బాదుడు లేదు.. ఆదాయం పెరిగింది
ABN , Publish Date - Nov 26 , 2026 | 03:04 AM
కూటమి సర్కారు వచ్చాక ప్రజలపై బాదుడు లేకుండానే ప్రభుత్వ ఆదాయం పెరిగింది. ఆదాయార్జన శాఖలపై బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
పన్నుల పెంపు లేకుండానే 18.7 శాతం వృద్ధి
8 నెలల్లోనే ఖజానాకు 58 శాతం ఆదాయం
రెండున్నరేళ్లలో కూటమి సంస్కరణల ఫలితం
పాలనలో పారదర్శకత, ఆన్లైన్ సేవలు
ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కూటమి సర్కారు వచ్చాక ప్రజలపై బాదుడు లేకుండానే ప్రభుత్వ ఆదాయం పెరిగింది. ఆదాయార్జన శాఖలపై బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజలపై పన్నుల భారం మోపకుండా, కొత్తగా చార్జీలు పెంచకుండా ప్రభుత్వ శాఖల ఆదాయం మరింత పెంచేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. గడచిన రెండున్నరేళ్లుగా ప్రభుత్వ నిర్ణయాలు, సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు.
వివిధ శాఖల్లోని వ్యవస్థలు గాడిన పడ్డాయని అన్నారు. ఆదాయం లీకేజీలు తగ్గించడం, వ్యవస్థలోని లోపాలు సరిదిద్దడంలో పలు శాఖలు మెరుగైన ఫలితాలు సాధించాయని పేర్కొన్నారు. రెండున్నరేళ్ల కూటమి పాలనలో పారదర్శకత, ఆన్లైన్ సేవలు, శాఖాపరమైన సంస్కరణలతో ఆదాయం పెరుగుతోందన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు ఆదాయంలోనూ ప్రతిఫలించాలని చెప్పారు.
ప్రభుత్వ శాఖలన్నీ ప్రత్యేక ఏఐ స్టాక్ ద్వారా ఆదాయాలు మెరుగుపర్చుకోవాలని స్పష్టం చేశారు. సమన్వయంతో డేటాలేక్ సమాచారాన్ని విశ్లేషించి రెవెన్యూ లీకేజీలు లేకుండా చూడాలన్నారు. 2027 మార్చి నాటికి వ్యవస్థల్లో 100శాతం మెరుగుదల చూపాలని దిశానిర్దేశం చేశారు. మద్యం తయారీ నుంచి విక్రయం వరకు ట్రాకింగ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వాహనాల లోడ్, ఇ-వేబిల్స్ సహా వివిధ అంశాలపై రవాణా శాఖ ఎలక్ర్టానిక్ విధానంలో పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
రూ.11,738 కోట్లు పెరుగుదల
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబరు 23 నాటికి రాష్ట్ర సొంత ఆదాయం రూ.74,342 కోట్లకు చేరిందని అధికారులు వివరించారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో రూ.62,604 కోట్లుగా ఉన్న ఆదాయం ఈసారి రూ.11,738 కోట్లు పెరిగి 18.7 శాతం వృద్ధి సాధించిందని తెలిపారు. రూ.1,27,506 కోట్ల వార్షిక లక్ష్యంలో నవంబరు 23 నాటికి 58 శాతం సాధించినట్లు వెల్లడించారు. పన్నేతర ఆదాయంలో 31.3 శాతం వృద్ధి నమోదైందని వివరించారు. వాణిజ్య పన్నుల ఆదాయం 18.3 శాతం వృద్ధితో రూ.5,917 కోట్లు పెరిగి రూ.38,421 కోట్లకు చేరిందని తెలిపారు.
ఇందులో జీఎస్టీ ఆదాయం 18.1శాతం వృద్ధితో రూ.3,694 కోట్లు పెరిగి రూ.24,073 కోట్లకు చేరిందన్నారు. ఎక్సైజ్ ఆదాయం రూ.20,083 కోట్లకు చేరిందని, గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.3,287కోట్లు అదనంగా రావడంతో 19.6 శాతం వృద్ధి నమోదైందని వివరించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం 16.6 శాతం పెరిగి రూ.8020 కోట్లకు, వాహన పన్నుల ఆదాయం 17.3శాతం పెరిగి రూ.3,649కోట్లకు చేరిందని తెలిపారు. గనులు, భూగర్భ శాఖ ఆదాయం 13.2శాతం వృద్ధితో రూ.2,086 కోట్లకు, అటవీశాఖ ఆదాయం 22.3శాతం వృద్ధితో రూ.22కోట్లకు చేరిందన్నారు. పన్నేతర ఆదాయం రూ.1330 కోట్ల నుంచి రూ.2091 కోట్లకు పెరిగిందని అధికారులు వెల్లడించారు.
ఏఐతో పన్ను వసూళ్లు
ఏప్రిల్ 1 నుంచి నవంబరు 20 వరకు పంచాయతీలకు సుమారు .239కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు సుమారు రూ.2366 కోట్ల పన్ను ఆదాయం వచ్చిందని అధికారులు సమీక్షలో వివరించారు. ఆస్తిపన్ను వసూళ్లను మెరుగుపర్చేందుకు 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఏఐ ఆధారిత వ్యవస్థను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.
వాణిజ్య పన్నుల శాఖలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పన్ను రిటర్నుల పరిశీలన, ఆడిట్, తనిఖీలు, న్యాయ వ్యవహారాల్లో ఏఐని వినియోగిస్తున్నట్లు వివరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో గత ఏడాది రూ.1015 కోట్ల పన్నుల్ని డిజిటల్‌గానే వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్