Share News

గుడి కోసం ఏక(గ్రీవం)మయ్యారు!

ABN , Publish Date - Nov 14 , 2026 | 04:34 AM

కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో పంచాయతీ ఎన్నికల వేళ గ్రామస్థులంతా ఏకమయ్యారు.

గుడి కోసం ఏక(గ్రీవం)మయ్యారు!

  • రూ.32.5 లక్షలకు ఖరారైన సర్పంచ్‌ పదవి

దేవనకొండ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో పంచాయతీ ఎన్నికల వేళ గ్రామస్థులంతా ఏకమయ్యారు. ఊరిలో గుడి నిర్మాణం కోసం ఏకంగా గ్రామ సర్పంచ్‌ పదవిని వేలం పెట్టారు! వివరాలివీ.. దేవనకొండ మండలం పల్లెదొడ్డి గ్రామ పంచాయతీ పరిధిలో గద్దెరాళ్ల మజారా ఓ గ్రామంగా ఉంది. గద్దెరాళ్ల గ్రామంలో గతంలో నిర్మించిన మారెమ్మవ్వ ఆలయ కమిటీలో పల్లెదొడ్డి వాసులకు చోటు కల్పించలేదు. పైగా ఆ గ్రామ ప్రజలను గుడిలోకి కూడా రానీయలేదు.

దీన్ని జీర్ణించుకోలేకపోయిన పల్లెదొడ్డి గ్రామ ప్రజలు సొంతంగా ఓ గుడిని నిర్మించాలని భావించారు. 400 గడపలున్న గ్రామంలో ప్రతి ఇంటి నుంచి రూ.10 వేల చొప్పున ఆలయ నిర్మాణానికి విరాళం అందజేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారు. గ్రామంలో ఎవరైతే గుడి నిర్మాణానికి నిధులు కేటాయిస్తారో వారికే మద్దతు తెలపాలని, సర్పంచ్‌ అభ్యర్థికి మరొకరు పోటీగా ఎవరూ నామినేషన్‌ వేయకూడదని నిర్ణయించుకున్నారు.

అనుకున్నదే తడవుగా శుక్రవారం సర్పంచ్‌ పదవికి వేలం పాట నిర్వహించారు. గ్రామానికి చెందిన పాపినేని కాశీమన్న అనే వ్యక్తి రూ.32.50 లక్షలకు వేలం పాడి సర్పంచ్‌ పదవిని దక్కించుకున్నాడు.


రూ.కోటి నిధులు.. డంపింగ్‌ యార్డ్‌కు స్థలం!

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక గ్రామ సర్పంచ్‌ పదవిని ఏకగ్రీవంగా అప్పగిస్తే గ్రామాభివృద్ధి కోసం రూ.కోటి నిధులతోపాటు మూడు సంవత్సరాల్లో ఎకరం స్థలం కొని డంపింగ్‌ యార్డ్‌కు ఇస్తానని అదే గ్రామానికి చెందిన అడబాల సూరిప్రకాశ్‌ ముందుకు వచ్చారు.

సర్పంచ్‌ పదవి రూ.కోటి ధర పలకటం, డంపింగ్‌ యార్డ్‌కు ఎకరం భూమి ఇస్తాననడం ప్రసుత్తం చర్చనీయాంశంగా మారింది. ఇక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గొల్లవానితిప్పకు చెందిన ఒక అభ్యర్థి తనను సర్పంచ్‌గా ఏకగ్రీవం చేస్తే తన పంట భూమిలో 2 ఎకరాలు పంచాయతీకి రాసిస్తానని గ్రామస్థులకు తెలిపినట్లు సమాచారం.

ఈ వార్తలనూ చదవండి:

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

Updated Date - Nov 14 , 2026 | 04:38 AM