Share News

ఏపీ దూసుకెళ్లేలా..

ABN , Publish Date - Nov 16 , 2026 | 04:49 AM

రాష్ట్రం పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందేందుకు అన్ని ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

ఏపీ దూసుకెళ్లేలా..

  • పారిశ్రామిక మౌలిక వసతులకు పెద్దపీట

  • 25 ఇండస్ట్రియల్‌ పార్కులు.. రంగాలవారీ భూ కేటాయింపులు

  • కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు

  • 3,30,000 మంది యువతకు ఉద్యోగాలు

  • ఆయా సంస్థలకు 25 వేల ఎకరాల భూమి.. ఏపీఐఐసీ నివేదిక

(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రం పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందేందుకు అన్ని ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. పరిశ్రమల స్థాపనకు అత్యంత కీలకమైన భూ కేటాయింపుల్లో ఎలాంటి సమస్యలూ ఎదురుకాకుండా ఉండేందుకు రంగాల వారీగా.. ప్రాంతాల వారీగా ప్రత్యేక ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చేసే కార్యాచరణ ప్రణాళికలను ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 25 ఇండస్ట్రియల్‌ పార్కులను ఏర్పాటు చేసింది. సూక్ష్య మధ్య తరహా పరిశ్రమల నుంచి భారీ ఓడరేవులు, అంతరిక్ష రంగం, రక్షణ రంగ పరికరాల తయారీ పరిశ్రమల వరకు.. దరఖాస్తు నుంచి ఉత్పత్తి వరకూ వేగవంతంగా అనుమతులిచ్చే విధానాన్ని అమలు చేస్తోంది. ‘వేగాన్ని ఎంచుకోండి.. ఏపీని ఎన్నుకోండి’ అనే నినాదంతో ఏపీఐఐసీ ఆదివారం ఓ స్థాయీనివేదికను విడుదల చేసింది.

25 పారిశ్రామిక పార్కుల ద్వారా పరిశ్రమలకు అందిస్తున్న మౌలిక వసతులను వెల్లడించింది. 2024లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేటి వరకూ పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతిని వివరించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి దాకా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని.. వీటిద్వారా 3,30,000 మంది యువతకు ఉద్యోగావకాశాలు దక్కాయని తెలిపింది. పెట్టుబడులు పెట్టిన సంస్థలకు సుమారు 25,000 ఎకరాల భూ కేటాయింపులు చేసినట్లు పేర్కొంది.

పార్కులవారీగా భూకేటాయింపులు..

రాష్ట్రంలో నెలకొల్పిన 25 పారిశ్రామిక పార్కుల్లో రంగాల వారీగా భూకేటాయింపులు జరిగాయి. కెమికల్‌ పార్కులో 2050 ఎకరాలు, మెడ్‌టెక్‌ పార్కు-400 ఎకరాలు, డౌన్‌స్ట్రీమ్‌ స్టీల్‌ పార్కు-1000 ఎకరాలు, ఏఐ డేటా సెంటర్‌ పార్కు-1150 ఎకరాలు, బల్క్‌ డ్రగ్‌ పార్కు-2002 ఎకరాలు, ఆర్గానిక్‌ ఫుడ్‌ పార్కు-500 ఎకరాలు, టాయ్‌ పార్కు-581 ఎకరాలు, రేర్‌ ఎర్త్‌ అండ్‌ కెమికల్స్‌ పార్కు-1000 ఎకరాలు, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ మాన్యుఫాక్చరింగ్‌ పార్కు-1000 ఎకరాలు, క్వాంటం హార్డ్‌వేర్‌ మాన్యుఫాక్చరింగ్‌ పార్కు-252 ఎకరాలు, మెగా టెక్స్‌టైల్‌ పార్కు-500 ఎకరాలు, సోలార్‌ పీవీ మాన్యుఫ్యాక్చరింగ్‌ పార్కు-1037 ఎకరాలు, డ్రోన్‌సిటీ పార్కు-600 ఎకరాలు, రోబోటిక్స్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ పార్కు-300 ఎకరాలు, ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ పార్కు-500 ఎకరాలు, ఎలకా్ట్రనిక్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ (కడప)-801 ఎకరాలు, హార్టీకల్చర్‌ పార్కు-300 ఎకరాలు, మందుగుండు పార్కు- 2340 ఎకరాలు, పెట్రోకెమికల్‌ పార్కు-907 ఎకరాలు, ఫర్నిచర్‌ పార్కు-1000 ఎకరాలు, స్పోర్ట్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ పార్కు-200 ఎకరాలు, నిర్మాణరంగ పరికరాల తయారీ పార్కు-500 ఎకరాలు, సెమీ కండక్టర్‌ పార్కు-495 ఎకరాలు, కొరియన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు-357 ఎకరాలు, స్పేస్‌ సిటీకి 4918 ఎకరాలు కేటాయించింది.

ఉత్తరాంధ్రలో 8 పార్కులు, గోదావరి జిల్లాల్లో 3, రాయలసీమలో 5, దక్షిణ కోస్తా, తిరుపతిలో 9 పార్కులను ఏపీఐఐసీ ఏర్పాటు చేసింది. వీటికితోడు.. రాష్ట్ర విభజన చట్టం మేరకు చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో కృష్ణపట్నం ఇండస్ట్రియల్‌ సిటీ, కృష్ణపట్నం నోడ్‌, ఫర్నిచర్‌-స్పోర్ట్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ పార్కులు ఓడరేవుకు పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. హైదరాబాద్‌-బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఓర్వకల్లు నోడ్‌, కర్నూలు డ్రోన్‌ సిటీ, జాతీయ సాయిలో మొట్టమొదటి డ్రోన్స్‌ పార్కును అనుసంధానం చేస్తూ క్లస్టర్టు ఏర్పాటయ్యాయి.

ఈ వార్తలనూ చదవండి:

సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు

ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!

Updated Date - Nov 16 , 2026 | 04:52 AM