Share News

9 మంది ప్రాణాలు తీసిన తుఫాన్‌

ABN , Publish Date - Oct 29 , 2026 | 06:18 AM

ఆర్నబ్‌ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోయిన ఘటనల్లో 9మంది మృతిచెందారు. తూర్పుగోదావరిజిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద భారీ వృక్షం ద్విచక్ర వాహనంపై కూలిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందారు.

9 మంది ప్రాణాలు తీసిన తుఫాన్‌

  • విద్యుదాఘాతంతో నలుగురు..

  • చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిన ఘటనల్లో ఐదుగురు కన్నుమూత

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): ఆర్నబ్‌ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోయిన ఘటనల్లో 9మంది మృతిచెందారు. తూర్పుగోదావరిజిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద భారీ వృక్షం ద్విచక్ర వాహనంపై కూలిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందారు. కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో పూరిల్లు కూలి కొల్లు వెంకాయమ్మ(70) మృతిచెందారు. గుంటూరు జిల్లా గుడివాడలో మట్టి గోడ కూలి పడి ఆరో తరగతి చదువుతున్న చింతలపూడి దేవాన్‌(11) మృతిచెందాడు. వర్షానికి తడిచిన మట్టి గోడ బాలుడిపై పడింది. మధ్యాహ్నం వరకు ఈ విషయం ఎవరూ గుర్తించలేదు.

రోడ్డుపై పడిన మట్టి గోడను అక్కడి వారు తొలగిస్తుండగా విద్యార్థి మృతదేహం బయట పడింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చొక్క కిశోర్‌ కుమార్‌పై చెట్టు కూలడంతో మృతి చెందారు. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఈదరాడ గ్రామంలో కొబ్బరికాయ గెల మీద పడి శ్రీనివాసరావు అనే వ్యక్తి మృతి చెందారు. విశాఖజిల్లా జీవీఎంసీ 101వ వార్డు మంగళపాలెం కాలనీకి చెందిన ఎ.దేముడు(67) మంగళవారం సాయంత్రం విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు.

అనకాపల్లి పట్టణంలోని భవనం వీధిలో నున్నా నాగబాబు, భాగ్యలక్ష్మి (52) దంపతులు నివాసం ఉంటున్న ఇంటిపై ఈదురుగాలులకు ఇనుప రేకు వచ్చి పడింది. దాన్ని తొలగించడానికి భాగ్యలక్ష్మి యత్నించగా అప్పటికే దానిపై విద్యుత్‌ తీగలు తెగిపడి ఉండడంతో షాక్‌కు గురై మృతి చెందారు. విజయనగరం జిల్లా వేపాడ మండలం నీలకంఠరాజపురంలో బుధవారం సాయింత్రం విధుల్లో భాగంగా ట్రాన్స్‌ఫారమ్‌ స్విచ్‌ ఆన్‌ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై జేఎల్‌ఎం దువ్వాడ పైడిరాజు(28) మృతి చెందారు.

ఈ వార్తలనూ చదవండి:

పోటాపోటీ

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట

Updated Date - Oct 29 , 2026 | 06:23 AM