Share News

అదే జోరు

ABN , Publish Date - Nov 29 , 2026 | 01:58 AM

రెండోవిడత పంచాయతీ పోరులోనూ భారీగానే ఏకగ్రీవాల జోరు కొనసాగింది. గ్రామాభివృద్ధి గురించి బాధ్యతగా ఆలోచించిన గ్రామాలు ఏకగ్రీవాలకు మొగ్గుచూపాయి.

అదే జోరు

  • రెండో విడతలోనూ భారీగా ఏకగ్రీవాలు

  • అత్యధికంగా 1020 పంచాయతీలు టీడీపీ ఖాతాలో..

  • జనసేనకు 67, వైసీపీకి 51, బీజేపీకి 3 స్థానాలు

  • కడప జిల్లాలోనూ జగన్‌కు ఝలక్‌

  • 202 పంచాయతీల్లో కూటమికి 103

  • రికార్డు సృష్టించిన తిరుపతి

  • అభివృద్ధికి జై కొట్టిన 135 గ్రామాలు

  • అల్లూరి జిల్లాలో ఏకగ్రీవాలు నిల్‌

అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రెండోవిడత పంచాయతీ పోరులోనూ భారీగానే ఏకగ్రీవాల జోరు కొనసాగింది. గ్రామాభివృద్ధి గురించి బాధ్యతగా ఆలోచించిన గ్రామాలు ఏకగ్రీవాలకు మొగ్గుచూపాయి. వైసీపీ అధినేత జగన్‌ సొంత జిల్లా ఈ వరుసలో వడి వడిగా అడుగులు వేయడం విశేషం. అత్యధిక ఏకగ్రీవాలు తిరుపతి జిల్లాలో కాగా, ఆ తర్వాత స్థానంలో కడప జిల్లా నిలిచింది. ఆ జిల్లాలోని 202 పంచాయతీల్లో 113 చోట్ల ఏకగ్రీవం చేసుకున్నారు. దీంతో..ఆదివారం 89 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏకగ్రీవమైన స్థానాల్లో టీడీపీ మద్దతు ఉన్న అభ్యర్థుల ఖాతాలోకి అత్యధికంగా 102 పంచాయతీలు చేరాయి. ఇక..వైసీపీ 9, బీజేపీ 1, ఇతరులకు ఒక స్థానం లభించింది. రెండో విడతలో తక్కిన జిల్లాల్లోనూ దాదాపు ఇదే ట్రెండ్‌ కనిపించింది.

‘తిరుపతి’ రికార్డు..:

తిరుపతి జిల్లాలో మొత్తం 373 పంచాయతీలకు గాను 135 ఏకగ్రీవమయ్యాయి. ఇక.. పల్నాడులో 98, నెల్లూరులో 93, ప్రకాశం జిల్లాలో 75, నంద్యాలలో 72 పంచాయతీలు అదే బాటలో నడిచాయి. విజయనగరం జిల్లాలో 62, అనంతపురంలో 51, శ్రీకాకుళంలో 46, మార్కాపురంలో 33, అనకాపల్లిలో 33, పార్వతీపురం మన్యంలో 32, పశ్చిమగోదావరి జిల్లాలో 29 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.


టీడీపీదే ఆధిపత్యం:

ఏకగ్రీవమైన స్థానాల్లో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 1161 ఏకగ్రీవ స్థానాల్లో టీడీపీ మద్దతు ఉన్న అభ్యర్థులు 1,020 పంచాయతీలను సొంతం చేసుకున్నారు. జిల్లాల వారీగా చూస్తే.. పల్నాడు జిల్లాలో అత్యధికంగా 98 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, వాటిలో టీడీపీకి 80 స్థానాలు దక్కాయి. వైసీపీ 11, జనసేన 7 స్థానాలను పొందాయి. తిరుపతి జిల్లాలో 135 ఏకగ్రీవ స్థానాలకు గాను టీడీపీ 126, జనసేన 2, బీజేపీ 1, వైసీపీ 6 స్థానాలను దక్కించుకున్నాయి.

వైసీపీ లెక్క..:

వైసీపీకి కొన్ని జిల్లాల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఏకగ్రీవ స్థానాలు దక్కాయి. పల్నాడు జిల్లాలో 11, కడపలో9, ఏలూరులో 7, తిరుపతిలో 6, చిత్తూరు 10 స్థానాల్లో వైసీపీ మద్దతు ఉన్న అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.

జనసేన ఖాతాలోకి..:

జనసేనకు మన్యం జిల్లాలో 13, అనకాపల్లిలో 12, పశ్చిమగోదావరిలో 8, పల్నాడులో 7 స్థానాలు దక్కాయి. రెండో విడత ఏకగ్రీవాల్లో బీజేపీ 3, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 20 స్థానాలు దక్కించుకున్నారు.

ఆ జిల్లాల దారి వేరే..:

అల్లూరి జిల్లాలో 87 పంచాయతీలు ఉండగా, ఒక్కటి కూడా ఏకగ్రీవం కాలేదు. పోలవరం జిల్లాలో ఒక పంచాయతీ సీపీఎంకు ఏకగ్రీవం అయింది. మొత్తంగా చూస్తే ఏకగ్రీవాల పరంగా కూటమి పార్టీలకు ఆధిక్యం లభించింది.

ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం

Updated Date - Nov 29 , 2026 | 02:14 AM