పులివెందులలో నామినేషన్ల రచ్చ
ABN , Publish Date - Nov 19 , 2026 | 04:54 AM
ఎన్నికలు ఏవైనా వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఘర్షణలు సర్వసాధారణం అయిపోయాయి. తాజాగా కడప జిల్లా పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లోని గ్రామ...
గ్రామ పంచాయతీ పోరులో తొలిరోజే పలు మండలాల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ
పరస్పరం రాళ్లదాడులు, వాహనాల ధ్వంసం
ఇడుపులపాయలో తనను అడ్డుకున్న వారి కళ్లలో కారం కొట్టి నామినేషన్ వేసిన మహిళ
దర్శిలో పోలీసు భద్రతతో నామినేషన్లు
పుంగనూరు కూటమిలో బాహాబాహీ
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): ఎన్నికలు ఏవైనా వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఘర్షణలు సర్వసాధారణం అయిపోయాయి. తాజాగా కడప జిల్లా పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లోని గ్రామ పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో బుధవారం ఆయా మండలాల్లో క్లస్టర్ల వారీగా నామినేషన్ల స్వీకరణకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే.. కొన్నిచోట్ల వైసీపీ, టీడీపీ మద్దతుదారులు.. పరస్పరం దాడులకు దిగారు. చక్రాయపేట మండలం సురభి గ్రామం నాగులగుట్టపల్లెలో దాదాపు గంట పాటు ఇరు వర్గాల మధ్య రాళ్లు, కర్రలతో దాడులు సాగాయి. ఈ దాడుల్లో వైసీపీకి చెందిన నలుగురికి గాయాలయ్యాయి.
మాజీ ఎంపీపీ బాలకృష్ణ ఇటుకల ఫ్యాక్టరీని ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న 30 బైకులను కొందరు ధ్వంసం చేశారు. మండల కేంద్రమైన చక్రాయపేటలో జరిగిన రాళ్లదాడుల్లో టీడీపీకి చెందిన ఇద్దరికి గాయాలయ్యాయి. వేంపల్లె మండలంలోని రామిరెడ్డిపల్లెలో ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీచార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. అలవలపాడులో వైసీపీ మద్దతుదారుడు నామినేషన్ వేసేందుకు వస్తున్న క్రమంలో తోపులాట జరిగి ఓ మహిళ కాలు విరిగింది.
ఇడుపులపాయలో నామినేషన్ వేసేందుకు ఓ మహిళ వెళ్లగా అక్కడున్న మరో వర్గం ఆమెను అడ్డుకుంది. దీంతో ఆమె తన వెంట తెచ్చుకున్న కారంపొడిని వారి కళ్లలో కొట్టి నామినేషన్ దాఖలు చేశారు. నారేపల్లెలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య రాళ్లదాడులు జరగడంతో ఇరువర్గాలకు చెందిన దాదాపు పది మందికి గాయాలయ్యాయి. ఇదిలావుంటే, లింగాల, పులివెందుల మండలాల్లో నామినేషన్ల పర్వం ప్రశాంతంగా కొనసాగింది.
దర్శిలో వైసీపీ వర్గీయుల హల్చల్
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని పలు గ్రామ పంచాయతీల్లో నామినేషన్లు సందర్భంగా స్వల్ప ఘర్షణలు జరిగాయి. వైసీపీ మద్దతుదారులు ఉద్దేశపూర్వకంగా కొన్నిచోట్ల గొడవలు సృష్టించే ప్రయత్నం చేశారు. నామినేషన్లు వేయనీయటం లేదని హడావుడి చేశారు. దీంతో పోలీసులు స్వయంగా అభ్యర్థులను తీసుకువెళ్లి నామినేషన్లు వేయించారు. దర్శి మండలం తూర్పుచౌటపాలెంలో నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ వర్గీయులు వందలాది మంది నామినేషన్లు వేసేందుకు వచ్చారు.
దీంతో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. తమ నామినేషన్లు వేయనీయటం లేదని వైసీపీ మద్దతుదారులు ఆందోళనకు దిగడంతో ఎస్‌ఐ ఏడుకొండలు దగ్గరుండి వారితో నామినేషన్లు వేయించారు. రామచంద్రాపురం పంచాయతీ పరిధిలోనూ వైసీపీ వర్గీయులను పోలీసులు వెంటబెట్టుకుని వెళ్లి నామినేషన్లు వేయించారు.
పుంగనూరులో..
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం అడవినాథునికుంట నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ, జనసేన వర్గీయుల ఘర్షణలో పలువురు గాయపడగా ఓ ద్విచక్ర వాహనం ధ్వంసమైంది. చదళ్లలో వైసీపీ మద్దతుదారైన సర్పంచ్ అభ్యర్థి కారును కొందరు ధ్వంసం చేశారు.
రాగానిపల్లె పంచాయతీ పరిధిలోని భీమగానిపల్లె సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయడానికి జనసేన మద్దతుదారులు సునీల్‌కుమార్, బొట్టు శ్రీనివాసులు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లగా అక్కడున్న టీడీపీ మద్దతుదారైన సర్పంచ్ అభ్యర్థి కమతంపల్లె గంగరాజు నామినేషన్లు లాక్కుని చింపేశారు. ఈ వ్యవహారం ఘర్షణకు దారితీసింది. ఇరు పార్టీలకు చెందిన ఐదుగురు కార్యకర్తలు గాయపడ్డారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్
పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్