రైతు కష్టం వర్షార్పణం
ABN , Publish Date - Oct 29 , 2026 | 06:20 AM
అతి తీవ్ర తుఫాన్ ఆర్నబ్ ప్రభావంతో కురిసిన భారీవర్షాల కారణంగా దక్షిణ కోస్తాలోనూ పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది.
ఉద్యాన పంటలతో పాటు నేలవాలిన వరిపైరు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): అతి తీవ్ర తుఫాన్ ఆర్నబ్ ప్రభావంతో కురిసిన భారీవర్షాల కారణంగా దక్షిణ కోస్తాలోనూ పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. బాపట్ల జిల్లా వేమూరులో అత్యధికంగా 17 సెంటీమీటర్లు, కృష్ణాజిల్లా కోడూరులో 16.58, రేపల్లెలో 15.5, కొల్లూరులో 14.2, అమర్తలూరులో 13.4, చుండూరులో 13, మచిలీపట్నం సౌత్, నార్త్ మండలాల్లో 11.26, నాగాయలంకలో 10.88, గూడూరులో 10.22, సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. కృష్ణాజిల్లాలో 35,273 హెక్టార్లలో పంటలు నీటమునిగినట్టు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక నివేదిక పంపారు.
చల్లపల్లి, మచిలీపట్నం, ఘంటసాల, కృత్తివెన్ను, బంటుమిల్లి తదితర మండలాల్లో 34,864 హెక్టార్లలో వరిపంట నీటమునిగిందని, ఇందులో కోతకు సిద్ధంగా ఉన్న వరి అధికంగా ఉందని పేర్కొన్నారు. మినుము 350 హెక్టార్లు, చెరుకు 25, వేరుశెనగ 23 హెక్టార్లలో నీటమునిగినట్టు వివరించారు. బాపట్ల జిల్లాలోనూ అన్నదాతలకు తీవ్రనష్టం కలిగింది. 10-15 రోజుల్లో చేతికి వచ్చే వరి పైరు.. వర్షం, గాలులకు చాపలా నేలవాలింది. కొల్లూరు, భట్టిప్రోలు లంక గ్రామాల్లో సాగు చేస్తున్న వాణిజ్య పంటలు అరటి, కంద, బొప్పాయి, తమలపాకు తోటలు విరిగిపోయాయి. పసుపు పైరులో సైతం వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. జిల్లా వ్యాప్తంగా 11,000 హెక్టార్లలో వరి ముంపునకు గురైనట్లు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. దాదాపు వెయ్యి హెక్టార్లలో అరటి తోటలు నేలకొరిగినట్లు తేల్చారు. మంగళవారం రాత్రి 11 గంటలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా.. విద్యుత్‌శాఖాధికారులు బుధవారం సాయంత్రం 4 గంటల తర్వాత సరఫరాను పునరుద్ధరించారు.
ఎన్టీఆర్ జిల్లాలో బలమైన గాలులు, వర్షం ప్రభావం విజయవాడ నగరంపై ఎక్కువగా కనిపించింది. నగరంలో పప్పులమిల్లు సెంటర్ నుంచి తాడిగడప వరకు ఎన్‌హెచ్-65 సముద్రాన్ని తలపించింది. ఎన్‌హెచ్-16పై రామవరప్పాడు నుంచి ఎనికేపాడు వరకు మోకాళ్ల లోతున వర్షం నీరు నిలిచింది. భవానీపురం, మొగ ల్రాజపురం ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. మొగల్రాజపురంలో చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. గుణదలలో వర్షానికి కొండపై మట్టి నానిపోయి ఒక ఇల్లు కిందకు జారింది.
ఎన్టీఆర్ జిల్లా రైతులకు మేలు..
అతి తీవ్ర తుఫాన్ ఆర్నబ్ ఎన్టీఆర్ జిల్లా రైతులకు మేలు చేసింది. పరిపైరు పొట్టనిండిన దశలో నీరు అవసరమైన పరిస్థితిలో ఎల్‌నినో వల్ల ఇబ్బందులు కలుగగా, ప్రస్తుత వర్షాలు వరి రైతులకు మంచి చేశాయి. అయితే, సుంకు మీద ఉన్న వరికి స్వల్పంగా నష్టం కలిగింది. నందిగామ, తిరువూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో అక్కడక్కడ వరిపంట నేలవాలింది. పత్తి పంటకు కూడా సరైన సమయంలో వర్షం కురవటం మంచిదైందని రైతులు భావిస్తున్నారు. ప్రస్తుతం పత్తి గూడు చేసి కాయలు కాస్తాయని, ఎకరాకు మరో రెండు క్వింటాళ్ల మేర పత్తి దిగుబడి వచ్చే అవకాశముందని అంటున్నారు. ఇప్పటికే కొందరు రైతులు పత్తి తీతలు ముగించగా, మరికొందరు తీతలు చేపట్టారు. అయితే, ఈ తుఫాన్‌తో తీత మీద ఉన్న పత్తి తడిచి నేల మీద కారిపోతుందని ఆవేదన చెందుతున్నారు. పింజలోకి నీరు చేరి గింజలు మొలకలొస్తాయన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట