లక్షలు కొట్టు.. ‘పంచాయతీ’ పట్టు!
ABN , Publish Date - Nov 16 , 2026 | 01:21 AM
లక్షలు కొట్టు.. సర్పంచ్ పదవి పట్టు.. అన్నట్టు సాగుతోంది ఏకగ్రీవ పంచాయతీల వ్యవహారం. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వ ప్రత్యేక నిధులే కాకుండా..
సర్పంచ్ పదవుల ఏకగ్రీవానికి జోరుగా వేలం
గొట్టిపల్లి రూ.68 లక్షలు, సిర్లపాలెం రూ.35 లక్షలకు ఖరారు
అనంతలో టెండర్ పద్ధతిలో ఏకగ్రీవం
25 లక్షలు కోట్ చేసిన వ్యక్తికి సర్పంచ్ పదవి!
పెద్దిపాలెంలో ఓ వ్యక్తి రూ.కోటి ఆఫర్
రెండెకరాలు రాసిస్తానంటున్న శృంగవృక్షం అభ్యర్థి
ఓటుకు 5 వేలు.. ‘మన్యం’ నో
(ఆంధ్రజ్యోతి - న్యూస్ నెట్వర్క్): లక్షలు కొట్టు.. సర్పంచ్ పదవి పట్టు.. అన్నట్టు సాగుతోంది ఏకగ్రీవ పంచాయతీల వ్యవహారం. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వ ప్రత్యేక నిధులే కాకుండా.. సర్పంచ్ పదవులపై వ్యామోహం ఉన్న అర్ధబలమున్న కొందరు ఆశావహులు లక్షలు వెచ్చించి వేలం పాడుకుంటున్నారు! గ్రామాభివృద్ధికి సొంత నిధులు, లేదా ఎకరం రెండెకరాల భూమి సైతం ఇస్తామంటూ ఒప్పందం చేసుకుంటున్నారు. తాజాగా.. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గొట్టిపల్లి పంచాయతీ సర్పంచ్ పదవికి వేలం పాట నిర్వహించగా ఇల్లపు మహేశ్ అనే వ్యక్తి అత్యధికంగా రూ.68 లక్షలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. దీంతో ఇక్కడ సర్పంచ్ పదవి ఏకగ్రీవం కానున్నది.
ఇదే మండలం సిర్లపాలెం పంచాయతీ సర్పంచ్ పదవి మహిళకు రిజర్వు అయింది. దీంతో కోరాడ చిలకమ్మ అనే మహిళ తరఫున ఆమె కుటుంబ సభ్యులు ముందుకువచ్చి రూ.35 లక్షలు ఇవ్వడానికి సమ్మతించారు. కాగా, ఆనందపురం మండలంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పెద్దిపాలెం పంచాయతీ సర్పంచ్ పదవికి తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.కోటి ఇస్తానని ఓ వ్యక్తి ప్రకటించారు. అలాగే, శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండల కేంద్రంలోని టీడీపీ మద్దతుదారుడైన పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి.. శ్రీనివా్‌సరెడ్డి తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి సొంత డబ్బులు రూ.50 లక్షలు ఇస్తానని ప్రకటించారు.
కర్నూలు జిల్లా హాలహర్వి మండలం మెదేహాల్ గ్రామంలో రూ.6 లక్షలకు సర్పంచ్ పదవి ఏకగ్రీవం కానున్నట్లు ఆ గ్రామస్థులు తెలిపారు. కాగా, పార్వతీపురం మన్యం జిల్లా.. పార్వతీపురం మండలం సూడిగాం గ్రామ సర్పంచ్ పదవిని టీడీపీ మద్దతుదారు గురజాన శ్రీదేవి రూ.9 లక్షలకు దక్కించుకున్నారు. ఈ మండలంలో ఇప్పటికే పుట్టూరు, కవిటిభద్ర పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో అతి పెద్ద మేజర్ పంచాయతీ అయిన శృంగవృక్షం గ్రామంలో సర్పంఛగా తనను ఏకగ్రీవం చేస్తే రెండు ఎకరాల పొలం రాసిస్తానని గ్రామానికి చెందిన నూకల శ్రీను చెబుతున్నారు. దీనిపై కూటమి నాయకులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
రూ.40 లక్షలిస్తామన్నా.. అంగీకరించని గొట్టివలస
పార్వతీపురం మన్యం జిల్లా.. గరుగుబిల్లి మండలం గొట్టివలస పంచాయతీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి (టీడీపీ నుంచి బయటకు వచ్చిన సర్పంచ్ అభ్యర్థి) ఆదివారం గ్రామ ప్రజలతో సమావేశమయ్యారు. తనను ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకుంటే పంచాయతీకి రూ.40 లక్షలు ఇస్తామన్నారు. మరో వ్యక్తి ఓటుకు రూ.5వేలు చెల్లిస్తామన్నారు. అయితే దీనిపై గ్రామస్థుల నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. ఎన్నికలు జరగాల్సిందేనని ప్రజలు చెప్పడంతో అభ్యర్థులు ఖంగుతిన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు
ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!