బోధనాస్పత్రుల్లో రోబోటిక్ శస్త్రచికిత్సలు
ABN , Publish Date - Nov 20 , 2026 | 01:35 AM
ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్...
ఐవీఎఫ్, బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ కేంద్రాల ఏర్పాటు
రూ.1,011 కోట్లతో ప్రతిపాదనలు: ఆరోగ్యశాఖ
అమరావతి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యంగా కొత్తగా రోబోటిక్ శస్త్రచికిత్స కేంద్రాలు, ఐవీఎఫ్ సెంటర్లు, బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ కేంద్రాలు, ఇతర ఆధునిక వైద్యసేవల విస్తరణకు రూ.1,011 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో బోధనాస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సదుపాయాల కల్పన, నిర్మాణాల పురోగతి, ఇతర అంశాలపై ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోధనాస్పత్రుల్లో రోబోటిక్ శస్త్ర చికిత్సలను దశలవారీగా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టు తెలిపారు. తొలిదశలో విజయవాడ ప్రభుత్వ బోధనాస్పత్రిలో రూ.45 కోట్లతో రోబోటిక్ శస్త్రచికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత విశాఖ కేజీహెచ్, కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లోనూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వాస్పత్రుల్లో తొలిసారిగా ఐదు సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
గుంటూరు, అనంతపురం, విజయనగరం, కాకినాడ, తిరుపతి బోధనాస్పత్రుల్లో వీటిని నెలకొల్పేందుకు రూ.17.50 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశామని తెలిపారు. కాగా, ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో రూ.1,011 కోట్లతో అత్యాధునిక వైద్య సేవలు, ప్రత్యేక చికిత్స కేంద్రాలు, వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ మంత్రికి వివరించారు.
4.52 లక్షల మంది బాలికలకు హెచ్‌పీవీ టీకాలు
రాష్ట్రంలో 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకాల పంపిణీ 87.82 శాతం పూర్తయిందని ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను అరికట్టే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 5.14 లక్షల మంది బాలికలకు ఈ వ్యాక్సిన్లు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. గురువారం సాయంత్రం వరకూ రూ.4.52 లక్షల మందికి టీకాలు పూర్తయినట్లు వెల్లడించింది.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్‌డీఎంఏ
బాలకృష్ణకు విశిష్ట పురస్కారం.. రేవంత్ సర్కార్ నుంచి అరుదైన గౌరవం