Share News

నేరమయ రాజకీయాలకు ఆద్యుడు జగన్‌ : మంత్రి పయ్యావుల

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:20 AM

రాష్ట్రంలో నేరమయ రాజకీయాలకు శ్రీకారం చుట్టి, వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్‌ దక్కుతుందని మంత్రి పయ్యావుల కేశవ్‌ విమర్శించారు.

నేరమయ రాజకీయాలకు ఆద్యుడు జగన్‌ : మంత్రి పయ్యావుల

ఉరవకొండ, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నేరమయ రాజకీయాలకు శ్రీకారం చుట్టి, వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్‌ దక్కుతుందని మంత్రి పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. అనంతపురం జిల్లా కౌకుంట్లలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఎన్నికల సంఘాలను రాజకీయ అవసరాల కోసం దుర్వినియోగం చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆయనే. గతంలో ఎన్నికల కమిషనరే ప్రాణహాని ఉం దని, పొరుగు రాష్ర్టానికి వెళ్లి రక్షణ పొందాల్సిన పరిస్థితిని కల్పించింది జగన్‌ కాదా? స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో సీఈవోనే బెదిరించిన సంఘటనలను ప్రజలు ఇంకా మరిచిపోలేదు. ప్రజాస్వామ్యం, ఎన్నికల గురించి జగన్‌ మాట్లడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది.

పురపాలక ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షతీర్పును ఇచ్చిన తర్వాత ఇప్పుడు అభూత ప్రచారాలు చేయడం ఆయన అసమర్థతకు నిదర్శనం. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. బెంగళూరు నుంచి నేషనల్‌ మీడియాను వెంట వేసుకుని వచ్చి, ఏదో జరిగిపోయిందని తప్పుడు ప్రచారం చేయడం జగన్‌ పనిగా పెట్టుకున్నారు. పోలింగ్‌ బాక్సులను ఎత్తుకెళ్లింది వైసీపీ వాళ్లే. పోలీసులపై దాడి చేసి పోలీసుల మీదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు ఇలాంటి సిగ్గుమాలిన నాటకాలకు తెరలేపారు’ అని పయ్యావుల విమర్శించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటెత్తిన పల్లెలు

అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ

Updated Date - Nov 06 , 2026 | 06:21 AM