Share News

నాయుడుపేటలో బ్యాటరీ విడిభాగాల తయారీ

ABN , Publish Date - Nov 12 , 2026 | 05:09 AM

తిరుపతి జిల్లా నాయుడుపేటలో రూ.4 వేల కోట్ల పెట్టుబడితో భారీ బ్యాటరీ ముడిపదార్థాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకానున్నది.

నాయుడుపేటలో బ్యాటరీ విడిభాగాల తయారీ

  • రూ.4 వేల కోట్ల పెట్టుబడితో యూనిట్‌

  • ఇండో-కొరియన్‌ కంపెనీల భాగస్వామ్యం

  • 2031 నాటికి పూర్తిస్థాయిలో ఉత్పత్తి

  • 5,700 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి

  • మంత్రి లోకేశ్‌తో కార్బన్‌ రీసోర్సెస్‌,

  • కాస్మో ఏఎం అండ్‌ టీ ప్రతినిధుల భేటీ

విశాఖపట్నం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా నాయుడుపేటలో రూ.4 వేల కోట్ల పెట్టుబడితో భారీ బ్యాటరీ ముడిపదార్థాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకానున్నది. భారత్‌ (కోల్‌కతా)కు చెందిన కార్బన్‌ రీసోర్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (సీఆర్‌పీఎల్‌), దక్షిణ కొరియాకు చెందిన కాస్మో ఏఎం అండ్‌ టీ కంపెనీలు సంయుక్తంగా ఈ పరిశ్రమను నెలకొల్పనున్నాయి. కార్బన్‌ కాస్మో అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమతో ప్రత్యక్షంగా 700 మందికి, పరోక్షంగా 5,500 మందికి ఉపాధి లభించనుంది. బుధవారం విశాఖ నోవాటెల్‌ హోటల్‌లో రాష్ట్ర ఐటీ మంత్రి లోకేశ్‌తో ఈ రెండు కంపెనీల ప్రతినిధులు సమావేశమయ్యారు. పరిశ్రమ ఏర్పాటు, భవిష్యత్‌ విస్తరణ ప్రణాళికలపై చర్చించారు.

నాయుడుపేటలో 230 ఎకరాల విస్తీర్ణంలో దక్షిణ కొరియాకు చెందిన కాస్మో సంస్థ పరిజ్ఞానంతో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమలో ఎలక్ర్టిక్‌ వాహనాలు, ఇతర అవసరాలకు వినియోగించే లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీకి.. ఫెరిక్‌ ఫాస్పేట్‌, లిథియం ఐరన్‌ ఫాస్పేట్‌ క్యాథోడ్‌ పదార్థాలను ఉత్పత్తి చేయనున్నారు. మూడు దశల్లో పరిశ్రమ నిర్మాణం పూర్తిచేస్తారు. 30 వేల టన్నుల ఫెరిక్‌ ఫాస్పేట్‌, 30 వేల టన్నుల లిథియం ఐరన్‌ ఫాస్పేట్‌ ఉత్పత్తి సామర్థ్యంతో 2028 మధ్య కాలంలో ప్లాంటును అందుబాటులోకి తీసుకొస్తారు. 2031 నాటికి మొత్తం పరిశ్రమను పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు గత నెల 16న అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ నెల ఆరో తేదీన ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదం తెలిపారు.


తిరుపతి ఐఐటీతో కలిసి ప్రయోగశాల.. లోకేశ్‌ సూచన

లోకేశ్‌ మాట్లాడుతూ.. బ్యాటరీ తయారీతోపాటు పరిశోధన, సాంకేతికత అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కొత్త బ్యాటరీల ఉత్పత్తితోపాటు పాత బ్యాటరీల నుంచి విలువైన పదార్థాలను సేకరించి రీసైకిల్‌ చేసే సాంకేతికతపై పరిశోధనకు తిరుపతి ఐఐటీతో కలిసి ప్రయోగశాల ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. కార్బన్‌ కాస్మో ఏపీకి రావడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో బ్యాటరీ తయారీకి ముడి పదార్థాల సరఫరాలో ఉన్న లోటు భర్తీకి ఈ సంస్థ దోహదం చేస్తోందని తెలిపారు. బ్యాటరీల తయారీలో ఏపీని ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. భేటీలో కార్బన్‌ కాస్మో రీసోర్సెస్‌ ఎండీ అభినవ్‌కుమార్‌ జలాన్‌, కాస్మో ఏఎం అండ్‌ టీ వైస్‌ ప్రెసిడెంట్‌ డ్యూక్‌క్యూపార్క్‌, జీఎం బ్యోంగ్‌డే కిమ్‌, అమన్‌కపూర్‌, సియంగ్‌ జోలీ పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు

15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు

Updated Date - Nov 12 , 2026 | 05:09 AM