గ్లోబల్ ఫ్రూట్ బౌల్‌గా హార్టికల్చర్ హబ్!
ABN , Publish Date - Sep 25 , 2026 | 05:32 AM
రాయలసీమలోని ఉద్యాన పంటల హబ్‌ను గ్లోబల్ ఫ్రూట్ బౌల్‌గా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేసి, హార్టీకల్చర్ హబ్‌కు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.
సీమలో లక్ష కోట్ల పెట్టుబడితో 201 క్లస్టర్లలో అమలు
గాంధీ జయంతినాడు శ్రీకారం
అదే రోజు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన: సీఎం
అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): రాయలసీమలోని ఉద్యాన పంటల హబ్‌ను గ్లోబల్ ఫ్రూట్ బౌల్‌గా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేసి, హార్టీకల్చర్ హబ్‌కు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో కలిపి రాయలసీమలోని 10 జిల్లాల్లో 201 క్లస్టర్లతో రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఈ అంశంపై గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. మొత్తం 10 జిల్లాల్లోని 201 క్లస్టర్లలో ఉద్యాన పంటలు, రైతు ఉత్పత్తిదారు సంఘాలు, ఆహారశుద్ధి పరిశ్రమలు, మార్కెటింగ్ వ్యవస్థలను అనుసంధానం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. క్లస్టర్, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రైతు ఉత్పత్తిదారు సంస్థలను బలోపేతం చేయాలని సూచించారు. డ్వాక్రా సంఘాల తరహాలో రైతులు పరస్పరం సహకరించుకుంటూ ఎఫ్‌పీవోలుగా ఏర్పడి, తమ ఉత్పత్తులను సమష్టిగా మార్కెట్ చేసుకునే విధానాన్ని ప్రోత్సహించాలన్నారు. ఉద్యాన పంటల సాగులో కొత్త రకాల పంటల ఎంపిక, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు, మార్కెటింగ్ అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అంతర్జాతీయ డిమాండ్ ఉన్న పంటలపై దృష్టి సారించి ఫలితాలు సాధించేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. హార్టీకల్చర్ హబ్ ద్వారా వచ్చే ఐదారేళ్లలో సీమను తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రతి క్లస్టర్‌లో రైతులను ఛాంపియన్ ఫార్మర్లుగా తీర్చిదిద్దేలా కార్యాచరణ ఉండాలన్నారు.
ఈ వార్తలనూ చదవండి...