ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు
ABN , Publish Date - Aug 19 , 2026 | 08:16 PM
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 100 అర్బన్ లోకల్ బాడీలకు ఎన్నికలు నిర్వహించేందుకు MAUD శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 87 మున్సిపాలిటీల గడువు ముగియగా.. నవంబర్‌తో మరో 13 మున్సిపాలిటీల గడువు ముగియనుంది. వివరాల్లోకి వెళితే..
అమరావతి, ఆగస్టు 19: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (MAUD) శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మొత్తం 100 అర్బన్ లోకల్ బాడీలకు (ULBs) ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో ఇప్పటికే పాలకవర్గాల గడువు ముగిసిన 87 పురపాలక సంఘాలు ఉండగా, వచ్చే నవంబర్‌తో పదవీకాలం ముగియనున్న మరో 13 మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలకు ముందస్తు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టం చేసింది. అయితే ఈ రిజర్వేషన్ల ఖరారు సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
ఓటర్ల జాబితా, వార్డుల విభజనపై దృష్టి..
ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా సిద్ధం చేయడం, వార్డుల విభజన, ఇతర ఎన్నికల ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేసి నోటిఫికేషన్ ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (SEC) ప్రభుత్వం ఆదేశించింది. ఎన్నికలను సకాలంలో నిర్వహించేందుకు సంబంధిత శాఖలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించింది. మరోవైపు 16వ ఆర్థిక సంఘం గ్రాంట్లు సాధించడమే లక్ష్యంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఎన్నికలు పూర్తయితే స్థానిక సంస్థలకు ఎన్నికైన పాలకవర్గాలు ఏర్పడి పరిపాలన మరింత వేగవంతం కానుంది.
ఇవి కూడా చదవండి
తివాచీని ఇలా కూడా ఉతుకుతారా? వీడియో వైరల్
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.13,041 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం..