ప్రైవేటు టీచర్ల సంక్షేమానికి పాలసీ
ABN , Publish Date - Nov 24 , 2026 | 03:16 AM
గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సంక్షేమానికి పాలసీ రూపొందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
నెలాఖరులోగా ప్రభుత్వానికి ముసాయుదా
అమరావతి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సంక్షేమానికి పాలసీ రూపొందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. పాలసీ రూపకల్పనకు రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల వారీగా కమిటీల నియామకానికి ఉత్తర్వులు జారీచేసింది. ఆర్జేడీ చైర్‌పర్సన్‌గా ఉండే కమిటీకి డీఈవోలు, డీవైఈవోలు, ఎంఈవోలు, ప్రత్యేక ఆహ్వానితులు ఉంటారు. ఈ కమిటీలు జోనల్ స్థాయిలో సమావేశాలు నిర్వహించి, క్షేత్రస్థాయి డేటాను పరిశీలిస్తాయి. ప్రైవేటు టీచర్లకు జీతాలు, కనీసం వేతనం అమలు, అపాయింట్‌మెంట్ లెటర్లు, ఈపీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, పదవీ విరమణ ప్రయోజనాలు, హెల్త్ ఇన్సూరెన్స్, టీచర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు అంశాలను పరిశీలిస్తాయి. ఈనెలాఖరులోగా ప్రాంతాల వారీగా ముసాయుదా పాలసీలను ప్రభుత్వానికి సమర్పిస్తాయి. అనంతరం ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమానికి చర్యలు చేపడుతుంది.
ఈ వార్తలనూ చదవండి: