Share News

ఒకే ఊరు.. రెండు జిల్లాలు!

ABN , Publish Date - Nov 24 , 2026 | 06:29 AM

ఎవరైనా మీది ఏ ఊరు అని అడిగితే.. వెంటనే ఫలానా గ్రామం, మండలం, జిల్లా అని చిరునామా చెబుతారు! కానీ ఈ గ్రామ ప్రజలది చిత్రమైన పరిస్థితి. ఉత్తరాంధ్రలోని వెంకటరాయుని అగ్రహారాన్ని (వీఆర్‌ అగ్రహారం) ఏకపట్టా అగ్రహారం..

ఒకే ఊరు.. రెండు జిల్లాలు!

  • సర్పంచులు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలూ ఇద్దరేసి

ఎవరైనా మీది ఏ ఊరు అని అడిగితే.. వెంటనే ఫలానా గ్రామం, మండలం, జిల్లా అని చిరునామా చెబుతారు! కానీ ఈ గ్రామ ప్రజలది చిత్రమైన పరిస్థితి. ఉత్తరాంధ్రలోని వెంకటరాయుని అగ్రహారాన్ని (వీఆర్‌ అగ్రహారం) ఏకపట్టా అగ్రహారం.. బ్రాహ్మణ అగ్రహారం అని కూడా పిలుస్తారు. ఈ గ్రామంలో 430 ఇళ్లు ఉన్నాయి. జనాభా 1403 మంది. ఓటర్లు 985 మంది. ఈ ఊరు రెండు పంచాయతీల్లో విస్తరించి ఉంది. రెండు తాగునీటి పథకాలు.. రెండు పాఠశాలలు.. ఇలా అన్నీ రెండేసి. రెండు మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లలో ఉందా గ్రామం. అంతే కాదండోయ్‌.. ఆ గ్రామానికి ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఇద్దరు కలెక్టర్లు. ఎంపీ మాత్రం ఒక్కరే. దశాబ్దాలుగా ఇలా ఉన్న ఈ గ్రామంలో అభివృద్ధి అంతంత మాత్రమే. గ్రామస్థులంతా కలిసిమెలిసి ఉంటారు.

కష్టసుఖాల్లో పాలు పంచుకుంటారు. ప్రస్తుతం వీఆర్‌ అగ్రహారం.. రాజాం మండలం, రాజాం నియోజకవర్గం, చీపురుపల్లి రెవెన్యూ డివిజన్‌, విజయనగరం జిల్లాలో ఉండగా.. వీఆర్‌ పేట నాగులవలస పంచాయతీ, జి.సిగడాం మండలం, ఎచ్చెర్ల నియోజకవర్గం, శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్‌, శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఒకే గ్రామంగా ఉన్న రెండు గ్రామాలకు సంబంధించి ఇద్దరు సర్పంచులు, ఇద్దరు ఎంపీటీసీలు, ఇద్దరు జడ్పీటీసీలు, ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. కానీ రాజాం, ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గాలు విజయనగరం లోక్‌సభ పరిధిలో ఉండడంతో ఎంపీ మాత్రం ఒకరే.

- (రాజాం రూరల్‌, ఆంధ్రజ్యోతి)


ఇదీ గ్రామ నేపథ్యం

విజయనగరం జిల్లా రాజాం మండలంలోని వీఆర్‌ అగ్రహారం గ్రామం దశాబ్దాల క్రితం బొబ్బిలి రాజులు బ్రాహ్మణులకు ఇచ్చిన ఏకపట్టా అగ్రహారంగా చెబుతారు. కాలక్రమంలో గ్రామంలోని తూర్పున అన్ని కులాలకు చెందినవారు ఇళ్లను నిర్మించుకుంటూ వచ్చారు. నిర్మాణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పేటగా పిలవడం ప్రారంభించారు. రానురాను కొత్తగా విస్తరించిన ప్రాంతాన్ని వీఆర్‌ పేట పేరుతో అంతర్భాగంగా మారింది. 1987.. మండల వ్యవస్థ ప్రారంభమైన సమయం. చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావుకు అనుంగు శిష్యుడుగా ఉన్న వీఆర్‌పేటకు చెందిన జనపాల బాలకృష్ణ టీడీపీ తరఫున రాజకీయ అరంగేట్రం చేశారు. వీఆర్‌ పేటను జి.సిగడాం మండలంలో చేర్పించేలా గద్దె బాబూరావు కృషి చేశారు. వీఆర్‌ అగ్రహారం మాత్రం రాజాం మండలంలో ఉండిపోయింది. అప్పట్లో జి.సిగడాం మండలం చీపురుపల్లి నియోజకవర్గంలో ఉండేది.

ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా

Updated Date - Nov 24 , 2026 | 06:33 AM