Share News

పారిశ్రామికాభివృద్ధికి నీటి భద్రత కీలకం: నిమ్మల

ABN , Publish Date - Nov 13 , 2026 | 04:01 AM

పారిశ్రామికాభివృద్ధికి నీటి భద్రత అత్యంత కీలకమని జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్రంలో అపారంగా జలవనరులు, అద్భుత భౌగోళిక అనుకూలతలు ఉన్నాయని, వీటిని సమర్థంగా వినియోగించుకుని...

పారిశ్రామికాభివృద్ధికి నీటి భద్రత కీలకం: నిమ్మల

విశాఖపట్నం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామికాభివృద్ధికి నీటి భద్రత అత్యంత కీలకమని జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్రంలో అపారంగా జలవనరులు, అద్భుత భౌగోళిక అనుకూలతలు ఉన్నాయని, వీటిని సమర్థంగా వినియోగించుకుని కరువురహిత ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు. సీఐఐ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర నీటి విధానంలో భాగంగా.. రిజర్వాయర్ల నిల్వల్లో 10 శాతాన్ని పారిశ్రామిక అవసరాలకు కేటాయిస్తున్నామని తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు 1,053 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఉంది.

5 ప్రధాన నదులు, 35 మధ్య తరహా, చిన్న నదులు, 114 ప్రధాన, మధ్య తరహా రిజర్వాయర్లు, 38 వేలకు పైగా చిన్న నీటిపారుదల చెరువులు, 19 లక్షలకు పైగా వ్యవసాయ బోరుబావులు ఉన్నాయి. ఈ అపార జలసంపదను సమర్థంగా వినియోగించుకుంటూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తున్నాం. పోలవరం-బనకచర్ల, పోలవరం-చంపావతి, వంశధార-నాగావళి, నాగావళి-చంపావతి అనుసంధానాలను ముందుకు తీసుకెళ్లడం మా ప్రభుత్వ తక్షణ ప్రాధాన్యం’ అని చెప్పారు. సీఎం చంద్రబాబు దార్శనికతతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి-కృష్ణా అనుసంధానం సాకారమైందని నిమ్మల తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం

ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు

Updated Date - Nov 13 , 2026 | 04:01 AM