Share News

రెవెన్యూ అంటే.. అంతే మరి!

ABN , Publish Date - Nov 26 , 2026 | 05:45 AM

లాంటి అధికారం లేకున్నా ప్రైవేటు భూ ముల వివాదాల్లో తలదూర్చి హక్కుదారులను ముప్పుతిప్పలు పెడతారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ...

రెవెన్యూ అంటే.. అంతే మరి!

  • ఐదున్నరేళ్ల తర్వాత నింపాదిగా కదలిక.. లోకాయుక్త ఆదేశాలున్న కేసులోనూ అలసత్వం

  • నాడు ప్రభుత్వ భూములు ప్రైవేటు పరం

  • ఏళ్ల తరబడి ఫైలు తొక్కిపెట్టిన ఓ అధికారి

  • ఇప్పుడు డిసిప్లినరీ అథారిటీ ఖరారు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఎలాంటి అధికారం లేకున్నా ప్రైవేటు భూ ముల వివాదాల్లో తలదూర్చి హక్కుదారులను ముప్పుతిప్పలు పెడతారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోర్టులు ఆదేశించినా స్పందించడానికి ఎక్కడా లేని అలసత్వం రెవెన్యూ శాఖను వెంటాడుతోంది. లోకాయుక్త ఆదేశాలున్న కేసులోనూ ఇదే పరిస్థితి. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులమీద వల్లమాలిన అభిమానమో లేక వారిని కాపాడాలన్న దురాలోచనో తెలియదుకాని వారిమీద చర్యలు తీసుకునే అధికారం ఎవరిదో ఐదున్నరేళ్లుగా తేల్చలేదు. కారణాలు తెలియదు కానీ ఇప్పుడు రెవెన్యూశాఖ నింపాదిగా ఫైలును తెరపైకి తీసుకొచ్చింది.

నాడు అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిదే అని తేల్చింది. వారిపై చర్యలు తీసుకునే అధికారం రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌కు కట్టబెడుతూ ఉత్తర్వులు (జీఓ 689) జారీ చేసింది. లోకాయుక్త ఆదేశాలున్న కేసులోనే రెవెన్యూ శాఖ నిర్ణయాల వేగం ఇలా ఉంటే, ఇక సాధారణ అంశాల్లో ఎలా ఉంటుందో..?


ఏం జరిగిందంటే...

ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో బి.కె.పల్లి గ్రామం ఉంది. ఇక్కడ నాటి రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు కుట్రపూరితంగా అక్రమార్కులతో కుమ్మక్కై విలువైన ప్రభుత్వ భూములను అసైన్డ్‌గా చూపారు. ఆ తర్వాత వాటిని ప్రైవేటు పేరిట రాసేశారు. విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటువిగా చూపించి రిజిస్ట్రేషన్‌ చేశారు. కాలక్రమంలో ఈ అక్రమాలు వెలుగులోకి వ చ్చాయి. దీనిపై లోకాయుక్తకు ఫిర్యాదులు రావడంతో విచారణ చేయించారు. బి.కె.పల్లిలో అక్రమ అసైన్‌మెంట్‌లు జరిగాయని, ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేశారని లోకాయుక్త తేల్చింది.

బాధ్యులైన నాటి మండల తహశీల్దార్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, వీఆర్‌ఓ, ముదనపల్లి మున్సిపల్‌ కమిషనర్‌పై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అన్యాక్రాంతమైన భూములను కాపాడాలని సూచించింది. ఇదే అంశంపై లోకాయుక్త ఆదేశాలను ఉటంకిస్తూ చర్యలు చేపట్టాలని రెవెన్యూ శాఖకు 2021 అక్టోబరు 10న ఆదేశాలు వచ్చాయి. ఈ ఉత్తర్వులపై సీసీఎల్‌ఏ కార్యాలయం స్పందించింది. అన్యాక్రాంతమైన భూములను కాపాడాలని, బాధ్యులపై చర్యలు చేపట్టాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.

మరోవైపు ఇదే అంశంపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని సీసీఎల్‌ఏ నుంచి రెవెన్యూ శాఖకు 2022 సెప్టెంబరులోనే నివేదిక వెళ్లింది. నిజానికి ఇదే విషయంపై 2022 సెప్టెంబరు 5నే కలెక్టర్‌ నుంచి రెవెన్యూ శాఖకు లేఖ వచ్చింది. ఆ తర్వాత చర్యలు తీసుకోవాల్సింది రెవెన్యూ శాఖనే. అధికారులపై అభియోగాలు నమోదు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ అధికారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికే ఉందని నిర్ధారించాలి. ఆ తర్వాత శాఖాపరంగా చర్యలు ప్రారంభం కావాలి. కానీ అదేదీ జరగలేదు.


తొక్కిపెట్టిన అధికారి

2022 సెప్టెంబరు నుంచే రెవెన్యూ శాఖలో సచివాలయం స్థాయిలో ఫైలును పక్కన పెట్టారు. రెవెన్యూలోనే సుదీర్ఘకాలంగా మకాం వేసిన ఓ మధ్యశ్రేణి అధికారి ఈ ఫైలును ఏళ్లతరబడి తొక్కిపెట్టేలా పెద్ద మంత్రాంగమే నడిపారు. ఇదే సమయంలో ఎన్నిలకు ముందు, 2024 మే 2న సీసీఎల్‌ఏ నుంచి మరోసారి రెవెన్యూ శాఖకు ఫైలు పంపించారు. అయినా ఆ ఫైలును పట్టిచూసింది లేదు.

సీసీఎల్‌ఏ తుది నివేదిక ఇచ్చిన రెండున్నరేళ్ల తర్వాత నింపాదిగా ఇప్పుడు రెవెన్యూ శాఖ ఆ ఫైలును బయటకు తీసింది. అభియోగాలు ఎదుర్కొంటున్న నాటి మదనపల్లె మున్సిపల్‌ కమిషనర్‌ జి.రవి, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి, వీఆర్‌ఓ ప్రదీప్ కుమార్‌పై శాఖాపరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికే ఉందని, కాబట్టి డిసిప్లినరీ అథారిటీ రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌ అని ప్రకటిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

అంటే.. అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు తీసుకునే అధికారం ఎవరికి ఉంది? ఎప్పుడు చర్యలు తీసుకోవాలి? అన్న రెండు అంశాలు తేల్చడానికి రెవెన్యూ శాఖ ఐదున్నర సంవత్సరాలపైనే సమయం తీసుకుంది. ఇంత నింపాదిగా వ్యవహరించడం రెవెన్యూశాఖకే చెల్లింది. అసలైన క్రమశిక్షణా చర్యలు చేపట్టడానికి ఇంకా ఎన్నేళ్ల సమయం తీసుకుంటారో అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.


రిటైర్డయ్యాక తహశీల్దార్‌పై చర్యలు

మదనపల్లె మండలం బి.కె.పల్లి గ్రామంలోని భూముల కేసులో ఆనాటి తహశీల్దార్‌ శివరామిరెడ్డిపై తీవ్ర అభియోగాలు వచ్చాయి. ఆయనపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ మేర కు లోకాయుక్త ఆదేశాలు ఉన్నాయి. కానీ ఆయన రిటైర్డ్‌ అయ్యేదాకా ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడు నింపాదిగా ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మరో ఉత్తర్వు (జీఓ 688) జారీ చేసింది. అంటే.. సర్వీసులో ఉండి అధికారి తప్పుచేస్తే వెంటనే చర్యలు తీసుకోలేదు. రిటైర్డ్‌ అయిన తర్వాత ఐదున్నరేళ్ల సమయం తీసుకోవడం గమనార్హం.

నిజానికి తహశీల్దార్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం ఇటు కలెక్టర్‌, అటు సీసీఎల్‌ఏకు, ప్రభుత్వ స్థాయిలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఉంది. మరి ఈ విషయంలో వెంటనే ఎందుకు స్పందించలేదు? తహశీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని ఇన్నేళ్ల తర్వాత ఆదేశాలు ఇవ్వడంలోని ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు, అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

Updated Date - Nov 26 , 2026 | 05:58 AM