పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి
ABN , Publish Date - Oct 29 , 2026 | 06:36 AM
రాష్ట్రంలో ఆర్నబ్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రాన్ని కోరారు. ఈమేరకు బుధవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఆయన లేఖ రాశారు.
పెట్టుబడి రాయితీ నిధులు విడుదల చేయాలి
కేంద్ర వ్యవసాయ మంత్రికి అచ్చెన్న లేఖ
అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆర్నబ్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రాన్ని కోరారు. ఈమేరకు బుధవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఆయన లేఖ రాశారు. తుఫాన్ కారణంగా రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 2,24,489 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక అంచనాగా లేఖలో పేర్కొన్నారు. దాదాపు 3.45లక్షల మంది రైతులపై తుఫాన్ ప్రభావం పడిందన్నారు. 154 మండలాల్లో 2,11,726 హెక్టార్లలో వ్యవసాయ పంటలు తుఫాన్‌కు ప్రభావితం కాగా, ఇందులో 2,09,460 హెక్టార్లలో వరి పంట ఉందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 82 శాతం, కోనసీమలో 75శాతం, కాకినాడలో 48శాతం వరి విస్తీర్ణం నీట మునిగినట్లు తెలిపారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా 12,763 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరగ్గా, 25,914 మంది రైతులపై ప్రభావం పడిందన్నారు. అరటి, కొబ్బరి, బొప్పాయి, పూలు, తమలపాకులు, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. వర్షాలు తగ్గి, వరద నీరు తొలగిన వెంటనే సమగ్ర నష్ట నివేదికను పంపుతామని పేర్కొన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ నిబంధనల ప్రకారం బాధిత రైతులకు పెట్టుబడి రాయితీ అందించేందుకు కేంద్రం ఆర్థిక సహాయం చేయాలన్నారు. తుది నివేదికకు ముందే రైతులను ఆదుకునేందుకు అత్యవసర సహాయక చర్యల కోసం ముందస్తు నిధులు విడుదల చేయాలన్నారు. రైతులను ఆదుకునేందుకు వ్యక్తిగతంగా చొరవ తీసుకోవాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.
కొబ్బరి చెట్టుకు రూ.1500
తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రతి కొబ్బరి చెట్టుకు రూ.1,500 చొప్పున ఇన్‌పుట్ సబ్సిడీకి అదనంగా ఇవ్వనున్నట్లు ఉద్యాన శాఖ డైరెక్టర్ కె.శ్రీనివాసులు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట