మద్యం పాలసీ సక్సెస్
ABN , Publish Date - Oct 09 , 2026 | 05:16 AM
కొత్త మద్యం పాలసీతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. షాపుల రెన్యువల్, దరఖాస్తు ఫీజుల ద్వారా రూ.817 కోట్లు వచ్చింది. సుమారు రూ.900 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా...
రెన్యువల్, దరఖాస్తుల రూపంలో 817 కోట్ల ఆదాయం
అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): కొత్త మద్యం పాలసీతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. షాపుల రెన్యువల్, దరఖాస్తు ఫీజుల ద్వారా రూ.817 కోట్లు వచ్చింది. సుమారు రూ.900 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా దాదాపుగా అంత ఆదాయమూ రావడంతో ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. 2026-27 ఏడాదికి ఎక్సైజ్ శాఖ వినూత్న విధానంలో కొత్త మద్యం పాలసీ ప్రకటించింది. గతంలో ఎప్పుడూలేని విధంగా లైసెన్స్‌ల రెన్యువల్‌కు అవకాశం ఇచ్చింది. లైసెన్స్ ఫీజులో 38శాతాన్ని రెన్యువల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌గా నిర్ణయించింది. ఆమేరకు నగదు కట్టిన వారికి షాపులు రెన్యువల్ చేశారు. ఈవిధంగా రాష్ట్రంలోని 3,652 షాపులకుగాను 2929 షాపుల లైసెన్సీలు రెన్యువల్ చేసుకున్నారు. దీంతో గతంలో మిగిలిపోయిన 89 షాపులతో కలిపి మొత్తం 807 షాపులకు లాటరీ ద్వారా లైసెన్సీలను ఎంపిక చేసేందుకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. వాటిలో 517 షాపులకు 4 లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. వాటికి గురువారం లాటరీ తీసి, లైసెన్స్‌లు జారీ చేశారు. ఇంకా 290 షాపులు మిగిలిపోయాయి. వాటికి త్వరలో రీనోటిఫికేషన్ జారీచేయనున్నారు. కాగా రెన్యువల్ ఆర్‌ఈటీ, దరఖాస్తు ఫీజుల రూపంలోనే రూ.817 కోట్లు రావడం మంచి పరిణామమేనని ప్రభుత్వం భావిస్తోంది.
ఆ జిల్లాల్లో ఎక్కువ మిగిలాయి
పార్వతీపురం మన్యం, పోలవరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఒక్క షాపు కూడా మిగల్లేదు. మొత్తంగా 92శాతం షాపులు రెన్యువల్, లాటరీ రూపంలో వెళ్లగా, 8శాతం షాపులు మిగిలాయి. కడపలో అత్యధికంగా 34 షాపులు మిగిలిపోయాయి. నెల్లూరులో 28, తిరుపతిలో 20, గుంటూరులో 19, ప్రకాశంలో 17, పశ్చిమగోదావరిలో 17 షాపులు మిగిలాయి. అధికారులు మరింత సమర్థవంతంగా పనిచేసి ఉంటే ఈ జిల్లాల్లో ఇంకా కొన్ని షాపులు వెళ్లేవని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
ముఖం చాటేసిన వ్యాపారులు
మద్యం వ్యాపారుల్లో కొందరి తీరుపై ప్రభుత్వస్థాయిలో అసహనం వ్యక్తమవుతోంది. పాలసీకి ముందు షాపుల రెన్యువల్‌పై లైసెన్సీలతో ఎక్సైజ్ అధికారులు చర్చించారు. ఆ సమయంలో అందరూ రెన్యువల్ చేసుకుంటారని, అదే ఉత్తమ విధానం అని చెప్పిన లైసెన్సీలు.. తీరా రెన్యువల్‌కు నోటిఫికేషన్ ఇచ్చాక ముఖం చాటేశారు. లైసెన్సీల్లోనూ సుదీర్ఘకాలం నుంచి ఉన్నవారే రెన్యువల్‌కు దూరం కావడంతో వారిని చూసి ఇంకొంతమంది రెన్యువల్ చేసుకోలేదు. రెన్యువల్ కావాలని కోరినవారే ఇలా చేయడంతో అధికారుల్లో అసంతృప్తి నెలకొంది.
మొత్తంగా పాలసీ సక్సెస్
92శాతం షాపులకు లైసెన్స్‌లు కేటాయించడంతో పాలసీ సక్సెస్ అయ్యిందని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. వాస్తవానికి ఈ పాలసీ ఫెయిల్ అవుతుందని ఎక్కువ మంది భావించారు. గత పాలసీలో హామీ మేరకు ప్రభుత్వం మార్జిన్ ఇవ్వలేదని, దీంతో నష్టాలు వస్తున్నాయని కొందరు వ్యాపారులు ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 700కు పైగా షాపులకు నష్టాలు వచ్చినట్లు భావిస్తున్నారు. ఈ తరుణంలో కొత్త పాలసీకి వెళ్తే దరఖాస్తులు పెద్దగా రాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం రెన్యువల్‌కు మొగ్గు చూపింది. గత పాలసీ సమయంలో వచ్చిన దరఖాస్తు రుసుములను అంచనా వేసి ఏడాది కాలానికి రెన్యువల్ ఆర్‌ఈటీ నిర్ణయించింది. దాదాపు 80శాతం షాపులు రెన్యువల్ అయ్యాయి.
ఈ వార్తలనూ చదవండి:
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..
డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు