Share News

మహిళల్లో రక్తహీనత గండం!

ABN , Publish Date - Nov 25 , 2026 | 04:18 AM

రాష్ట్రంలోని మహిళల్లో రక్తహీనత (ఎనీమియా) సమస్య తీవ్రంగా ఉంది. 60 ఏళ్లు పైబడిన మహిళల్లో ఏకంగా 81.7 శాతం మంది ఈ రుగ్మతతో బాధపడుతున్నారు.

మహిళల్లో రక్తహీనత గండం!

  • రాష్ట్రంలో 68.5శాతం మంది బాధిత యువతులు

  • ఐదేళ్లలోపు పిల్లల్లో 57.5 శాతం మందికి ఎనీమియా

  • కౌమార బాలికల్లో 51.9 శాతం మందికి

  • 81.7 శాతం మంది వృద్ధ మహిళల్లోనూ సమస్య

  • ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఎన్‌ ‘సంపద’ సర్వే వెల్లడి

న్యూఢిల్లీ, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మహిళల్లో రక్తహీనత (ఎనీమియా) సమస్య తీవ్రంగా ఉంది. 60 ఏళ్లు పైబడిన మహిళల్లో ఏకంగా 81.7 శాతం మంది ఈ రుగ్మతతో బాధపడుతున్నారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌)- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషన్‌(ఎన్‌ఐఎన్‌) తాజాగా నిర్వహించిన ‘సంపద’ జాతీయ సర్వేలో ఈ విషయం వెలుగు చూసింది. 2023-25 మధ్యకాలానికి గాను చేపట్టిన ఈ సర్వే ప్రకారం... రాష్ట్రంలో ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, కౌమార బాలికల్లో రక్తహీనత ఆందోళనకర స్థాయిలో ఉంది.

పునరుత్పత్తి సామర్థ్యం ఉండే 15-49 ఏళ్ల మహిళల్లో 68.5 శాతం మందికి, 20-59 ఏళ్ల వయసున్న మహిళల్లో 68.2 శాతం మందికి ఎనీమియా ఉన్నట్లు గుర్తించారు. ఐదేళ్లలోపు చిన్నారుల్లోనూ 57.5 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. 10-19 ఏళ్ల వయసున్న కౌమార బాలికల్లో 51.9 శాతం మందికి ఎనీమియా ఉండగా, అదే వయసున్న బాలురలో 26.9 శాతం మంది రక్తహీనత బాధితులు ఉన్నారని తెలిపింది.


ఐదేళ్ల నుంచి తొమ్మిదేళ్ల వయసున్న పిల్లల్లో 32 శాతం మందికి ఈ సమస్య ఉన్నట్లు గుర్తించింది. ఇక 20-59 ఏళ్ల పురుషుల్లో 21.3శాతం మందికి, 60 ఏళ్లు పైబడిన పురుషుల్లో 62.5 శాతం మందికి ఎనీమియా ఉన్నట్లు పేర్కొంది. అయితే జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలోని పలు వర్గాల్లో రక్తహీనత శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం. ఐదేళ్లలోపు చిన్నారుల్లో జాతీయ సగటు 41.8 శాతం కాగా.. ఏపీలో 57.5 శాతంగా నమోదైంది. కౌమార బాలికల్లో దేశ సగటు 46.3 శాతం కాగా.. ఏపీలో 51.9 శాతం ఉంది. 15-49 ఏళ్ల మహిళల్లో జాతీయ సగటు 55.9 శాతం ఉండగా.. ఏపీలో 68.5 శాతానికి చేరింది. వృద్ధ మహిళల్లో దేశ సగటు 55.7 శాతం కాగా.. ఏపీలో 81.7 శాతంగా నమోదైంది.

ఈ వార్తలనూ చదవండి:

ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

Updated Date - Nov 25 , 2026 | 04:22 AM