ఏజెన్సీ జడ్పీటీసీల్లో గిరిజన కోఆప్షన్ సభ్యులు!
ABN , Publish Date - Nov 14 , 2026 | 04:46 AM
షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని జిల్లా పరిషత్తుల్లో (జడ్పీ) కోఆప్షన్ సభ్యులుగా గిరిజన ప్రాంతాలకు చెందిన వారిని నియమించేలా నిబంధనలు రూపొందించాలని ...
ఎస్టీ కమిషన్ సిఫారసును ప్రభుత్వానికి పంపిన ఎస్‌ఈసీ
అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని జిల్లా పరిషత్తుల్లో (జడ్పీ) కోఆప్షన్ సభ్యులుగా గిరిజన ప్రాంతాలకు చెందిన వారిని నియమించేలా నిబంధనలు రూపొందించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సిఫారసు చేసింది. ఈ సిఫారసులను రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్‌ఈసీ) ప్రభుత్వానికి పంపింది. ఎస్టీ కమిషన్ చైర్‌పర్సన్ సొల్లా బొజ్జిరెడ్డి ఈ అంశంపై చేసిన విజ్ఞప్తి మేరకు ఎన్నికల కమిషన్ కార్యదర్శి మల్లికార్జున ప్రభుత్వానికి లేఖ రాశారు. రంపచోడవరానికి చెందిన న్యాయవాది ఎంవీఆర్ ప్రకాశ్ సమర్పించిన వినతిని ఎస్టీ కమిషన్ చైర్మన్.. ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం ఏపీ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 177(3)(5) ప్రకారం జిల్లా పరిషత్‌లలో ఇద్దరు మైనారిటీ సభ్యులను కోఆప్షన్ చేసే అవకాశముంది. అయితే, పూర్తిగా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉన్న జిల్లా పరిషత్‌లకు ప్రత్యేక నిబంధన లేదని ఎన్నికల కమిషన్ తన లేఖలో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని పరిషత్‌లలో రెండు కోఆప్షన్ సభ్యుల స్థానాలను గిరిజనులతోనే భర్తీ చేసేలా అవసరమైన చట్ట సవరణలు లేదా ప్రత్యేక నిబంధనలు తీసుకురావాలని కోరింది.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్