Share News

ప్రజలపై ధరల భారం పడకూడదు

ABN , Publish Date - Nov 26 , 2026 | 03:12 AM

నిత్యావసరాల ధరల భారం సామాన్య ప్రజలపై ఏమాత్రం పడకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వారికి ఊరట కలగాలన్నారు.

ప్రజలపై ధరల భారం పడకూడదు

  • ప్రభుత్వం తీసుకొనే చర్యలతో ఊరట కలగాలి

  • ‘ధరణి’ బియ్యం.. 500 కేంద్రాలకు విస్తరణ

  • వచ్చేనెల నుంచి రేషన్‌లో కందిపప్పు, పామాయిల్‌ సరుకులు బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా చర్యలు

  • డిమాండ్‌ ఉన్న పంటల సాగుకు ప్రోత్సాహం: సీఎం

అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): నిత్యావసరాల ధరల భారం సామాన్య ప్రజలపై ఏమాత్రం పడకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వారికి ఊరట కలగాలన్నారు. వినియోగదారుడిని ఆదుకోవడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని చెప్పారు. నిత్యావసరాల ధరల నియంత్రణపై బుధవారం సచివాలయంలో ఆయన సమీక్షించారు. వచ్చే ఏడాదిన్నర పాటు మార్కెట్‌ ధరలు, ద్రవ్యోల్బణాన్ని నిరంతరం బేరీజు వేస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.

డిసెంబరు మొదటివారం నుంచి రేషన్‌ దుకాణాల ద్వారా కిలో కందిపప్పు రూ.100కు, లీటరు పామాయిల్‌ రూ.125కే పంపిణీ చేయాలని ఆదేశించారు. కందిపప్పు ధరను అదుపులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రం కేటాయించిన 40,300 టన్నుల కందులను సరపరా చేయడంతో పాటు కందిపప్పు ఉత్పత్తి, వినియోగం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేలా కంది సాగును ప్రోత్సహించాలని సీఎం సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ధరల నియంత్రణ చర్యలతో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని అధికారులు వివరించారు. గతనెలతో పోలిస్తే బియ్యం, ఉల్లి పామాయిల్‌ ధరలు తగ్గాయని తెలిపారు.


‘ధరణి’ బియ్యానికి ఆదరణ

ప్రభుత్వం ‘ధరణి’ బ్రాండ్‌ పేరుతో విక్రయిస్తున్న 26 కిలోల బస్తా సూపర్‌ ఫైన్‌ బియ్యానికి ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని అధికారులు చెప్పారు. మార్కెట్‌లో కిలో రూ.76 ఉన్న కేఎన్‌ఎం/ ఆర్‌ఎన్‌ఆర్‌ బియ్యాన్ని రూ.50 చొప్పున, రూ.66 ఉన్న బీపీటీ ముడి బియ్యాన్ని రూ.49 చొప్పున అందిస్తున్నామని, ఇప్పటివరకు 2.25 లక్షల మందికి పైగా వినియోగదారులు 59,662 క్వింటాళ్ల బియ్యాన్ని కొనుగోలు చేశారని వివరించారు. ప్రస్తుతం 286 కేంద్రాల్లో ‘ధరణి’ బియ్యం విక్రయిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

ఈ విక్రయాలను 500 కేంద్రాలకు విస్తరించాలని సీఎం ఆదేశించారు. బియ్యం సహా వివిధ నిత్యావసరాలు బ్లాక్‌ మార్కెట్‌కు తరలించకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అధిక ధరలకు విక్రయాలపై విజిలెన్స్‌, లీగల్‌ మెట్రాలజీ బృందాలు 1,558 తనిఖీలు నిర్వహించి, 1,005 కేసులు నమోదు చేయడంతో పాటు రూ.84.59 లక్షల జరిమానా వసూలు చేసినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. టోల్‌గేట్లు, సరిహద్దు చెక్‌ పోస్టుల వద్ద నిఘా పెంచాలని ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంతో వివిధ పంటల దిగుబడులపై పడే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేయాలని సీఎం సూచించారు.


ఉల్లి, టమాటా ధరలు రానున్న రోజుల్లో మరింత తగ్గుతాయని అగ్రివాచ్‌ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. కూరగాయల ధరలు పెరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. కృష్ణా డెల్టా వంటి ప్రాంతాల్లోనూ తక్కువ నీటితో పండే సన్నరకం వరి సాగును ప్రోత్సహించాలని సూచించారు. భూగర్భ జలాలు లేని ప్రాంతాల్లో ఆయిల్‌ పామ్‌ వేస్తే భవిష్యత్తులో రైతులు నష్టపోతారని సీఎం హెచ్చరించారు. నీటి వనరులు పుష్కలంగా ఉన్నచోటే ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించాలని, నీటి లభ్యత తక్కువగా ఉండే చోట ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా చూడాలని ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. అగ్రివాచ్‌ డేటా, వర్షపాతం ఆధారంగా పంటల ప్రణాళిక రూపొందించాలని చంద్రబాబు సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

Updated Date - Nov 26 , 2026 | 03:17 AM