Share News

‘పశ్చిమ’పై తుఫాన్‌ పంజా

ABN , Publish Date - Oct 29 , 2026 | 05:45 AM

ఆర్నబ్‌ ప్రభావంతో వీచిన రాక్షస గాలులకు పశ్చిమగోదావరి జిల్లా వణికిపోయింది. నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు, యలమంచిలి తదితర మండలాలు అపార నష్టం చవిచూశాయి.

‘పశ్చిమ’పై తుఫాన్‌ పంజా

  • గాల్లోకి లేచిన పెంకుటిళ్లు, షెడ్లు

  • అంధకారంలో వందలాది పల్లెలు

  • స్తంభించిన రవాణా, కమ్యూనికేషన్‌

  • నీటమునిగిన వరి, నేలకొరిగిన అరటి, కొబ్బరి

  • స్వయంగా రంగంలోకి మంత్రి నిమ్మల

నరసాపురం, నరసాపురం రూరల్‌, మొగల్తూరు, యలమంచిలి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ఆర్నబ్‌ ప్రభావంతో వీచిన రాక్షస గాలులకు పశ్చిమగోదావరి జిల్లా వణికిపోయింది. నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు, యలమంచిలి తదితర మండలాలు అపార నష్టం చవిచూశాయి. వందేళ్ల నాటి భారీ వృక్షాలు సైతం వేళ్లతో సహా పెకిలించుకుని రోడ్లపై కుప్పకూలాయి. హోర్డింగ్స్‌ ఎగిరిపడి.. వాహనాల అద్దాలు పగిలిపోయాయి. నరసాపురం, మొగల్తూరు పరిసరాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారి ఉవ్వెత్తున అలలు ఎగసిపడటంతో తీర ప్రాంత వాసులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని గడిపారు. వేలాది స్తంభాలు నేలకూలాయి, వైర్లు తెగిపడ్డాయి. పల్లెలన్నీ అంధకారంలో చిక్కుకున్నాయి. చెట్లు పడిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. దుకాణాలు మూతపడటంతో పాలు, నిత్యావసరాలు దొరకక జనం అల్లాడిపోయారు. పాలుపోసుకునే దశలో ఉన్న వేలాది ఎకరాల వరి పంట గాలులకు, వర్షాలకు పూర్తిగా నేలవాలింది. యలమంచిలి, పాలకొల్లు, ఆచంట తదితర మండలాల్లో వేలాది ఎకరాల్లో అరటి, బొప్పాయి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొబ్బరి చెట్లు పెద్ద ఎత్తున విరిగిపడ్డాయి. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలకు చెరువుల గట్లు తెగిపోయి చేపలు, రొయ్యలు బయటకు కొట్టుకుపోయాయి.

రంగంలోకి మంత్రి నిమ్మల

మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం తెల్లవారుజాము నుంచే పాలకొల్లు నియోజకవర్గంలో మోటార్‌ సైకిల్‌పై విస్తృతంగా పర్యటించారు. మున్సిపల్‌ కార్యాలయం వద్ద కూలిన చెట్టును తొలగించే పనుల్లో స్వయంగా పాల్గొన్నారు. బాధితులకు భరోసా కల్పిస్తూ, అధికారులతో సమన్వయం చేస్తూ సహాయ చర్యలను వేగవంతం చేశారు.


ఆ చరిత్ర పునరావృతం

నరసాపురం కేంద్రంగా తుఫాన్లు బీభత్సం సృష్టించడం కొత్తేమీ కాదు. 19 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న పశ్చిమ గోదావరి తీర ప్రాంతం గత 7దశాబ్దాల్లో ఎన్నో ప్రళయాలకు సాక్ష్యంగా నిలిచింది. ఐఎండీ రికార్డుల ప్రకారం 2018 నాటి పైథాయ్‌, 2025 నాటి మోంథా తుఫాన్లు ఈ ప్రాంతం వద్దే తీరం దాటాయి. 1979లో దివిసీమను ముంచెత్తిన భయానక తుఫాను నుంచి, 1990, 1996 నాటి తుఫాన్లు, 2004 సునామీ, 2010 లైలా, 2016 ఓగ్ని తుఫాన్ల వరకు నరసాపురం తీరాన్ని అతలాకుతలం చేశాయి. ఇప్పుడు ఆర్నాబ్‌ కూడా అదే స్థాయిలో వణికిస్తూ పాత భయాలను నిద్రలేపింది.

తీరంలో కార్గోషిప్‌!

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట తీరం సమీపంలో నడిసంద్రంలో కార్గోషిప్‌ నిలిచిపోయింది. అయితే తుఫాన్‌ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో పిఫ్‌ అక్కడ నిలిపి ఉంటారని చర్చించుకుంటున్నారు. షిప్‌ గురించి ఆరా తీస్తున్నామని భావనపాడు మెరైన్‌ పోలీసులు తెలిపారు.

ఒడిశా క్యాచ్‌మెంట్‌లో భారీ వర్షాలు

ఒడిశా క్యాచ్‌మెంట్‌ ఏరియాలో కురిసిన భారీ వర్షాలకు వంశధార నదికి వరద పోటెత్తింది. దీనికితోడు ఒడిశాలోని హరబంగి రిజర్వాయర్‌ నుంచి బుధవారం సాయంత్రం సమాచారం లేకుండా 44 వేల క్యూసెక్కులను నదిలోకి విడిచిపెట్టారు. అధికారులు అప్రమత్తమై గొట్టాబ్యారేజి 22 గేట్లు ఎత్తి ఉన్న నీటిని విడిచి పెడుతున్నారు. గురువారం మధ్యాహ్నానికి వంశధారలో లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉండొచ్చని అంచనా వేశారు.

ఈ వార్తలనూ చదవండి:

పోటాపోటీ

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట

Updated Date - Oct 29 , 2026 | 05:45 AM