ఏకగ్రీవం చేస్తే ఎకరం పొలం
ABN , Publish Date - Nov 12 , 2026 | 04:39 AM
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామ పంచాయతీ ఎన్నిక రసవత్తరంగా మారింది. పోటీకి పలువురు కాలు దువ్వుతుండటంతో ఎన్నిక ఏకగ్రీవం చేయాలని గ్రామపెద్దలు ముందుకొచ్చారు
గ్రామ పెద్దలకు ఓ అభ్యర్థి ఆఫర్
50 లక్షలు ఇస్తానన్న మరొకరు
రసవత్తరంగా తూర్పుతాళ్లు పంచాయతీ ఎన్నిక
నరసాపురం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామ పంచాయతీ ఎన్నిక రసవత్తరంగా మారింది. పోటీకి పలువురు కాలు దువ్వుతుండటంతో ఎన్నిక ఏకగ్రీవం చేయాలని గ్రామపెద్దలు ముందుకొచ్చారు. బుధవారం పార్టీలకు ఆతీతంగా సమావేశమయ్యారు. పోటీలో ఉన్న అభ్యర్థులతో చర్చించారు.‘ఎన్నిక జరిగితే రూ.లక్షలు వృథా అవుతుంది. కలసిగట్టుగా ఉంటున్న మన మధ్య అంతరం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏకగ్రీవం చేసుకుందాం. గ్రామ అభివృద్ధి, ఆలయాలు, చర్చిలు, ఇతర ప్రార్థనా మందిరాలకు మీరేం ఇస్తారు?’ అంటూ అభ్యర్థులను ఆరా తీశారు.
ఒక అభ్యర్థి రూ.50 లక్షలు ఇస్తానంటూ ముందుకురాగా... మరొకరు ఎకరం పొలం ఇస్తానని ప్రకటించారు. ‘నామినేషన్ల ప్రక్రియ మొదలైన తరువాత మరోసారి కూర్చుని చర్చిద్దాం. ఎవరైనా నామినేషన్ వేసినా వారితో తీయించే ప్రయత్నం చేద్దాం. లేని పక్షంలో ఎన్నిక జరిపేద్దాం’ అని నిర్ణయించారు. ఈసారి ఈ పంచాయతీ ఓసీ జనరల్‌కు వచ్చింది. కూటమి పార్టీకి మంచి పట్టున్న గ్రామం. ఇక్కడ పోటీకి ముగ్గురు అభ్యర్థులు(యువకులు) రెడీ అవుతున్నారు. గ్రామంలో పరిస్థితులు ప్రశాంతంగా ఉండాలన్న అభిప్రాయంతో పెద్దలు చేసిన ఏకగ్రీవం ఆలోచన... ఏ మేరకు సఫలమవుతుందనేది నామినేషన్ల గడువు ముగిసిన తరువాతే తేలుతుంది.
ఈ వార్తలనూ చదవండి:
ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు
15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు