Share News

కుప్పకూలిన విద్యుత్‌ వ్యవస్థ

ABN , Publish Date - Oct 29 , 2026 | 06:23 AM

ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రంలోని రెండు డిస్కంల పరిధిలో విద్యుత్‌ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ శాఖకు రూ.17 కోట్ల నష్టం వాటిల్లింది.

కుప్పకూలిన విద్యుత్‌ వ్యవస్థ

  • ఆర్నబ్‌తో రాష్ట్రంలో రూ.17 కోట్ల నష్టం

  • తెలంగాణ సాయం కోరిన విద్యుత్తు శాఖ

విజయవాడ/ అమరావతి, విశాఖపట్నం, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రంలోని రెండు డిస్కంల పరిధిలో విద్యుత్‌ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ శాఖకు రూ.17 కోట్ల నష్టం వాటిల్లింది. మొత్తం 16 వేల విద్యుత్‌ స్తంభాలు దెబ్బతిన్నాయి. ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలోని కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే 15 వేల స్తంభాలు ధ్వంసమయ్యాయి. దీంతోపాటు 673 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురయ్యాయి. వీటివల్ల 3,872 గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పనులకు 8,161 మందితో 703 బృందాలను ఏర్పాటు చేసి పనులు చేయిస్తున్నారు. ఇప్పటివరకూ 2,549 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించినట్టు ఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ్‌ తెలిపారు.

రాయలసీమ నుంచి మరో రెండు వేల అదనపు సిబ్బందిని తెప్పించామని, వారు కూడా పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్నారని చెప్పారు. ఏపీసీపీడీసీఎల్‌ పరిధిలో కృష్ణా, ఎన్టీఆర్‌, బాపట్ల, సీఆర్‌డీఏ, గుంటూరు జిల్లాల్లోని 857 గ్రామాల్లో 2,96,254 సర్వీసులు దెబ్బతిన్నాయి. కృష్ణాజిల్లాలో అత్యధికంగా 505 గ్రామాల్లోని 1,42,475 సర్వీసులు దెబ్బతినగా రూ.30 లక్షల వరకు నష్టం వాటిల్లింది. ఎన్టీఆర్‌ జిల్లాలోని 61 గ్రామాల్లో 1,248, బాపట్లలోని 233 గ్రామాల్లో 1,07,446, సీఆర్డీఏ పరిధిలోని 32 గ్రామాల్లో 2,476, గుంటూరు జిల్లాలోని 36 గ్రామాల్లో 42,232 సర్వీసులు దెబ్బతిన్నాయని అధికారులు వివరించారు. వీటిలో 90 శాతం సర్వీసులను వెంటనే పునరుద్ధరించినట్లు తెలిపారు.


మార్కాపురం, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని విద్యుత్‌ వ్యవస్థలకు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తేల్చారు. ఇదిలాఉండగా, తుఫాన్‌ ప్రభావంతో విద్యుత్‌ శాఖకు నష్ట తీవ్రత ఎక్కువగా ఉందని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు అవసరమైన సామగ్రితో పాటు సిబ్బందిని కూడా పంపాలని తెలంగాణ విద్యుత్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ను మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ కోరారు. విపత్తు సమయంలో ఏపీకి అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. అవసరమైన సిబ్బందిని, సామగ్రిని రాష్ట్రానికి పంపడానికి అంగీకరించింది. ఆ తర్వాత మంత్రి గొట్టిపాటికి తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఫోన్‌ చేశారు. ఏపీకి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ వార్తలనూ చదవండి:

పోటాపోటీ

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట

Updated Date - Oct 29 , 2026 | 06:23 AM