Share News

నెలాఖరుకు అల్పపీడనం

ABN , Publish Date - Nov 26 , 2026 | 04:40 AM

దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఈ నెల 28 లేదా 29వ తేదీకల్లా ఉపరితల ఆవర్తనం ఆవరించనున్నది.

నెలాఖరుకు అల్పపీడనం

  • డిసెంబరు 1 వరకు వర్షాలు

విశాఖపట్నం, అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఈ నెల 28 లేదా 29వ తేదీకల్లా ఉపరితల ఆవర్తనం ఆవరించనున్నది. దీని ప్రభావంతో 30వ తేదీన అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు వెల్లడించారు. ఇది బలపడే క్రమంలో పశ్చిమంగా పయనించి డిసెంబరు రెండు లేదా మూడో తేదీకల్లా వాయుగుండం/తుఫానుగా బలపడి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించిన అనంతరం శ్రీలంక, దక్షిణ తమిళనాడు వైపు రానున్నదని ఐరోపా వాతావరణ సంస్థ అంచనా వేసింది. కాగా గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ నుంచి తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతం వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో సముద్రం నుంచి కోస్తా, రాయలసీమలపైకి తూర్పుగాలులు వీస్తుండడంతో బుధవారం పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా వర్షాలు, రెండు మూడుచోట్ల భారీ వర్షాలు కురిశాయి.

బుధవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మార్కాపురం జిల్లా పామూరులో 74.87, నెల్లూరు జిల్లా అల్లంపాడులో 55.5, గూడూరులో 51.25, తిరుపతి జిల్లా నాయుడుపేటలో 43.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తా, సీమల్లో వచ్చే నెల ఒకటో తేదీ వరకు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం రాయలసీమలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

Updated Date - Nov 26 , 2026 | 04:44 AM