Share News

‘జోగి భూకబ్జా’.. కలకలం

ABN , Publish Date - Aug 31 , 2026 | 05:52 AM

గుంటూరులో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్‌ భూకబ్జా ఉదంతం కలకలం రేపింది. ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనం రాజకీయవర్గాలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్థుల్లో సంచలనం సృష్టించింది.

‘జోగి భూకబ్జా’.. కలకలం
Bhukabja

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఏపీఎస్ఐడీసీ

  • వ్యవహారం మరోసారి చర్చకు..

  • గుంటూరు నడిబొడ్డున రూ.కోట్ల స్థలం

  • కొట్టేస్తుంటే కనీసం స్పందించదా?

  • పలువురి విస్మయం..

  • మాజీ మంత్రిపై చర్యకు డిమాండ్‌

గుంటూరు, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): గుంటూరులో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్‌ భూకబ్జా ఉదంతం కలకలం రేపింది. ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనం రాజకీయవర్గాలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్థుల్లో సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో జోగికి సహకరించిన ఏపీ స్టేట్‌ ఇరిగేషన్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ తీరును తప్పుబడుతున్నారు. గుంటూరు నగరం నడిబొడ్డున ప్రభుత్వరంగ సంస్థ భూమి కబ్జాకు గురైతే కనీసం స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అసలు గుంటూరులో ఏపీఎస్ఐడీసీ కార్యాలయం ఉందా .. లేదా అన్న పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యాలయంలో విధులు నిర్వహించే అధికారులకు ఎమ్మెల్యేలు అంటే అసలు లెక్కే లేదనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. కనీసం తమ ఫోన్లు ఎత్తలేని పని ఒత్తిడి ఏమి ఉందో చెప్పాలంటూ ఇటీవల జరిగిన జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణతో సహా పలువురు ప్రజాప్రతినిధులు ఆ సంస్థ అధికారులను నిలదీశారు.


ఇదిగో ఇదే ఆ స్థలం..

ప్రైవేటు వ్యక్తిని అడ్డం పెట్టుకుని జోగి కబ్జా చేసినట్టు ప్రభుత్వం నిర్ధారించిన ఏపీఎ్‌సఐడీసీకి చెందిన స్థలం నల్లపాడు రోడ్డులో చుట్టుగుంటకు సమీపంలోని వేర్‌హౌసింగ్‌ గోడౌన్స్‌ పక్కనే ఉంది. గజం రూ. లక్షకుపైగానే పలికే ఇక్కడ 1840.83 చదరపు గజాల భూమిని నాడు ప్రభుత్వం కేటాయించింది. ఆ వివరాల్లోకి వెళితే.. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పందుల కాలనీ ఒక మారుమూల మురికివాడ. అక్కడ చదరపు గజం రూ. 10 వేలు కూడా ఉండదు. అక్కడ ప్రైవేటు భూమి ఆక్రమణకు గురైతై సంబంధిత వ్యక్తి కోర్టుని ఆశ్రయించారు. కోర్టు ప్రత్యామ్నాయంగా స్థలం చూపించమని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇంచుమించు అలాంటి భూమినే అక్కడికి సమీపంలో కేటాయించాల్సిన ప్రభుత్వం, ఎంచక్కా గజం రూ. లక్ష ఉన్న చోట కేటాయించేసింది. అది కూడా గతంలో ప్రభుత్వరంగ సంస్థకు తాత్కాలికంగా కేటాయించిన స్థలంలోనే దానిని ఇవ్వడం గమనార్హం. గుంటూరు తూర్పు, పశ్చిమ మండలాల్లో ప్రభుత్వ ఖాళీ స్థలాలు అందుబాటులో లేక కొత్తగా ఏవైనా ప్రాజెక్టులకు భూములు కేటాయించలేని పరిస్థితి కొనసాగుతుండగా ఏకంగా 1840.83 చదరపు గజాల భూమిని నగరం నడిబొడ్డున ఇచ్చేయడంపై ఆరోపణలు వెల్లువెత్తుతోన్నాయి. దీనికి సంబంధించిన సర్వే నంబర్లతో నివేదికని సోమవారం ప్రభుత్వానికి నివేదించేందుకు ఇంటెలిజెన్స్‌ విభాగం సిద్ధమైంది. విజిలెన్స్‌ డైరెక్టర్‌ నుంచి ఆదేశాలు రాగానే తాము కూడా రంగంలోకి దిగుతామని ఆ శాఖ ప్రాంతీయ కార్యాలయం ఎస్‌పీ దువ్వారపు సూర్యశ్రవణ్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

కడప జిల్లా వెలిదండ్ల రైతుకు ప్రధాని మోదీ ప్రశంసలు

రాయలసీమకు మహర్దశ!

Updated Date - Aug 31 , 2026 | 06:02 AM