ఓటెత్తిన పల్లె!
ABN , Publish Date - Nov 27 , 2026 | 03:25 AM
రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు, 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి.
77.65 శాతం ఓటింగ్ నమోదు
పట్టణ ఓటర్లలో తగ్గిన ఆసక్తి
తొలి విడత 3240 పంచాయతీలకు పోలింగ్
అత్యధికంగా చిత్తూరులో 83.37 శాతం
అత్యల్పంగా అల్లూరిలో 58.85 శాతం
23 పట్టణ సంస్థల్లో 62.50 శాతమే
వీటికి 30న ఓట్ల లెక్కింపు, ఫలితాలు
అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు, 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. 26 జిల్లాల్లో 42 రెవెన్యూ డివిజన్లు, 201 మండలాల పరిధిలోని 3949 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 39,832 వార్డులకు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. 760 మంది సర్పంచ్‌లు, 14,731 వార్డులకు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. మిగతా 3189 సర్పంచ్ స్థానాలకు, 25,057 వార్డులకు ఇప్పుడు ఎన్నికలు జరుగగా.. 77.65 శాతం పోలింగ్ నమోదైంది. చిత్తూరు జిల్లాలో 83.37 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. విజయనగరం-83.33, నంద్యాల-82.68, శ్రీసత్యసాయి-82.05, మార్కాపురం-81.70, అనకాపల్లి జిల్లా 81.59 శాతం పోలింగ్‌తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 58.85శాతం ఓటింగ్ జరిగింది. అవాంఛనీయ ఘటనల కారణంగా మూడు చోట్ల రీపోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశించింది. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం నరసంపల్లి గ్రామ పంచాయతీలో వైసీపీ మద్దతుతో పోటీచేస్తున్న సర్పంచ్ అభ్యర్థి 7వ వార్డు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి బ్యాలెట్ బాక్సులో ఇంకు పోశారు. దీంతో ఎన్నికల అధికారులు పోలింగ్ నిలిపివేశారు. ఈ వార్డుకు, ఇక్కడి సర్పంచ్ స్థానానికి శుక్రవారం రీపోలింగ్ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు.
పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరులో ఒకటో వార్డు పోలింగ్ బాక్సును కొందరు ధ్వంసం చేశారు. ఈ వార్డులో వార్డుతోపాటు సర్పంచ్ స్థానానికి మళ్లీ ఎన్నిక జరగనుంది. ఇదే మండలం గరికపాడు పంచాయతీలో 10 వార్డుల సభ్యుల ఫలితాలు ప్రకటించాక.. సర్పంచ్ స్థానం బ్యాలెట్ పత్రాలను చించివేసి బలవంతంగా తీసుకెళ్లారు. ఇక్కడ సర్పంచ్ స్థానానికి మాత్రమే రీపోలింగ్ జరుగనుంది. తొలి విడతలో విశాఖ, గుంటూరు జిల్లాల్లో ఎన్నికలు జరుగలేదు.
ఇక కోర్టు వివాదాల నేపథ్యంలో ఎన్నికలు జరగని నాలుగు కార్పొరేషన్లు.. శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి.. 19 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు కూడా గురువారం పోలింగ్ జరిగింది. మేయర్లు/చైర్‌పర్సన్ పదవులకు 170 మంది అభ్యర్థులు బరిలో నిలువగా.. 964 వార్డులకు బరిలో 2968 మంది పోటీచేశారు. వీటిలో 62.50 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. కార్పొరేషన్లకు సంబంధించి మంగళగిరి-తాడేపల్లిలో అత్యధికంగా 74.65 శాతం ఓటింగ్ నమోదైంది. శ్రీకాకుళంలో అతితక్కువగా 54.70 శాతమే నమోదైంది. 15 మున్సిపాలిటీల్లో కందుకూరులో అత్యధికంగా 76.07 శాతం.. తణుకులో అతి తక్కువగా 54.03 శాతం.. ఓట్లు పోలయ్యాయి. 23 పట్టణ సంస్థల్లో 30వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
ఈ వార్తలనూ చదవండి:
2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు
బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా