వాటర్ రెగ్యులేటరీ కమిషన్!
ABN , Publish Date - Nov 12 , 2026 | 05:14 AM
రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) తరహాలోనే వాటర్ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీడబ్ల్యూఆర్‌సీ) ఏర్పాటుపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
విద్యుత్ తరహాలో ఏర్పాటుపై అధ్యయనానికి సీఎం ఆదేశం
రూ.632 కోట్లతో 789 ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు
ఖరీఫ్ నాటికి అన్నిటినీ వినియోగంలోకి తేవాలి
జలహారతి కార్పొరేషన్ ద్వారా వీటి పర్యవేక్షణ
4,171 ఎకరాల్లో సోలార్ ప్లాంట్లు
వీటిద్వారా 903 మెగావాట్ల విద్యుదుత్పత్తి
36 ప్రాధాన్య ప్రాజెక్టులు రెండున్నరేళ్లలో పూర్తవ్వాలి
వీటికి నిధుల కొరత రానివ్వను.. సమీక్షలో చంద్రబాబు
అమరావతి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) తరహాలోనే వాటర్ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీడబ్ల్యూఆర్‌సీ) ఏర్పాటుపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలన్నిటికీ సౌర విద్యుత్ సరఫరా చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. వచ్చే ఖరీఫ్ నాటికి రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఐడీసీ) పరిధిలోని ఎత్తిపోతల పథకాలన్నీ పనిచేయాల్సిందేనని.. వీటిని జలహారతి కార్పొరేషన్ పర్యవేక్షించాలని తెలిపారు. బుధవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జల వనరుల శాఖ ప్రాజెక్టులపై సీఎం సమీక్షించారు.
మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక సీఎస్ శశిభూషణ్‌కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి తదితరులు హాజరయ్యారు. రూ.632 కోట్లతో 789 ఎత్తిపోతల పథకాల మరమ్మతులు చేపట్టేందుకు సీఎం ఈ సందర్భంగా ఆమోదం తెలిపారు. ఏపీఎస్ఐడీసీ, జల వనరుల శాఖకు చెందిన 4,171 ఎకరాల్లో సోలార్ ప్లాంట్లు. ఏర్పాటు చేసి 903 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆర్థిక, జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు.
ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న 36 ప్రాధాన్య ప్రాజెక్టులకు నిధుల కొరత రానివ్వనని చెప్పారు. వీటిని రెండున్నరేళ్లలో పూర్తి చేయాలన్నారు. పోర్టులు, విద్యుత్ రంగాల్లో మాదిరిగానే సాగునీటి రంగంలోనూ నియంత్రణ వ్యవస్థ తీసుకురావాలన్నారు. గంగా-కావేరి అనుసంధానం వంటి భారీ ప్రాజెక్టుల ద్వారా రవాణా, విద్యుత్, పరిశ్రమలు, వ్యవసాయ రంగాలకు నీటి వనరులను అందుబాటులోకి తీసుకురావచ్చని, ఆయా రంగాలకు నీటి వినియోగంపై రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని అన్నారు.
వాటిని పునరుద్ధరించాలి..
గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా రాష్ట్రంలో నిర్వీర్యమైన ఎత్తిపోతల పథకాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి.. వచ్చే జూన్ నాటికి వాటి ద్వారా నీరు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఖరీఫ్ కల్లా పునరుద్ధరణ పరిధిలో ఉన్న 789 ఎత్తిపోతల పథకాల మరమ్మతులన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో వాటి స్థితిగతులను పరిశీలించి.. వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలన్నారు.
7.49 లక్షల ఎకరాలకు సాగునీరు..
789 ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు రూ.632.07 కోట్లు అవసరమని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వీటి పునరుద్ధరణ ద్వారా 7.49 లక్షల ఎకరాలకు సాగునీరివ్వవచ్చని తెలిపారు. ఇందుకు ఆమోదం తెలిపిన సీఎం.. ఈ పథకాల నిర్వహణకు పటిష్ఠ వ్యవస్థను ఏర్పాటు చేయాలని.. పర్యవేక్షణ బాధ్యతను జలహారతి కార్పొరేషన్ చేపట్టాలని ఆదేశించారు. ఇందుకోసం కార్పొరేషన్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే ప్రతి జిల్లాకు చీఫ్ ఇంజనీర్ లేదంటే ఎస్‌ఈని నియమించాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసిన వెంటనే మరమ్మతుల కోసం టెండర్లు పిలవాలని, ఆలస్యం చేయకుండా పనులు ప్రారంభించాలని చెప్పారు. వచ్చే జూన్‌కి అన్ని ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ పనులు పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
4061 ఎకరాల్లో సోలార్ ప్లాంట్లు..!
జలవనరుల శాఖ పరిధిలో అందుబాటులో ఉన్న 5565 ఎకరాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు 4,061 ఎకరాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీటి ద్వారా 877.3 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చన్నారు. ఏపీఎస్ఐడీసీ పరిధిలోని మరో 110 ఎకరాలను కూడా సోలార్ ప్లాంట్లకు వినియోగించుకోవచ్చని, వీటిద్వారా 25.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశముందని తెలిపారు. మొత్తంగా 903.1 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని వివరించారు. కాలువలపై కూడా సౌర విద్యుత్, జలవిద్యుత్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేయడం ద్వారా ఆదాయం పొందడాన్ని పరిశీలించాలని చెప్పారు. రవాణా, విద్యుదుత్పత్తి, సౌర విద్యుత్, వ్యవసాయ రంగాలను అనుసంధానిస్తే సంపద సృష్టికి వీలుంటుందన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు
15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు