మరిన్ని రంగాల్లో సింగపూర్ సహకారం
ABN , Publish Date - Nov 12 , 2026 | 01:21 AM
సింగపూర్ ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర విద్యాశాఖలో అమలు చేస్తున్న సామర్థ్యాల పెంపు కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని....
సామర్థ్యాల పెంపు కార్యక్రమాలతో రాష్ట్ర విద్యాశాఖలో మంచి ఫలితాలు
సింగపూర్‌లో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ
దాన్ని ఇతర టీచర్లతో పంచుకోవాలి: లోకేశ్
సీఆర్డీఏ కార్యాలయంలో జేఐఎస్‌సీ మూడో సమావేశం
తుళ్లూరు(రాయపూడి), నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): సింగపూర్ ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర విద్యాశాఖలో అమలు చేస్తున్న సామర్థ్యాల పెంపు కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ర్టానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి లోకేశ్ అన్నారు. ఈ సహకారాన్ని మరిన్ని రంగాలకు విస్తరించాలని కోరారు. ఉపాధ్యాయులకు ఆధునిక బోధనా పద్ధతుల్లో శిక్షణతో పాటు ప్రభుత్వ అధికారులకు నాయకత్వ నైపుణ్యాలు, డిజిటల్ గవర్నెన్స్, స్కిల్ డెవల్‌పమెంట్ రంగాల్లో సింగపూర్ అనుభవాన్ని వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. రాజధాని అమరావతిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో బుధవారం సింగపూర్-ఆంధ్రప్రదేశ్ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టాండింగ్ కమిటీ (జేఐఎస్‌సీ) మూడో సమావేశం జరిగింది. మంత్రి లోకేశ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బృందం సింగపూర్ ప్రతినిధులతో భేటీ అయింది. ఈ సందర్భంగా అమరావతిని ఆధునిక, సమగ్ర, సుస్థిర రాజధాని నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్, సింగపూర్ ప్రభుత్వాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలోని అంశాల అమలు, ఇప్పటివరకు సాధించిన పురోగతి, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. గత రెండు సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును సమీక్షించారు.
ప్రతి ఉపాధ్యాయుడికీ శిక్షణ ఫలాలు
రాష్ర్టానికి చెందిన ఆరుగురు మంత్రులు, 37 మంది ఉపాధ్యాయులకు సింగపూర్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని లోకేశ్ తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని వేసవి సెలవుల్లో సింగపూర్‌కు పంపించి, అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతుల్లో శిక్షణ ఇప్పించాలని సూచించారు. వారు తమ అనుభవాన్ని, నేర్చుకున్న ఆధునిక బోధనా పద్ధతులను ఇతర టీచర్లతో పంచుకోవాలన్నారు. ఈ శిక్షణ ఫలాలు రాష్ట్రంలోని ప్రతి ఉపాధ్యాయుడికీ చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యాశాఖలో సామర్థ్యాల పెంపు కార్యక్రమాలను మార్గదర్శకత్వం, దిశానిర్దేశం, పరిపాలన అనే మూడు ప్రధానఅంశాల ఆధారంగా అమలు చేయాలని పేర్కొన్నారు.
మంత్రులు, కార్యదర్శులకు కలిపి శిక్షణ
సింగపూర్ సహకారంతో అమలు చేస్తున్న కార్యక్రమంలో మంత్రులు, శాఖల కార్యదర్శులకు వేర్వేరుగా శిక్షణ ఇవ్వడం కంటే సంబంధిత మంత్రి, అదే శాఖ కార్యదర్శికి ఒకేసారి ఇవ్వడం ప్రయోజనకరంగా ఉంటుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల విధాన నిర్ణయాలు, వాటి అమలులో సమన్వయం పెరుగుతుందని తెలిపారు.
డిజిటల్ గవర్నెన్స్‌లో సింగపూర్ అనుభవాన్ని వినియోగించుకుంటాం
డిజిటల్ పరివర్తన, రియల్ టైమ్ గవర్నెన్స్, సమీకృత డిజిటల్ వేదికల రూపకల్పన, కమాండ్ కంట్రోల్ సెంటర్ల నిర్వహణ, డేటా ఆధారిత నిర్ణయాల విషయంలో సింగపూర్ సహకారాన్ని వినియోగించుకోవాలని మంత్రి లోకేశ్ కోరారు. ఈ రంగాల్లో సహకారం అందించేందుకు సింగపూర్ సిద్ధంగా ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో వరుస తుఫానుల కారణంగా కొన్ని కార్యక్రమాల అమలులో జాప్యం జరిగిందన్నారు. కాగా, గత సమావేశాల్లో తీసుకున్న కొన్ని నిర్ణయాల అమలులో జాప్యంపై ఈ భేటీలో చర్చించారు. ఇకపై కమిటీ ప్రతిపాదించిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిని ఆరు నెలలకోసారి సమీక్షించాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల అమలు పర్యవేక్షణకు నోడల్ అధికారిని నియమించినట్లు అధికారులు వివరించారు. ఏపీ ప్రతిపాదనలపై సింగపూర్ బృందం సానుకూలంగా స్పందించింది.
ఈ వార్తలనూ చదవండి:
ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు
15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు