పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై పేర్లు తెలుగులోనే
ABN , Publish Date - Oct 28 , 2026 | 05:31 AM
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై పోటీచేసే అభ్యర్థుల పేర్ల క్రమం, ముద్రణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది.
నోటాకు ‘పైవేవీ కావు’ అని ముద్రించాలి
అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై పోటీచేసే అభ్యర్థుల పేర్ల క్రమం, ముద్రణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. గతంలో జారీచేసిన సర్క్యులర్‌లో పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల పేర్ల అమరికకు సంబంధించి పేర్కొన్న విధానంలో కొంత మార్పు చేసి తాజా ఉత్తర్వులు ఇచ్చారు. ఈమేరకు ఎస్ఈసీ అనిల్‌చంద్ర పునేఠా ఆదేశాలిచ్చారు.
దీని ప్రకారం అభ్యర్థులను నాలుగు వర్గాలుగా విభజిస్తారు. 1. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు. 2. రిజర్వుడు గుర్తు కలిగిన రాజకీయ పార్టీల అభ్యర్థులు. 3. రిజర్వుడు గుర్తులేని నమోదిత రాజకీయ పార్టీల అభ్యర్థులు. 4. స్వతంత్ర అభ్యర్థులు. మొదటి మూడు వర్గాలకు చెందిన అభ్యర్థుల పేర్లకు దిగువన వారు అనుబంధగా ఉన్న రాజకీయ పార్టీ పేరు తెలుగులో ముద్రించాలి. అభ్యర్థి పేరు కూడా తెలుగులోనే ఉండాలి. పోటీ చేసే అభ్యర్థులందరి పేర్ల.. చివరన నోటాకు కేటాయించాలి. నోటా స్థానంలో ‘పైవేవీ కావు’ అని తెలుగులో ముద్రించాలి. ఈ ఆదేశాలను ఎన్నికల అధికారులు అమలు చేయాలని ఎస్ఈసీ సూచించింది.
ఈ వార్తలనూ చదవండి:
తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!
ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు