Share News

ఇక పరిషత్‌ పీఠాల వంతు

ABN , Publish Date - Nov 11 , 2026 | 03:57 AM

స్థానిక పట్టణ సంస్థలకు ప్రత్యక్ష పోరు ముగిసింది. పరిషత్‌ చైర్మన్ల ఎన్నిక మిగిలి ఉంది. ఈ ప్రక్రియకు శ్రీకారం చుడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం నోటిఫికేషన్‌ జారీచేసింది.

ఇక పరిషత్‌ పీఠాల వంతు

  • 659 మండల పరిషత్‌లు, 28 జిల్లా పరిషత్‌లకు నెల 5న ఎన్నికలు.. 7న ఫలితాలు

  • పరిషత్‌ కొత్త అధిపతులను పరోక్షంగా ఎన్నుకునే ప్రక్రియ కోసం నోటిఫికేషన్‌

  • నామినేషన్ల ప్రక్రియ కోసం ఈ నెల 14న నోటీసులు

  • 19న మండల, 20న జిల్లా పరిషత్‌ల్లో ఆ ప్రక్రియ

  • ఆ రోజు ఉదయం 10 గంటలకు నామినేషన్ల స్వీకరణ

  • 12 గంటలకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా

  • మధ్యాహ్నం 3 వరకు ఉపసంహరణకు అవకాశం

  • ఆ వెంటనే ఎన్నికలు..కొత్త అధిపతుల ప్రకటన

  • తమ సభ్యులకు విప్‌ చేయనున్న రాజకీయ పార్టీలు

  • ఈ క్రమంలోనే కో-ఆప్టెడ్‌ సభ్యుల నియామకం

అమరావతి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): స్థానిక పట్టణ సంస్థలకు ప్రత్యక్ష పోరు ముగిసింది. పరిషత్‌ చైర్మన్ల ఎన్నిక మిగిలి ఉంది. ఈ ప్రక్రియకు శ్రీకారం చుడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 659 మండల పరిషత్‌లకు, 28 జిల్లా పరిషత్‌లకు కొత్త అధిపతులను పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. ఈ నెల 19న ఎంపీపీలు, మండల ఉపాధ్యక్షులు; 20వ తేదీన జడ్పీ చైర్‌పర్సన్‌లు, వైస్‌ చైర్మన్‌లను ఎన్నుకుంటారని ఆ నోటిఫికేషన్‌లో ఈసీ తెలిసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఈ నెల ఐదో తేదీన ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

అయితే తుఫాను ప్రభావం కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి, ఏలూరు జిల్లాలో నాలుగు మండలాలు..మొత్తం మొత్తం ఐదు మండలాలకు సంబంధించి పోలింగ్‌ను ఆరో తేదీకి వాయిదావేసి, వాటినీ నిర్వహించారు. 5న జరిగిన పోలింగ్‌పై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఐదు జిల్లాల్లోని ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో, ఆ మరునాడు ఎన్నికలు నిర్వహించారు. అన్నీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 7న ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజు ఫలితాలను ప్రకటించారు.


తర్వాత దశలో..

మండల ప్రజాపరిషత్‌లలో కో-ఆప్టెడ్‌ సభ్యులు, ఉపాధ్యక్షులను, జిల్లా ప్రజాపరిషత్‌ల్లో కో-ఆప్టెడ్‌ సభ్యులు, చైర్‌పర్సన్‌లు, వైస్‌ చైర్‌పర్సన్లను తర్వాతి దశలో ఎన్నుకుంటారు. ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు తమలో ఒకరిని మండల పరిషత్‌ అధ్యక్షునిగా, మరోకరిని ఉపాధ్యక్షునిగా, జడ్పీటీసీ సభ్యులు తమలో ఒకరిని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా, మరొకరిని వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నుకుంటారు. ఈ ఎన్నికను చేపట్టే ముందు, ప్రిసైడింగ్‌ అధికారులు ప్రత్యేక సమావేశాలను నిర్వహించి సభ్యులకు ఆ ప్రక్రియపై అవగాహణ కల్పిస్తారు.

కో-ఆప్టెడ్‌ సభ్యులంటే ఎవరు?

ప్రతి మండల ప్రజాపరిషత్‌లో ఒక కో-ఆప్టెడ్‌ సభ్యుడిని, ప్రతి జిల్లా ప్రజాపరిషత్‌లో ఇద్దరు కో-ఆప్టెడ్‌ సభ్యులను ఎన్నుకుంటారు. ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు, జడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల కంటే ముందే కో-ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. ఈ సభ్యులు మత మైనారిటీ లేక భాషాపరమైన మైనారిటీ వర్గాలకు చెందిన వారై ఉండాలి. మతపరమైన మైనారిటీల్లో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జొరాస్టియన్లు ఉంటారు. తెలుగు మాతృభాష కాని ఇతర భాషలను మాట్లాడే వారిని భాషాపరమైన మైనారిటీలుగా పరిగణిస్తారు.

ఎన్నిక ప్రక్రియ ఇలా..

చేతులు పైకెత్తి ఓటు వేసే విధానంలో ఈ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ సభ్యులకు పార్టీ విప్‌ను విడుదల చేస్తాయి. ఆ విప్‌ను సభ్యులు పాటించాల్సి ఉంటుంది. కో-ఆప్టెడ్‌ సభ్యులకు ఈ నిబంధన వర్తించదు. ఎక్స్‌-అఫిషియో సభ్యులుగా వ్యవహరించే ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారు. కానీ, వారికి ఓటు హక్కు ఉండదు.


14 లోపు నోటీసులు..

మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ అధిపతుల ఎన్నిక ప్రక్రియకు శ్రీకారం చుడుతూ, ఈ నెల 14న ప్రిసైడింగ్‌ అధికారి నోటీసు ఇస్తారు. 19న ఎంపీపీకి, 20న జడ్పీకి ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు అందులో పేర్కొంటారు. మండల పరిషత్‌ల విషయంలో, పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లను 18వ తేదీ ఉదయం 10 గంటలకు స్వీకరిస్తారు. వాటిపై రెండు గంటలపాటు పరిశీలన జరుపుతారు. అర్హత సాధించిన అభ్యర్థుల నామినేషన్లను 12 గంటలకు ప్రకటించారు.

అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకునేందుకు మధ్యాహ్నం 1 గంట వరకు అవకాశం ఇస్తారు. ఈ క్రమంలోనే కో-ఆప్టెడ్‌ సభ్యులను ఎన్నుకుంటారు. సభ్యులంతా కలిసి ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమమంతా మధ్యాహ్నం 3 గంటలకల్లా పూర్తి చేస్తారు. ఆ వెంటనే మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. జిల్లా పరిషత్‌ల విషయంలోనూ ఇదే ప్రక్రియను అనుసరిస్తారు. మొత్తం కార్యక్రమం ప్రిసైడింగ్‌ అధికారి పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ మేరకు షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 04:05 AM