కేంద్రీకృత కొనుగోళ్లకు ‘బ్రాండ్’ దెబ్బ!
ABN , Publish Date - Nov 26 , 2026 | 05:38 AM
సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు నాణ్యమైన ఆహారపదార్థాలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి క్షేత్రస్థాయిలోనే గండి పడుతోంది.
సంక్షేమ హాస్టళ్ల సరుకుల నాణ్యతపై రాజీ!.. ప్రభుత్వ లక్ష్యానికి విరుద్ధంగా టెండర్ల నిబంధనలు
ప్రముఖ కంపెనీలతోపాటు ఇతర బ్రాండ్లకూ అవకాశం
సీఎంవో దృష్టికి వెళ్లడంతో బీసీ సంక్షేమ టెండర్ల రద్దు?
(అమరావతి-ఆంధ్రజ్యోతి): సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు నాణ్యమైన ఆహారపదార్థాలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి క్షేత్రస్థాయిలోనే గండి పడుతోంది. భారీస్థాయిలో కొనుగోళ్లు చేపట్టి ప్రముఖ కంపెనీల ఉత్పత్తులను సరసమైన ధరలకు అందించాలన్న కేంద్రీకృత సేకరణ విధానంలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. ప్రభుత్వం ఒక లక్ష్యంతో ముందుకెళ్తుంటే...టెండర్ల రూపకల్పనలో సంక్షేమాధికారులు మరో విధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రముఖ బాండ్లతో పాటు ‘ఈక్వలెంట్ బ్రాండ్’, ఎఫ్‌ఎస్ఎస్ఏఐ ఆమోదిత బ్రాండ్లు అంటూ ఇతర ఉత్పత్తులకు అవకాశం కల్పించడం ఆందోళనకు కారణమవుతోంది. సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ హాస్టళ్లకు అవసరమైన నిత్యావసర సరుకులను గతంలో ఎన్డీయే ప్రభుత్వ హయాంలో కేంద్రీకృత విధానంలోనే కొనుగోలు చేసేవారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే నాణ్యత కలిగిన సరుకులు సరఫరా చేయడంతో పాటు భారీ పరిమాణంలో కొనుగోళ్లు చేపట్టి ధరలను నియంత్రించాలన్నది ప్రధాన ఉద్దేశం. అయితే కూరగాయలు, మాంసం, పండ్లు వంటి త్వరగా పాడయ్యే సరుకులను జిల్లా స్థాయిలో, పప్పులు, ఇతర నిత్యావసరాలు, నూనెలు తదితర నిల్వ ఉంచగల సరుకులను కేంద్రీకృత టెండర్ల ద్వారా కొనుగోలు చేసేవారు.
2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో వికేంద్రీకృత విధానాన్ని అమలు చేసి రెండు రకాల సరుకులనూ జిల్లా కొనుగోలు కమిటీల ద్వారా సేకరించారు. ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ కేంద్రీకృత కొనుగోళ్లకు ప్రాధాన్యమిచ్చింది. సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమశాఖల్లో త్వరగా పాడవని సరుకులను ఒకే విధానంలో సేకరించాలని నిర్ణయించింది. సంబంధిత మంత్రులు, కార్యదర్శుల సమావేశాల అనంతరం సాంఘిక సంక్షేమశాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ సొసైటీ స్టాండిం గ్ ఆర్డర్ ద్వారా కేంద్రీకృత కొనుగోళ్లకు ఉత్తర్వు లు జారీచేసింది. మూడు సంక్షేమశాఖల్లో కలిపి సుమారు 40 రకాల ఉత్పత్తుల అవసరముంటుందని అంచనా వేశారు. నాణ్యమైన సరుకుల కొనుగోళ్లకు ధరలు కొంత పెరిగినా ఇబ్బంది లేకుండా ఆయా శాఖల బడ్జెట్‌ను అదనంగా 10 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
బీసీ సంక్షేమ టెండర్‌లో ‘ఈక్వలెంట్ బ్రాండ్’
రాష్ట్రవ్యాప్తంగా భారీ పరిమాణంలో కొనుగోళ్లు చేపడితే ఐటీసీ, రిలయెన్స్, టాటా, పతంజలి, ఆచి, ప్రియా, నట్రాజ్ వంటి ప్రముఖ కంపెనీలు ముందుకొచ్చి మెరుగైన ధరలకు నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేయగలవన్నది ప్రభుత్వ ఆలోచన. ఒకే కంపెనీ మొత్తం 40 రకాల ఉత్పత్తులను తయారుచేయలేని పరిస్థితుల్లో గుత్తాధిపత్యం ఏర్పడకుండా పలు కార్పొరేట్ సంస్థలను భాగస్వాములను చేయాలన్నది మరో ఉద్దేశం. అయితే బీసీ సంక్షేమశాఖ అక్టోబరు 12న విడుదల చేసిన టెండర్ నిబంధనల్లో ప్రముఖ బాండ్లతోపాటు ‘ఈక్వలెంట్ బ్రాండ్’ అనే నిబంధనను చేర్చడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రముఖ బ్రాండ్లతో పాటు సమానమైన ఇతర బ్రాండ్లకు అవకాశం కల్పించడం వల్ల నాణ్యత విషయంలో రాజీపడే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమాచారం సీఎం కార్యాలయానికి చేరడంతో బీసీ సంక్షేమశాఖ ఈ టెండర్లను రద్దు చేసిందని సమాచారం.
సాంఘిక సంక్షేమశాఖలోనూ...
సాంఘిక సంక్షేమశాఖ ఈనెల 17న పిలిచిన టెండర్ల నిబంధనల్లో టాటా సంపన్, ఫార్చ్యూన్, ఆశీర్వాద్, బీబీ రాయల్, పతంజలి తోపాటు ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ ఆమోదం పొందిన బ్రాండ్లను కూడా చేర్చారు. తయారీ కార్యకలాపాలకు ఎఫ్‌ఎస్ఎస్ఏఐ లైసెన్స్ తప్పనిసరి అయినప్పటికీ, కేవలం ఆ అనుమతి ప్రాతిపదికన అన్ని ఉత్పత్తులనూ ఒకేస్థాయి నాణ్యత కలిగినవిగా పరిగణించలేమన్నది ప్రధాన అభ్యంతరం. కేవలం ఎఫ్‌ఎస్ఎస్ఏఐ అనుమతి ఆధారంగా కాకుండా, ఉత్పత్తి నాణ్యత, ప్రమాణాలు, తయారీసంస్థ సామర్థ్యం, నాణ్యత నియంత్రణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. టెండర్లలో ప్రముఖ బ్రాండ్లతో పాటు ఇతర బ్రాండ్లకు అవకాశం కల్పిస్తే బిడ్డర్లు తమకు అనుకూలమైన ధర, ఎంఆర్‌పీ, ప్యాకింగ్ పరిమాణం ఆధారంగా ఉత్పత్తులను ఎంపిక చేసుకునే అవకాశముంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది విద్యార్థులకు రోజూ సరఫరా చేసే ఆహారపదార్థాల విషయంలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రముఖ బాండ్లకే ప్రాధాన్యమివ్వాలి...
కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు, పామాయిల్, చక్కెర, గోధుమపిండి, కారం, డాల్డా, అయోడైజ్డ్ ఉప్పు, సాంబార్ పొడి, పసుపు, బెల్లం, రాగిపిండి, నల్ల శనగలు, బొంబాయి రవ్వ, సేమియా, బన్సీరవ్వ, పచ్చిబఠానీలు వంటి అధిక వినియోగం కలిగిన వస్తువుల విషయంలో ప్రముఖ బాండ్లకే ప్రాధాన్యమివ్వాలని, టాటా, ఐటీసీ, రిలయెన్స్, పతంజలి, ఫార్చ్యూన్, ఆచి, ప్రియా, జీత్, పార్థ్, మధుర్, నట్రాజ్ వంటి బ్రాండ్ల నుంచి సరఫరా పొందేలా చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్