాకినాడ-ఆంధ్రజ్యోతి): అర్నబ్‌ తుఫాన్‌ కోనసీమ జిల్లాను కకావికలం చేసింది. మూడురోజులుగా జిల్లా అంతటా పూర్తిగా అంధకారంలో ఉంది. ఇంటర్నెట్‌ ఎన్ని రోజులకు వస్తుందో తెలియని పరిస్థితి. తుఫాన్‌ కోనసీమ మీదుగా తీరం దాటడంతో, దాని ప్రభావం ఎక్కువగా జిల్లాపైనే పడింది. విద్యుత్‌ స్తంభాలు 10 వేలకుపైనే కూలిపోయాయ. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు ప్రభుత్వం 2 వేల మంది సిబ్బందిని మోహరించింది. పలు జిల్లాల నుంచి 20 వేల స్తంభాలను కోనసీమకు తరలించింది. 2 వేల మంది విద్యుత్‌ సిబ్బంది మూడు రోజులుగా శ్రమిస్తున్నా ఇప్పటికీ విద్యుత్‌ వ్యవస్థ దారికి రాలేదు. తీరప్రాంత మండలాలైన కాట్రేనికోన, సఖినేటిపల్లి, రాజోలు, ఉప్పలగుప్తం తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కుప్పకూలిన స్తంభాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం అమలాపురం కేంద్రంలో మాత్రమే విద్యుత్‌ వ్యవస్థ కొలిక్కి తేవడానికి అధికారులు రేయింబవళ్లు పనిచేస్తున్నారు. ఎండ లేక సోలార్‌ పనిచేయడమే లేదు. తాగునీటికి సైతం జనం ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకులు, కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు సైతం జనరేటర్లతో కార్యకలాపాలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రం మినహా మిగిలిన అన్ని మండలాల్లో పడిపోయిన పోల్స్‌ ఎక్కడివక్కడే అన్నట్టు ఉన్నాయి.

సెల్‌టవర్లకు సైతం మూడురోజులుగా విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో అవీ పనిచేయడం లేదు. మరోపక్క ఇంటర్నెట్‌ వసతి కూడా ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. ఎక్కడికక్కడ కేబుల్‌ వైర్లన్నీ చెట్లకు ఆనుకుని విరిగిపోయి ఉన్నాయి. ఈ వ్యవస్థను ఇప్పట్లో సరిచేయడానికి సిబ్బంది సమస్య అని కంపెనీలు చెబుతున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

Updated Date - Oct 30 , 2026 | 06:08 AM