అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు.. హోంమంత్రి కీలక ఆదేశాలు
ABN , Publish Date - Sep 11 , 2026 | 11:57 AM
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మారనుంది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రానున్న మూడు రోజుల పాటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు.
అమరావతి, సెప్టెంబర్ 11: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత సూచించారు. ముఖ్యంగా రానున్న మూడు రోజుల పాటు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు.
వర్షాల ప్రభావంతో ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి అనిత ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అల్పపీడనం పరిస్థితిపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు సముద్రంలో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ 112, 1070, 1800 425 0101 కంట్రోల్ రూమ్ నంబర్లను అందుబాటులో ఉంచింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రైళ్లన్నీ కిటకిట.. వరుస సెలవులతో సొంతూరు బాటపట్టిన జనం
మెగా డీఎస్సీపై జగన్ విషం కక్కడం బాధాకరం: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana New