Share News

ట్రూడౌన్‌పై సందిగ్ధత!

ABN , Publish Date - Sep 26 , 2026 | 04:23 AM

విద్యుత్తు వినియోగదారులకు వరుసగా రెండో ఏడాది ట్రూడౌన్‌ అమలుపై సందిగ్ధత నెలకొంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంధన, విద్యుత్తు కొనుగోలు వ్యయ సర్దుబాటు(ఫ్యూయల్‌ అండ్‌ పవర్‌ పర్చేజ్‌ కాస్ట్‌ అడ్జె్‌స్టమెంట్‌-ఎఫ్‌పీపీసీఏ)పై నిర్ణయాన్ని ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) పెండింగ్‌లో పెట్టింది.

ట్రూడౌన్‌పై సందిగ్ధత!

  • రూ.629.35 కోట్లపై తేల్చని ఏపీఈఆర్సీ

  • రూఫ్‌టాప్‌ సోలార్‌తో ఆదాయం తగ్గిందన్న ఈపీడీసీఎల్‌

  • ఆ నష్టాన్ని భర్తీ చేసేలా నిర్ణయం తీసుకోవాలంటూ లేఖ

  • నవంబరులో తుది నిర్ణయం తీసుకోనున్న ఈఆర్సీ

అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): విద్యుత్తు వినియోగదారులకు వరుసగా రెండో ఏడాది ట్రూడౌన్‌ అమలుపై సందిగ్ధత నెలకొంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంధన, విద్యుత్తు కొనుగోలు వ్యయ సర్దుబాటు(ఫ్యూయల్‌ అండ్‌ పవర్‌ పర్చేజ్‌ కాస్ట్‌ అడ్జె్‌స్టమెంట్‌-ఎఫ్‌పీపీసీఏ)పై నిర్ణయాన్ని ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) పెండింగ్‌లో పెట్టింది. సుమారు రూ.629.35 కోట్లు మిగులును ట్రూడౌన్‌ రూపంలో వినియోగదారుల కు అందించడమా లేక డిస్కంలకు సర్దుబాటు చేయడమా అన్న అంశంపై నవంబరులో ఆదాయ, వ్యయ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది.


ఈపీడీసీఎల్‌ లేఖతో పునరాలోచన

ఈఆర్సీకి జూలైలో డిస్కంలు సమర్పించిన ఇంధన సర్దుబాటు ఖర్చుల్లో రూ.940.07 కోట్లు మిగులుగా చూపాయి. దీంతో వరుసగా రెండోసారి ట్రూడౌన్‌ ఇస్తారని అంతా భావించారు. కానీ డిస్కంలు ఇచ్చిన తుది వివరాలు, ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత మిగులు రూ.629.35 కోట్లుగా ఈఆర్సీ తేల్చింది. ఈ మొత్తాన్ని ట్రూడౌన్‌ చేసి వినియోగదారులకు లబ్ధి చేకూర్చాలని భావించినా ఈపీడీసీఎల్‌ రాసిన లేఖతో పునరాలోచనలో పడింది. ఈ ఏడాది ఆగస్టులో ఈఆర్సీకి ఈపీడీసీఎల్‌ రాసిన లేఖలో.. 2025-26కి సంబంధించి విద్యుత్తు అమ్మకాల ద్వారా ఆశించిన ఆదాయం రాలేదని, ముఖ్యంగా రూఫ్‌టాప్‌ సోలార్‌ వినియోగం 409 శాతం పెరగడంతో గృహ వినియోగదారుల అమ్మకాలు 11.14 శాతం తగ్గాయని తెలిపింది. పారిశ్రామిక వినియోగదారుల నుంచి కూడా ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదని పేర్కొంది.

రూ.22,543 కోట్ల ఆదాయాన్ని ఆశిస్తే కేవలం రూ.20,485 కోట్లు మాత్రమే వచ్చిందని, లోటు రూ.2,057 కోట్లుగా ఉందని వివరించింది. వినియోగదారులకు ట్రూడౌన్‌ అమలు చేస్తే ఈపీడీసీఎల్‌ పరిధిలో రూ.1,495 కోట్లు చెల్లించాల్సి రావడం అదనపు భారంగా మారుతుందని తెలిపింది. తిరిగి చెల్లించాల్సిన మొత్తాన్ని రాబడి లోటుతో భర్తీ చేస్తే తామే మరో రూ.562 కోట్లు ట్రూఅప్‌ చార్జీల రూపేణా వసూలు చేసుకునే వెసులుబాటు కలుగుతుందని కోరింది. ఈ లేఖను పరిగణనలోకి తీసుకున్న ఈఆర్సీ.. నవంబరులో డిస్కంలు సమర్పించే రిటైల్‌ సప్లయ్‌ బిజినెస్‌ ట్రూఅప్‌ ఫైలింగ్స్‌ను పరిశీలించి, 2027-28 ఆర్థిక సంవత్సరానికి ఇచ్చే రిటైల్‌ సప్లయ్‌ ఆర్డర్‌లో తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.

ఈ వార్తలనూ చదవండి..

ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్

హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

Updated Date - Sep 26 , 2026 | 04:23 AM