రైతులకు పంటల ‘బీమా’ రక్షణ!
ABN , Publish Date - Oct 31 , 2026 | 05:00 AM
ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంటల బీమా రైతులకు ఆర్థికంగా రక్షణ కవచంలా నిలుస్తోంది. సీఎం చంద్రబాబు ఎంతో బలంగా నమ్మి, అనుసరిస్తున్న పంటల బీమా విధానం అర్నబ్ తుఫాన్ వేళ రైతులకు చాలా వరకు మేలు చేయనుంది.
తుఫాన్ బాధిత రైతులకు కొంత ఊరట
నష్టపోయిన పంటకు బీమా పరిహారం
నమోదు, ఈ-క్రాప్ ధ్రువీకరణతో అర్హత కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ
అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంటల బీమా రైతులకు ఆర్థికంగా రక్షణ కవచంలా నిలుస్తోంది. సీఎం చంద్రబాబు ఎంతో బలంగా నమ్మి, అనుసరిస్తున్న పంటల బీమా విధానం అర్నబ్ తుఫాన్ వేళ రైతులకు చాలా వరకు మేలు చేయనుంది. ప్రభుత్వం ఈ ఏడాది ఖరీఫ్‌లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 22 నోటిఫైడ్ పంటలకు బీమా సౌకర్యం కల్పించింది. దీని ద్వారా 17.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణానికి రూ.15,969.51 కోట్ల బీమా కవరేజ్ జరిగింది. ఇందులో దిగుబడి ఆధారిత బీమా (పీఎంఎఫ్‌బీవై) కింద 15 పంటలకు రూ.10,534.72 కోట్లు, వాతావరణ ఆధారిత బీమా కింద 7 రకాల పంటలకు రూ.5,434.79 కోట్లకు కవరేజ్ చేశారు.
అర్నబ్ తుఫాన్ వల్ల రాష్ట్రంలోని 16 జిల్లాల్లో సుమారు 4.10 లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగినట్లు ప్రాథమిక అంచనా. ఇప్పుడు పంటల బీమా రైతులకు కీలకం కానుంది. పంట చేతికొచ్చే దశలో విపత్తులు ఎదురైతే, రైతులు పెట్టిన పెట్టుబడి అంతా మట్టిపాలయ్యే పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో రైతులకు పంటల బీమా అండగా నిలుస్తుంది. ఖరీఫ్‌లో వరి ఎకరానికి రూ.40 వేలు, కందికి రూ.20 వేలు, మిర్చికి రూ.90 వేలు, మొక్కజొన్నకు రూ.33 వేలు, పసుపుకు రూ.94 వేలు చొప్పున బీమా కల్పించారు.
ఈ మొత్తాలు రైతులకు ఆర్థిక భరోసా ఇవ్వనున్నాయి. పీఎంఎఫ్‌బీవై కింద బీమా యూనిట్ స్థాయిలో వాస్తవ దిగుబడిని అంచనా వేస్తారు. పథకం నిబంధనలు, అర్హత ఆధారంగా క్లైమ్‌లకు చెల్లింపులు నిర్ణయిస్తారు. వాతావరణ ఆధారిత పథకం అమలుకు వాస్తవ వర్షపాతం, ఉష్ణోగ్రత, ఇతర సూచికలను పరిగణలోకి తీసుకుంటారు. నిబంధనల ప్రకారం పరిహారాన్ని లెక్కిస్తారు. రైతుల నమోదు, ఈ-క్రాప్ ధ్రువీకరణతో అర్హత కలిగిన రైతులకు మార్గదర్శకాల ప్రకారం బ్యాంకు ఖాతాల్లో బీమా సొమ్మును జమ చేస్తారని అధికారులు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?