తొలి విడత పల్లె పోరు నేడే!
ABN , Publish Date - Nov 26 , 2026 | 02:44 AM
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో తొలివిడత పోరుకు రంగం సిద్ధమైంది. 26 జిల్లాల్లో 42 రెవెన్యూ డివిజన్లు, 201 మండలాల పరిధిలోని 3240 గ్రామ పంచాయతీల్లో...
తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్
మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు
ఆ వెంటనే ఉపసర్పంచ్ ఎన్నిక కూడా..
23 పట్టణ సంస్థలకూ నేడే పోలింగ్
30న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన
అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో తొలివిడత పోరుకు రంగం సిద్ధమైంది. 26 జిల్లాల్లో 42 రెవెన్యూ డివిజన్లు, 201 మండలాల పరిధిలోని 3240 గ్రామ పంచాయతీల్లో నేడు ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు కలిపి 74,45,583 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 36,64,884 మంది పురుషులు, 37,80,328 మంది మహిళలు, 371 మంది ఇతరులు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 1,15,444 మంది అధికంగా ఉండడం విశేషం.
ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ సీసీ కెమెరాలు, వీడియో చిత్రీకరణ, వెబ్‌క్యాస్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి విడతలో 40,781 పోలింగ్ కేంద్రాలకు గాను.. ఉపసంహరణలు, ఏకగ్రీవాలు, హేతుబద్ధీకరణ అనంతరం 31,614 పోలింగ్ కేంద్రాలు మిగిలాయి. వీటిలో 9469 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. 5739 పోలింగ్ గదుల్లో వీడియో చిత్రీకరణ, 6303 గదుల్లో వెబ్‌క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేపట్టనున్నారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఆ వెంటనే ఉపసర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. రీపోలింగ్ అవసరమైతే 27న ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు నిర్వహిస్తారు.
సర్పంచ్ స్థానాల్లో 19.24 శాతం ఏకగ్రీవం..
తొలి విడతలో 709 పంచాయతీలకు సర్పంచ్‌లతో పాటు అన్ని వార్డులూ ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్ స్థానాల్లో 19.24 శాతం ఏకగ్రీవం కాగా.. 80.76 శాతం స్థానాల్లో పోటీ నెలకొంది. అత్యధికంగా తిరుపతి జిల్లాలో 136 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 39,832 వార్డులకు గాను 14,731 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 25,057 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. వార్డు సభ్యుల స్థానాల్లో 36.98 శాతం ఏకగ్రీవం కాగా.. 63.02 శాతం స్థానాల్లో పోటీ నెలకొంది.
23 పట్టణ సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం
రాష్ట్రంలో మిగిలిన 23 పట్టణ స్థానిక సంస్థలకు గురువారం పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యా యి. వీటిలో 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలున్నాయి. మేయర్/చైర్‌పర్సన్ స్థానాలకు 170 మంది బరిలో ఉన్నారు. అదేవిధంగా మొత్తం 1010 వార్డులకు గాను 41 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో 5 స్థానాల్లో పోటీ లేకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది. మిగిలిన 964 వార్డులకు 2968 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
30వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా వెల్లడించారు. నాలుగు కార్పొరేషన్లు.. శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి.. 19 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు ఆమదాలవలస(శ్రీకాకుళం జిల్లా), రాజాం (విజయనగరం), పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు(పశ్చిమ గోదావరి), చింతలపూడి (ఏలూరు), గుడివాడ, తాడిగడప (కృష్ణా), పొన్నూరు (గుంటూరు), బాపట్ల (బాపట్ల), నరసరావుపేట (పల్నాడు), పొదిలి (మార్కాపురం), కందుకూరు (ప్రకాశం), కావలి, అల్లూరు(నెల్లూరు), గూడూరు, శ్రీకాళహస్తి (తిరుపతి), బి.కొత్తకోట(అన్నమయ్య జిల్లా).. మొత్తం ఈ 23 పట్టణ సంస్థల పరిధిలో 24,98,312 మంది ఓటర్లు ఉన్నారు.
ఉల్లంఘనలపై కఠిన చర్యలు: ఐజీ
స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని ముందస్తు భద్రతా చర్యలూ చేపట్టిందని రాష్ట్ర ఎన్నికల సంఘం కోఆర్డినేషన్ ఐజీ బి.రాజకుమారి తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్