Share News

కూటమికే జై!

ABN , Publish Date - Oct 01 , 2026 | 03:43 AM

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో 2024 సార్వత్రిక ఎన్నికలు సరికొత్త చరిత్ర లిఖించాయి. ‘వై నాట్‌ 175‘ అంటూ బరిలోకి దిగిన వైసీపీని 11స్థానాలకే కట్టడి చేస్తూ.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏకంగా 164 స్థానాల్లో జైత్రయాత్ర సాగించింది.

కూటమికే జై!

  • ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్‌డీఏకి 59.4 శాతం ఓట్లు

  • 35కి పడిపోనున్న వైసీపీ ఓట్లు.. చాణక్య స్ట్రాటజీస్‌ సర్వే వెల్లడి

  • పనితీరులో లోకేశ్‌, కోటంరెడ్డి, పవన్‌ కల్యాణ్‌, నిమ్మల టాప్‌

అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో 2024 సార్వత్రిక ఎన్నికలు సరికొత్త చరిత్ర లిఖించాయి. ‘వై నాట్‌ 175‘ అంటూ బరిలోకి దిగిన వైసీపీని 11స్థానాలకే కట్టడి చేస్తూ.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏకంగా 164 స్థానాల్లో జైత్రయాత్ర సాగించింది. చంద్రబాబు సారథ్యంలో ఎన్‌డీఏ ప్రభుత్వం కొలువుదీరి సరిగ్గా 27 నెలలు గడిచాయి; రెండున్నరేళ్ల పాలన పూర్తయిన కీలక తరుణంలో.. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల నాడి ఎలా ఉందనే అంశంపై ‘చాణక్య స్ట్రాటజీస్’ సర్వే సంస్థ 175 నియోజకవర్గాల్లో సమగ్ర సర్వే నిర్వహించి నివేదిక రూపొందించింది. ఆ వివరాలను ఆ సంస్థ ప్రతినిధులు బుధవారం విజయవాడలో వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారన్న ప్రశ్నకు ప్రజలు స్పష్టమైన సమాధానమిచ్చారు. టీడీపీకి 46.9 శాతం, జనసేనకు 9 శాతం, బీజేపీకి 3.5 శాతం, వైసీపీకి 35 శాతం మంది ఓటర్లు మద్దతుగా నిలిచారు. కూటమి పార్టీల ఓట్లను కలిపి చూస్తే దాదాపు 59.4 శాతం ఓట్‌ షేర్‌తో తిరుగులేని ఆధిపత్యం కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో స్థానిక నేతలపై తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు సర్వేలో తేలిందని వెల్లడించారు.


పనితీరు పరంగా మంత్రి లోకేశ్‌ (మంగళగిరి) మొదటిస్థానంలో నిలువగా.. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (నెల్లూరు రూరల్‌) రెండోస్థానం, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌(పిఠాపురం) మూడోస్థానం, మంత్రి నిమ్మల రామానాయుడు(పాలకొల్లు) నాలుగో స్థానంలో ఉన్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు పాలనాదక్షతపై మెజారిటీ ప్రజల్లో నమ్మకం చెక్కుచెదరలేదు. అయితే స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులపై మాత్రం తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. పలువురు ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి, మద్యం అక్రమ వ్యాపారాల్లో మునిగిపోయారని, భూకబ్జాలు, సెటిల్మెంట్లకు ప్రాధాన్యమిస్తూ సమస్యలను గాలికొదిలేశారని జనం భావిస్తున్నారు. వీరిలో పలువురికి వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇస్తే ఓటమి ఖాయమనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను పెద్దఎత్తున అమలు చేస్తున్నా.. దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూటమి నేతలు విఫలమవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమైంది.

ఉదాహరణకు.. ఇప్పుడు సామాజిక పింఛన్లను రూ.4 వేల చొప్పున పంపిణీ చేస్తున్నప్పటికీ.. గతంలో జగన్‌ హయాంలో వలంటీర్లతో మూడేసి వేలు మాత్రమే పంచినప్పుడు వచ్చిన స్థాయిలో ప్రచారం రావడం లేదు. ఆ ఐదేళ్లలో పార్టీ కోసం కేసులు, లాఠీదెబ్బలు తిని కష్టపడిన కార్యకర్తలకు.. 27 నెలలు గడిచినా సరైన గుర్తింపు దక్కలేదన్న అసంతృప్తి టీడీపీ శ్రేణుల్లో తీవ్రంగా ఉంది. గతంలో టీడీపీతో నేరుగా తలపడిన వైసీపీ కీలక నేతలను జనసేనలో చేర్చుకోవడం, ఆ సమయంలో స్థానిక టీడీపీ నేతలతో సంప్రదించకపోవడం క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల నడుమ విభేదాలకు ఆజ్యం పోస్తోందని సర్వేలో వెల్లడైంది. కాగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 39.4 శాతం ఓట్లు సాధించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 35 శాతానికే పడిపోతుందని చాణక్య ప్రతినిధులు తెలిపారు. అయితే కడప, కర్నూలు జిల్లాల్లో ఆ పార్టీ పుంజుకుంటోందన్నారు. కడప జిల్లాలో కమలాపురం మినహా మెజారిటీ స్థానాల్లో ఓటర్లు వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నట్లు సర్వే చెబుతోంది.

ఈ వార్తలనూ చదవండి...

ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’

రైతులకు తీపి కబురు

Updated Date - Oct 01 , 2026 | 03:43 AM