Share News

‘అక్వాన్‌’ ముప్పు తప్పింది!

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:06 AM

కోస్తాకు తీవ్ర తుఫాన్‌ ముప్పు తప్పింది. మధ్య కోస్తా లేదా ఉత్తర కోస్తాలో తీరం దాటుతుందని తొలుత భారత వాతావరణ శాఖ అంచనా వేసినా అందుకు భిన్నంగా...

‘అక్వాన్‌’ ముప్పు తప్పింది!

  • గోపాల్‌పూర్‌ వద్ద తీరం దాటిన తీవ్ర తుఫాను

  • కోస్తాను తాకకుండానే ఒడిశా వైపు మళ్లిన వైనం

  • ఉత్తరాంధ్రపైకి రాకుండా అడ్డుకున్న ‘రిడ్జి’

  • సిక్కోలు శివారు ప్రాంతాల్లోనే భారీ వర్షాలు

  • ఇచ్ఛాపురంలో అత్యధికంగా 19 సెం.మీ. వర్షం

  • ఊపిరి పీల్చుకున్న కోస్తా రైతాంగం, అధికారులు

విశాఖపట్నం/అమరావతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కోస్తాకు తీవ్ర తుఫాన్‌ ముప్పు తప్పింది. మధ్య కోస్తా లేదా ఉత్తర కోస్తాలో తీరం దాటుతుందని తొలుత భారత వాతావరణ శాఖ అంచనా వేసినా.. అందుకు భిన్నంగా శుక్రవారం ఉదయం 7.30 నుంచి 8.30 గంటల మధ్య దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య గోపాల్‌పూర్‌కు 15 కి.మీ.దూరంలో ‘అక్వాన్‌’ తీరం దాటింది. అనంతరం ఉత్తర ఈశాన్యంగా పయనించి సాయంత్రానికి వాయుగుండంగా మారింది. శనివారానికి అల్పపీడనంగా మరింత బలహీనపడనుంది.


తుఫాన్‌ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, సోంపేట ప్రాంతాల్లో కొంతనష్టం వాటిల్లింది. కోస్తాలో మిగిలిన రైతాంగానికి గండం తప్పింది. ఈనెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా, అనంతరం తీవ్ర వాయుగుండంగా, 16వ తేదీ సాయంత్రం తుఫాన్‌గా, 18వ తేదీన తీవ్ర తుఫాన్‌గా మారింది. 20న మచిలీపట్నానికి సమీపంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే తుఫాన్‌ను ఉత్తరాంధ్ర పరిసరాల్లో ఆవరించిన రిడ్జి నియంత్రించింది. తీవ్ర తుఫాన్‌ ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్రలో పలుచోట్ల జల్లులు కురిశాయి.

శ్రీకాకుళం జిల్లా శివారు ప్రాంతంలో భారీ నుంచి అతిభారీవర్షాలు కురిశాయి. ఇచ్ఛాపురంలో అత్యధికంగా 19, సోంపేటలో 13, పలాసలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనకాపల్లి, కాకినాడ జిల్లాలతోపాటు.. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. ఇచ్ఛాపురం సరిహద్దులో ఉన్న బాహుదా నదికి వరద ప్రవాహం పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా, తీవ్ర తుఫాన్‌ గురువారం రాత్రికి తుఫాన్‌గా బలహీనపడంతో గాలుల వేగం తగ్గింది.

ఇప్పటికే రెండు వరుస తుఫాన్లతో అతలాకుతలమైన రైతులు.. అక్వాన్‌ విరుచుకుపడితే చేతికొచ్చిన పంట ఎక్కడ పాడైపోతుందోనని భయపడ్డారు. అయితే వారం పాటు 1000 కి.మీ. మేర సాగిన తుఫాన్‌ పయనం.. రాష్ట్రాన్ని దాటిపోవడంతో అందరికీ ఉపశమనం కలిగింది.

ఈ వార్తలనూ చదవండి:

పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి

తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి

Updated Date - Nov 21 , 2026 | 05:09 AM